*ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం*
*రాష్ట్రంలో 3,32,32,318 మంది ఓటర్లు- 35, 809 పోలింగ్ స్టేషన్లు*
*ఎన్నికల నిర్వహణకు 2.94 లక్షల మంది సిబ్బంది*
*155 కంపెనీల కేంద్ర పారామిలటరీ దళాలు*
*46 శాతం ఓటర్ స్లిప్పుల పంపిణీ పూర్తి*
*పోలింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత*
*రూ.212 కోట్ల నగదు,ఇతర వస్తువుల స్వాధీనం : రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ వెల్లడి*
ప్రజాలహరి జర్నలిస్ట్ జనరల్ డెస్క్
రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. బుధవారం హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో మొత్తం 3,32,32,318 ఓటర్లు ఉన్నారనీ, అందులో 1,65,28,365 మంది పురుష ఓటర్లు, 1,67,01,192 మంది మహిళా ఓటర్లు, 18 నుంచి 20 సంవత్సరాల వయసున్న యువ ఓటర్లు 9,02,960 మంది ఉన్నారని తెలిపారు. ఇప్పటి వరకు 46 శాతం ఓటర్ స్లిప్పుల పంపిణీ పూర్తయిందనీ, మిగతా వారికి రెండు రోజుల్లో పంపిణీ చేస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 35,809 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. అత్యధికంగా మల్కాజిగిరిలో 3,226, అత్యల్పంగా మహబూబాబాద్లో 1,689 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు రాష్ట్ర పోలీసుల తో పాటు 155 కంపెనీల కేంద్ర బలగాల ను ఉపయోగిస్తున్నట్టు వివరించారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. సాధారణ పరిశీలకులు, పోలీస్ అబ్జర్వర్స్, వ్యయ పరిశీలకులు ఎన్నికల నిర్వహణలో చురుగ్గా పాల్గొంటారని వెల్లడించారు. పోలీసులు, ఇతరులతో కలిపి మొత్తం 2.94 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారని పేర్కొన్నారు ఒక్క ఈవీఎం మిషన్లో నోటాతో కలిపి 16 గుర్తులు మాత్రమే వస్తాయని తెలిపారు. ఈ క్రమంలో ఏడు నియోజ క వర్గాల్లో 3, తొమ్మిది నియోజక వర్గాల్లో రెండేసి చొప్పున ఈవీఎంలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఆదిలాబాద్ స్థానంలో 12 మంది బరిలో ఉన్నందున అక్కడ ఒక్క ఈవీఎం సరిపోతుందని తెలిపారు. ఈ సారి అభ్యర్థుల సంఖ్య భారీగా ఉండటంతో 1.5 లక్షల ఈవీఎంలు ఉపయోగిస్తున్నామని వివరించారు. మూడు కేటగిరీల వారికి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ను కల్పించామని తెలిపారు. వయసు రీత్యా 80 ఏండ్ల పైబడిన వారు 10,662, పీడబ్ల్యూడీ కేటగిరిలో 11,032 మంది, అత్యవసర సర్వీసులకు చెందిన 1884 మందికి ఇప్పటి వరకు ఓటు హక్కు కల్పించి నట్టు తెలిపారు. ఈ నెల 3 నుంచి 6 వరకు 880 ఎన్నికల బృందాలు హౌమ్ ఓటింగ్ కోసం పర్యటిస్తాయని తెలిపారు. హౌమ్ ఓటింగ్కు దరఖాస్తు చేసుకున్న వారు ఆయా తేదీల్లో నిర్దేశించిన చిరునామాలో అందుబాటులో ఉండాలని సూచించారు. ఒకసారి హౌమ్ ఓటింగ్ చేసుకున్న తర్వాత తిరిగి పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడం కుదరదని చెప్పారు. డిసెంబర్ ఒకటి నుంచి ఇప్పటి వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళిలో భాగంగా ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా రూ.212 కోట్ల విలువ చేసే నగదు, బంగారం, ఇతర ఆభరణాలు, డ్రగ్స్, నార్కొటిక్స్, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఇందుకు సంబంధించి 7.185 కేసులు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలింగ్ శాతం పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, రిసెప్షన్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాల వద్ద కావాల్సిన అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నట్టు వివరించారు. రాష్ట్రంలోని ప్రతి ఓటరు బాధ్యతగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు