మిర్యాలగూడ ప్రజాలహరి
ఈ ఖరీఫ్ లో రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.
రైస్ మిల్లర్లు ఎలాంటి జాప్యం లేకుండా మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే దించుకోవాలని కోరారు.
గురువారం ఆమె మిర్యాలగూడలోని రామకృష్ణ రైస్ మిల్ ను తనిఖీ చేసి మిల్లింగ్ కెపాసిటీ, బ్యాంకు గ్యారంటీ,బాయిల్డ్ రైస్ ప్రక్రియ తదితర అంశాలపై రైస్ మిల్లు యజమానితో మాట్లాడారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ ఖరీఫ్ ధాన్యం కొనుగోలు లో భాగంగా ఇప్పటివరకు నల్గొండ జిల్లాలో లక్ష 75 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం 290 కొనుగోలు కేంద్రాలకు వచ్చిందని,దేవరకొండ ప్రాంతంలో మరికొన్ని కేంద్రాలను ప్రారంభించాల్సి ఉందని, అయితే అక్కడ పంట కొంత ఆలస్యంగా వస్తుందని, సాధ్యమైనంత త్వరగా అక్కడ కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రైస్ మిల్లర్లు జిల్లాలో ధాన్యాన్ని వీలైనంత త్వరగా దించుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇలాగే మిల్లర్లు అందరూ ధాన్యాన్ని దించుకోవాలని, ఎలాంటి జాప్యం చేయవద్దు అని చెప్పారు. ధాన్యం సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని ,ధాన్యం సేకరణ పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గురువారం జారీచేసిన సూచనలను తూ.చా తప్పకుండా పాటించి రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొంటామని ఆమె వెల్లడించారు.
రెవెన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్,జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేష్,
పొర సరఫరాల డిఎం గోపికృష్ణ, ఇతర అధికారులు ఉన్నారు.
