కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలి
*మున్సిపల్ కార్మికుల సమావేశంలో డబ్బికార్
మిర్యాలగూడ ప్రజాలహరి ..
కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డబ్బికార్ మల్లేష్ డిమాండ్ చేశారు. శనివారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో మున్సిపల్ కార్మికుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల చేత అధికారులు వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని, రోజుకు 10 గంటల పని విధానాన్ని అమలు చేసి శ్రమదోపిడికి గురి చేస్తున్నారని ఆరోపించారు. కార్మికులకు కనీస వేతనం అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. కార్మికులకు సంక్షేమ పథకాలు అందడం లేదని వాపోయారు. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందడం లేదని, కనీసం దహన ఖర్చులు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. కార్మికులు చనిపోతే దహన ఖర్చుల కింద 20 వేలు ఇవ్వాలని కోరారు. పిఎఫ్ ఈఎస్ఐ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలన్నారు. ప్రతి ఆదివారం కార్మికులకు సెలవు ఇవ్వాలని కోరారు. కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ఉండి ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు అమలు చేస్తే కార్మిక వ్యతిరేక విధానాలను ఉద్యమాల ద్వారా తిప్పి కొట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎం సి పి ఐ యు రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వస్కుల మట్టయ్య, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి డా.మల్లు గౌతమ్ రెడ్డి, కార్మికుల సంఘాల నాయకులు చిలుముల వెంకన్న, మోహన్, వెంకన్న, ఈశ్వరమ్మ, డి.మోహన్, లింగయ్య, కళావతి, నాగమణి తదితరులు పాల్గొన్నారు
