నిర్మల్ ఉత్సవాలు….
ప్రజాలహరి….
ఒక ప్రాంతంలో నివసించే మనుషులు… వాళ్ళు మాట్లాడే భాష, వాళ్ళ ఆచార వ్యవహారాలు, వాళ్ళు పండించే పంటలు,వాళ్ళ కళా నైపుణ్యం,వాళ్ళ కట్టు, బొట్టు, కట్టుబాట్లు….వాళ్ళ నడవడిని, ఇవన్నీ వాళ్ళ దైనందిన జీవితాల్లో అనాదిగా స్వంతం చేసుకున్నారు.ఇప్పటికీ ఈ ఆధునిక యుగంలో కూడా తమ పూర్వీకుల నుండి వారసత్వంగా వచ్చిన,తమ తాతలు, తండ్రులు పాటించిన ఆచార వ్యవహారాలను పాటించడం జరుగుతూనే ఉంది.ఇది కేవలం కొన్ని ఊర్లల్లో మాత్రమే కొనసాగుతుంది.ప్రస్తుతం గ్రామాలన్నీ పట్టణీకరణను అరువు తెచ్చుకుని,స్ధానిక యువత ఆధునిక పోకడలకు
బానిసై, పెద్దవాళ్ళ మాటలను పెడచెవిన పెడుతున్నారు.
కాలం గడిచే కొద్దీ విలువలు అటకెక్కుతున్నాయి.జీవన ప్రమాణం పెరిగే కొద్దీ మనిషి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్నాయి.మెరుగైన ఆర్ధిక పరిస్థితులతో
మనుషుల కట్టూ బొట్టూ వ్యవహారాల్లో మార్పు వచ్చింది.
వ్యవసాయమే జీవనాధారమై బతికిన ఎంతో మంది రైతు కుటుంబాల్లో ఈ తరం పిల్లలకు వ్యవసాయం అంటేనే తెలియని పరిస్థితి ఏర్పడింది.అప్పట్లో మా ఊర్లో ఫలానా
సిస్టమ్స్, కస్టమ్స్ ఉండేవి అనీ మా ఊర్లో ఫలానా రీతు రివాజులుండేవనీ,మా ఊర్లో మహిళల కట్టూ బొట్టూ వ్యవహారాల్లో ఒక పద్దతి ఉండేదనీ, ఫలానా వడ్రంగి చాలా అద్భుతంగా నాగలిని తయారు చేసేవాడనీ, ఫలానా కమ్మరి మనం పంట పండించేందుకు ఉపయోగ పడే నాగలి కొర్రుని చాలా శ్రద్ధతో చేసేవాడనీ, ఫలానా కుమ్మరి చాలా అందంగా కుండలను తయారు చేసే వాడనీ,చెప్పుకునే దుస్తితిలో ప్రస్తుతం మనం ఉన్నాం గ్రామాల్లో కుల వృత్తులు చేసుకునే వారు ఏమయ్యారు.వాళ్ళ జీవనోపాధి ఏంటి…అంటే వాళ్ళ జీవన స్థితిగతులు చాలా దారుణంగా ఉన్నాయనీ చెప్పక తప్పదు…..కట్ చేస్తే….
ఒక ఊరికి సంబంధించిన సాంస్కృతిక, సాహిత్య, సామాజిక,అంశాలను ఒక చోట ప్రదర్శనగా ఏర్పాటు చేసి వివిధ కళల్లో స్థానికులు రూపొందించిన,తమ తమ ప్రతిభా పాటవాలను,సేకరించిన పురాతన వస్తువులను ఒక స్టాల్ లో పొందుపరిచి రాబోయే తరాలకు చూపించడం అనే ప్రక్రియ అద్భుతమైనది.
ఇలాంటి ఒక పనికి పూనుకున్నారు నిర్మల్ కలెక్టర్.
నిర్మల్ ఉత్సవాలు….
నిర్మల్ యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని ఘనంగా జరుపుకుందాం…మన నిర్మల్ లో వేడుకలతో, సాంస్కృతిక ఆవిష్కరణలతో మునిగి తేలుదాం…..
అన్న టాగ్ లైన్ తో మూడు రోజుల ఉత్సవాలను నిర్వహించాలన్న ఆలోచన వచ్చి నిర్వహించిన జిల్లా కలెక్టర్ అభినందనీయులు.మన కల్చర్, పూర్వం మన
జీవన విధానం,మన పురాతన గుడులు,మన శిల్ప సంపద,మన శాసనాలు,మన ఆహారపు అలవాట్లు… పిల్లలు ఆడుకునేందుకు వీలుగా వివిధ ఆట వస్తువులు వీటన్నింటికీ సంబంధించిన విశేషాలతో నిర్మల్ లోని ఎన్ టీఆర్ స్టేడియంలో ఒక చిన్న పాటి ఫెటే (మన ఊరి భాషలో చెప్పాలంటే జాతర అని చెప్పుకోవచ్చు) ఏర్పాటు చేశారు.ఈ విధంగా ఒక జిల్లా కలెక్టర్ ఇనిషియేషన్ (చొరవ) తీసుకోవడం స్థానికంగా అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు….కట్ చేస్తే….
నేను నిన్న సాయంత్రం వర్క్ అయిపోయాక
నా హోటల్ రూం దగ్గరలో ఉన్న ఎన్టీఆర్ స్టేడియం ముందు జనాల, వాహనాల హడావుడిని చూసి నేనూ నిర్మల్ ఉత్సవం చూద్దామని వెళ్ళాను.దానికి ఒక కారణం ఉంది, నేను రాత్రి పదకొండు గంటలకు హైదరాబాద్ కి బస్ బుక్ చేసుకున్నాను.చాలా సంవత్సరాల నుండి నేను నిర్మల్ వస్తున్నాను కానీ ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు.మెల్లగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళాను.
టికెట్ లేదు ఫ్రీ ఎంట్రీ.స్టేడియం ఒక వైపున ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి.ఆ వెనకకు పిల్లల కోసం జాయింట్ వీల్… ఇతర ఆటలకు సంబంధించిన వాటిని అమర్చారు.
స్టేడియం మధ్యలో పెద్ద స్టేజీ ఏర్పాటు చేశారు.ఆ స్టేజీపై సాయంత్రాలు కల్చరల్ ఆక్టివిటీస్ నిర్వహించుకునే సౌకర్యం కల్పించారు.తమ పిల్లలు స్టేజీ మీద భరతనాట్యం, కూచిపూడి నృత్యాలు చేస్తుంటే దానిని
తమ సెల్ ఫోన్లో బంధించే బిజీలో తల్లిదండ్రులు ఉన్నారు.
సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ పండించిన పంటలు, పండ్లు, కూరగాయలకు సంబంధించి రైతు బిడ్డ మన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన ఒక స్టాల్ బాగుంది.వాళ్ళు పండించిన తెల్ల నువ్వులు,నల్ల బియ్యం, చిట్టి ముత్యాలు,పండ్లు మొదలైన వాటిని ప్రదర్శనలో ఉంచి వచ్చిన వారికి సేంద్రియ వ్యవసాయ
పద్దతులపై అవగాహన కల్పిస్తున్నారు.అదే లైనులో ప్రీతీస్ క్రియేటివ్ స్పేస్ అనే పేరుతో,ఏర్పాటు చేసిన స్టాల్ ని చూస్తే నిర్మల్ జిల్లా కళలకు, కళాకారులకు నిలయమని
అర్థం అవుతుంది.ఆ స్టాల్ లో మనం పనికిరావని బయట పారేసే వస్తువులతో హ్యాండ్ మేడ్ బొమ్మలను,
పేయింటిగ్స్ తయారు చేసి ప్రదర్శనలో పెట్టారు.చాలా క్రియేటివ్ గా ఉన్న ఆ బొమ్మలను,పేయింటిగ్స్ ని మనం
కొనుక్కునే సౌకర్యం కూడా ఉంది.నిర్మల్ ఊరు కొయ్య బొమ్మలకు ఫేమస్.ఇక్కడ తయారు చేసిన కొయ్య బొమ్మలు దేశ విదేశాల్లో ఎంతో ప్రాచుర్యం పొందాయి.
నిర్మల్ కొయ్య బొమ్మల పరిశ్రమ సహకార సంఘం పేరుతో
ఏర్పాటు చేసిన స్టాల్ లో కొన్ని ఏళ్లుగా కొయ్య బొమ్మలు తయారు చేస్తున్న కళాకారుడు శ్రీనివాస్ రాచర్ల కలిసి
చాలా విషయాలు తెలియజేసాడు.పందొమ్మిది వందల
యాభై అయిదులో వాళ్ళ నాన్న రాచర్ల లింబయ్య ఈ కొయ్య బొమ్మలను తయారు చేయడం వాళ్ళ పూర్వీకుల నుంచి నేర్చుకొని ఆ తరువాత రోజుల్లో ఆ కళను చాలా మందికి నేర్పించారు.అలా ఈ కళను వారసత్వంగా పొందిన శ్రీనివాస్ కొయ్య బొమ్మల తయారీ ని చాలా మందికి నేర్పిస్తూ, వారికి జీవితాన్ని ఇవ్వడమే కాకుండా తన తండ్రి ఆశయాలకు జీవం పోస్తున్నారు.
ఇంకొంచెం ముందుకు వెళ్ళాక ఒక స్టాల్ విడిగా కనిపించింది.ఆ స్టాల్ పిల్లలు, పెద్దలతో నిండిపోయి ఉంది.దగ్గరికి వెళ్ళి చూసాక తెలిసింది…ఇది
కదా నిర్మల్ సాంస్కృతిక వారసత్వ వైభవం అంటే….అని
అనిపించింది.ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకులు, డాక్టర్ తుమ్మల దేవరావ్ పరిశోధించి,సేకరించిన ఎన్నో పురాతన వస్తువులను ఒక్కచోట చేర్చి ప్రదర్శించడం గొప్ప విషయం.ఈ స్టాల్ ని మానస సాహితీ సాంస్కృతిక సేవా సంస్థ, డాక్టర్ కావేరి ఫౌండేషన్ లో సమర్పణలో ఏర్పాటు చేశారు.నిజంగా ఈ స్టాల్ లో పొందుపరచిన వస్తువులు మనం మన పూర్వ కాలంలో వాడినవే.ఇప్పటి తరానికి తెలియదు.అప్పట్లో వాడుకలో ఉన్న నాణాలు,ఇత్తడి, రాగి పాత్రలు,మర చెంబులు, పాన్ దాన్ బాక్సులు, కందీళ్ళు, దీపపు ఎక్కాలు,సంగీత వాయిద్యాలు రుబ్బురోళ్ళు, తాళపత్ర గ్రంథాలు,గ్రామ్ ఫోన్ రికార్డులు…..ఇలా మనం చిన్నప్పుడు మన ఇండ్లల్లో వాడిన ప్రతి చిన్న వస్తువును సేకరించి అక్కడ ప్రదర్శించారు.ఇంతే కాకుండా
దేవరకోట వెంకటేశ్వర ఆలయం, శ్యాం ఘడ్, వెంకటేశ్వర ఘడ్,ఖిల్లాగుట్ట,రాణీవాసం,బత్తీస్ గడ్,నిర్మల్ కోట,గ్రామ దేవత, రెండు వేల సంవత్సరాల నాటి పూసల పేర్లు,
ఇనుము తయారు చేసే గుమ్మటాలు, బీర వెళ్లి కోట,ముదోల్ లో నాలుగు వందల సంవత్సరాల నాటి
ఇల్లు…. వీటన్నింటినీ ఒక ఫ్లెక్సీ లో ముద్రించి,ఆ ఫ్లెక్సీ ని
ఆ స్టాల్ కి ఒకవైపు అతికించారు.మొత్తంగా ఆ స్టాల్ ని చూస్తే డాక్టర్ తుమ్మల దేవరావ్ ఎంత వ్యయ ప్రయాసలకోర్చి ఆ పురాతన వస్తువులను సేకరించాడో అర్థం అవుతుంది.ఆయనను ప్రతి ఒక్కరూ అభినందిస్తూ ఆయనతో ఫోటోలు తీసుకుంటున్నారు.నేనూ ఒక ఫోటో తీసుకున్నాననుకోండి.తన కష్టానికి ప్రతిఫలమే ఆ స్టాల్ కిక్కిరిసిన జనంతో నిండిపోయి ఉండడం.గ్రేట్ ఎఫర్ట్ సార్…. హాట్సాఫ్ టూ యూ….
ఆర్టీసీ స్టాల్ దగ్గర ఒక బోర్డు పెట్టారు.ఆ బోర్డులో నిర్మల్
ఆర్టీసీ డిపోకు సంబంధించిన పూర్తి సమాచారం ఉంది.
పందొమ్మిది వందల ముప్పై నాలుగు సంవత్సరం నవంబర్ అయిదవ తేదీన ప్రారంబించబడ్డ ఆర్టీసీ డిపో
దాదాపు అయిదు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది.
నిర్మల్ చుట్టు పక్కల పదకొండు మండలాలలోనీ మూడు వందల గ్రామాలకు ప్రయాణ వసతి కల్పించారు.చాలా ఏళ్ళ నాటి డిపోగా పేరు పొందింది.
ఒకప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని
నిర్మల్ ఊరు మహారాష్ట్ర నాగపూర్ కి రెండు వందల డెభై
కిలోమీటర్ల దూరం, హైదరాబాద్ కీ రెండు వందల ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరం ఉంది.అంటే రెండు దాదాపు ఇంచు మించు సమాన దూరమే అని చెప్పుకోవచ్చు.
అక్కడి మనుషుల మనసులు గోదావరి నది అంత స్వచ్ఛంగా ఉంటాయి.అక్కడ ఆడ,మగ అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరిదీ కష్టపడే తత్వం.వ్యవసాయమే
ప్రధాన వృత్తిగా వరి, మొక్కజొన్న,పసుపు పంటలు పండిస్తారు.నిర్మల్ ఊరు చుట్టు పక్కల ఉన్న పదకొండు
చెరువులు ఎప్పుడూ నీళ్ళతో కళకళలాడుతూ ఉంటాయి.గోదావరి నీళ్ళు రాకపోయినా ప్రాజెక్టుల ద్వారా
వచ్చే నీళ్ళు,చెరువుల నీళ్ళను వాళ్ళు వ్యవసాయ అవసరాలకు వినియోగించుకుంటారు.అక్కడి మహిళల
కట్టూ బొట్టూ వ్యవహారాల్లో పాత తరం సాంప్రదాయం
కనిపిస్తుంది.ఇప్పటికీ గ్రామాల్లో అరవై శాతం మహిళలు
గోచీ చీర కట్టు,ముక్కుపుడకతో పూర్తి సాంప్రదాయ బద్దంగా కనిపిస్తారు.వ్యవసాయ పనుల్లో మగవారితో సమానంగా ఆడవాళ్ళు కష్టపడతారు.కాలం కలిసి రాకపోతే వ్యవసాయ కూలీలుగా కూడా మారి కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటారు.మగవాళ్ళు కూడా ఇక్కడ పనులు లేకుంటే విదేశాలకు వెళ్లి కష్టపడుతుంటారు….కట్ చేస్తే…
మూడు రోజుల పాటు నిర్వహించిన నిర్మల్
ఉత్సవాల్లో ఇంకొన్ని స్టాల్ల్స్ ని ఏర్పాటు చేసి వుంటే బాగుండేదనీ నాకు అనిపించింది.నిర్మల్ గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించే స్టాల్ తో పాటు, సాంప్రదాయ దుస్తులు ధరించిన నిర్మల్ గ్రామీణ మహిళ హోర్డింగ్ ని స్టేడియం ఎంట్రెన్స్ లో పెడితే బాగుండేది. స్వర్గీయ కవి భద్రయ్య,స్మారకార్ధం ఒక స్టాల్ ని ఏర్పాటు చేసి ఆయనకు నివాళులు అర్పిస్తే బాగుండేదనీ నా వ్యక్తిగత అభిప్రాయం.ప్రముఖ కవులు దామెర రాములు చక్రాధర్,మురళీధర్, తుమ్మల దేవరావ్ లాంటి కవి
దిగ్గజాలే కాకుండా, ఇంకా ఎందరో సాహితీ వేత్తలకు నిలయమైనది నిర్మల్ పట్టణం.ఈ ఉత్సవాల
సందర్భంగా వాళ్ళను కూడా గౌరవించు కుంటే బాగుండేది.జన విజ్ఞాన వేదిక సంబంధించిన ఒకే
ఒక స్టాల్ లో కొన్ని పుస్తకాలు పెట్టారు.స్థానిక కవులు, రచయితలు,వ్యాసకర్తలు రాసిన పుస్తకాలను కూడా ప్రదర్శనలో పెట్టాల్సి ఉండే… ఇవన్నీ నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు మాత్రమే.మరోసారి నిర్వహించేప్పుడు
పై అంశాలను పరిగణనలోకి తీసుకోవడమే కాకుండా
ఇంకా కొత్తగా ఆలోచిస్తే సంతోషం.
ఏది ఏమైనప్పటికీ నిర్మల్ కలెక్టర్ ఇనిషియేషన్ తీసుకొని నిర్మల్ జిల్లా సాంస్కృతిక వారసత్వాన్ని రాబోయే తరాలకు ఉపయోగపడే విధంగా
ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం అందరం అభినందించాల్సిన అంశం.నిజంగా తెలంగాణ జిల్లాలన్నింటిలో సాంస్కృతిక, సాహిత్య, సామాజిక అంశాలను తెలియజేసే ఇట్లాంటి ఫెటేను ( జాతర) నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఇలాంటి ఒక
మంచి ఆలోచన చేసిన నిర్మల్ జిల్లా కలెక్టర్ గారికి,వారికి సహకరించి విజయవంతం చేసిన జిల్లా యంత్రాంగానికి,
ఆదరించిన ప్రజలకు శుభాభినందనలు………
ప్రమోద్ ఆవంచ
7013272452