మిర్యాలగూడ దామరచర్ల ప్రజాలహరి
@ త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో నూతన ఎనర్జీ పాలసీ
@ విద్యుత్ నిష్ణాతులు, మేధావులు, ప్రజల అభిప్రాయాలతో అసెంబ్లీలో చర్చించి నూతన పాలసీని ప్రకటించనున్నాము- రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.
నల్గొండ జిల్లా దామరచర్ల మండలం, వీర్లపాలెం వద్ద ఉన్న యాదాద్రి థర్మల్ పవర్ స్టేషషన్ లో ఆదివారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు, నీటిపారుదల ,పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ,రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతో కలిసి యూనిట్ -1 సింక్రనైజేషన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. గతంలో వై టి పి ఎస్ యూనిట్- 2 సింక్రనైజేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ 2025 మే నాటికి యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ద్వారా పూర్తిస్థాయిలో 4 వేల మెగావాట్ల విద్యుత్ ను గ్రిడ్ కు అనుసంధానం చేస్తామని తెలిపారు .
త్వరలోనే తెలంగాణ రాష్ట్ర నూతన ఎనర్జీ పాలసీని ప్రవేశపెట్టబోతున్నామని, ఇందుకుగాను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యుత్తు నిష్ణాతులు, మేధావులు, అన్ని వర్గాల ప్రజలందరి ప్రజాభిప్రాయ సేకరణ తీసుకొని, అసెంబ్లీలో చర్చించిన తర్వాత అందరి అభిప్రాయాలతో నూతన ఎనర్జీ పాలసిని ప్రకటించనున్నట్లు ఆయన వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా పవర్ డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ ఉత్పాదనను చేపడుతున్నామని, 2028 -29 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 22,488 మెగావాట్ల విద్యుత్తు డిమాండ్ ఉండవచ్చని అంచనాలు రూపొందించడం జరిగిందని, ఇది 2034- 35 నాటికి 31,809 మెగావాట్ల డిమాండ్ కు పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేసినట్లు తెలిపారు. డిమాండ్ కనుగుణంగా విద్యుత్తు ఉత్పాదన పెంచుతూ తెలంగాణ రాష్ట్రం ముందుకు వెళుతున్నదని ,రాష్ట్ర పురోభివృద్ధిని, వ్యవసాయ ,పరిశ్రమ, గృహ అవసరాలను అన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఏ రంగంలో విద్యుత్ సమస్య రాకుండా పూర్తిస్థాయిలో విద్యుత్తు అందించే విధంగా ప్రణాళికల తో ముందుకు పోతున్నట్లు ఆయన చెప్పారు. పరిశ్రమలు ,ఇతర అవసరాలకు విద్యుత్తు లేదు అని అనిపించుకోకుండా అన్ని అవసరాలు తీర్చేలా పూర్తిస్థాయిలో నాణ్యమైన విద్యుత్ అందిస్తామని ఆయన వెల్లడించారు .
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా గ్రీన్ ఎనర్జీని రాష్ట్రంలో ప్రవేశపెట్టనున్నామని, ఇందుకు తగ్గట్టుగా విద్యుత్తు ఉత్పాదన చేపట్టి రాష్ట్రాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచుతామని తెలిపారు. ఇందులో భాగంగా సాంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా 20 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు .ప్రపంచంలోని బహుళ జాతి కంపెనీలు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేయడంతో పాటు, మార్కెటింగ్, ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకుని వారు ఆశించిన గ్రీన్ పవర్ ను అందించేందుకు, ఆ విధమైన విద్యుత్ ఉత్పాదనకు చర్యలు తీసుకుంటున్నామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. థర్మల్, సోలార్, హైడ్రో, పంప్ ఎనర్జీ వంటి రకరకాల విద్యుత్ ఉత్పాదన చేపట్టనున్నామని, భవిష్యత్తులో తెలంగాణ విద్యుత్ రంగం దేశానికి ఆదర్శంగా ఉండబోతున్నదని చెప్పారు.
అంతకుముందు ఉప ముఖ్యమంత్రి, మంత్రులు దామరచర్ల వద్ద యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ కు బొగ్గు అందించే ర్యాకుల రైల్వే వ్యాగన్ ను ప్రారంభించారు .
రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ మరియు వై టి పి ఎస్ చైర్మన్ సందీప్ కుమార్ సుల్తానియా, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి,జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, నాగార్జునసాగర్ శాసనసభ్యులు కే.జయవీర్ రెడ్డి ,వైటీపీఎస్ టెక్నికల్ డైరెక్టర్ అజయ్, ప్రాజెక్ట్స్ డైరెక్టర్ సచ్చిదానంద, చీఫ్ ఇంజనీర్ సమ్మయ్య, టి పి సి సి ఈ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.