ఇంటింటి కుటుంబ సర్వే విజయవంతం చేయాలి
ప్రజాలహరి నల్గొండ
సామాజిక ,ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ఎన్యుమరేటర్ల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.
బుధవారం నల్గొండ మున్సిపల్ సమావేశ మందిరంలో సమగ్ర కుటుంబ సర్వే పై ఎన్యుమరేటర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
భవిష్యత్తులో సంక్షేమ పథకాలు, ప్రభుత్వ పాలసీల రూపకల్పనకు సమగ్ర కుటుంబ సర్వే ఎంతగానో ఉపయోగపడుతుందని కలెక్టర్ అన్నారు. అందువల్ల ఎన్యుమరేటర్లు సమగ్ర కుటుంబ సర్వేను ప్రత్యేక శ్రద్ధ వహించి చేయాలని, ఎలాంటి తప్పులు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలన్నారు. సర్వే సందర్భంగా ఏ ఇంటిని వదిలిపెట్టకూడదని, సర్వే పూర్తి చేసిన ఇంటికి స్టిక్కర్ అతికించాలని చెప్పారు. సర్వేకై సరఫరా చేసిన ప్రశ్నావళిని ఒకటికి రెండుసార్లు చదువుకోవాలని, ఏవైనా సందేహాలు తలెత్తినట్లయితే సూపర్వైజర్లను సంప్రదించాలని, ఒకవేళ సూపర్వైజర్లకు సందేహాలు వస్తే మండల స్థాయిలో నోడల్ అధికారులను సంప్రదించాలని ఆమె సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సమగ్ర కుటుంబ సర్వే ఉద్దేశం ,తదితర అన్ని విషయాలపై సమగ్రంగా తెలియజేశారు.
అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, నల్గొండ ఆర్డీవో అశోక్ రెడ్డి తదితరులు ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు