ప్రజాలహరి……రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్, అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
🔹 భారీ వర్షాలు, వరదల కారణంగా మరణించిన వ్యక్తుల కుటుంబాలకు అందించే ఎక్స్ గ్రేషియాను రూ. 4 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. వెంటనే బాధిత కుటుంబాలకు ఆ సాయం అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
🔹చనిపోయిన పాడి గేదెలు ఒక్కో దానికి ఇచ్చే ఆర్థిక సాయాన్ని రూ. 30 వేల నుంచి రూ. 50 వేలకు పెంచాలని, మరణించిన మేకలు, గొర్రెలకు ఒక్కోదానికి ఇచ్చే రూ. 3 వేల సాయం రూ.5 వేలకు పెంచాలని సీఎం ఆదేశించారు. తక్షణం బాధిత కుటుంబాలకు అందించాలని సూచించారు.
🔹 వర్షాలు, వరదల కారణంగా పూర్తిగా దెబ్బతిన్న పంటలకు ఒక్కో ఎకరానికి రూ. 10 వేల చొప్పున పంట నష్ట పరిహరం అందించేందుకు తక్షణ ఏర్పాట్లు చేయలని ఆదేశించారు.
🔹 కంటింజెన్సీ ఫండ్ కింద ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లా కలెక్టర్లకు ఒక్కొక్కరికి రూ.5 కోట్లు వెంటనే విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.
🔹 రాష్ట్రంలోనే కాకుండా, జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లు 24 గంటలు పని చేసే విధంగా ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని, వెంటనే క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని చెప్పారు.
🔹 ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, నిత్యావసర వస్తువుల పంపిణీ,, సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు.
🔹 భారీ వర్షాలు, వరదలతో వాటిల్లిన నష్టంపై అన్ని విభాగాల నుంచి ప్రాథమిక నివేదికలు తెప్పించి, కేంద్ర ప్రభుత్వం నుంచి తక్షణ సాయం కోరేందుకు నివేదికను సమర్పించాలని ఆదేశించారు.
🔹 రాష్ట్రంలో జరిగిన ఈ ప్రకృతి వైపరీత్యాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాయాలని సూచించారు.
🔹 కేంద్ర ప్రభుత్వ అధికార బృందాలతో పాటు స్వయంగా ప్రధాన మంత్రి ఈ విపత్తును పరిశీలించేందుకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.