ప్రజా సమస్యలపై ఉద్యమాలకు సిద్ధం
* ఎర్రజెండా తోనే సమస్యలు పరిష్కారం
* 2 న జరిగే బహిరంగ సభ ను జయప్రదం చేయండి
* విలేకరుల సమావేశంలో జూలకంటి
మిర్యాలగూడ ప్రజాలహరి
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ భవిష్యత్తులో ప్రజా ఉద్యమాలు చేస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి చెప్పారు. శుక్రవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను గాలికి వదిలేసి రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నాయని ఆరోపించారు. దేశంలో మత విద్వేషాలు సృష్టించి ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలను చర్చించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సిపిఎం మహాసభలు నిర్వహిస్తుందని తెలిపారు. గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి వాటి పరిష్కారం కోసం ప్రజా ఉద్యమాలు చేసేందుకు మహాసభలలో కార్యచరణ రూపొందించనున్నట్లు చెప్పారు. డిసెంబర్ 2న మిర్యాలగూడలో మహాప్రదర్శన, భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని అన్ని వర్గాల ప్రజలు అత్యధికంగా హాజరై జయప్రదం చేయాలని కోరారు. మూడు, నాలుగు తేదీలలో స్థానిక బృందావన్ గార్డెన్లో ప్రతినిధుల మహాసభ జరుగుతుందని తెలిపారు. ఈ బహిరంగ సభకు పోలీట్ బ్యూరో సభ్యులు రాఘవులు హాజరవుతారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తుందని ఇప్పటివరకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒకటి కూడా పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ పాలన రెండు అడుగులు వెనక్కి ఒక అడుగు ముందుకు అనే రీతిలో ఉందని విమర్శించారు. రుణమాఫీ పూర్తిగా అమలు కాలేదని, ధరణిలో సమస్యలు పరిష్కారం కాలేదని ద్వజమెత్తారు. అవగాహన లేని కారణంగా పాలన గాడి తప్పుతుందని చెప్పారు అందులో భాగంగానే ఇప్పటివరకు ఇంకా 6 మంత్రి పదవులను నియమించలేదన్నారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తిలో ఉన్నారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలుపరిచి కాంగ్రెస్ తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలన్నారు. రాబోయే స్థానిక ఎన్నికలలోపే అన్ని సమస్యలను పరిష్కరించాలని ఇచ్చిన హామీలు అమలు పరచాలని కోరారు. వీటి అమలు కోసం భవిష్యత్తులో ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, జిల్లా కమిటీ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి, భవాండ్ల పాండు, రవి నాయక్, రాగిరెడ్డి మంగా రెడ్డి, నాగేశ్వర్ నాయక్, రవి నాయక్, ఉన్నం వెంకటేశ్వర్లు, వేణుధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.