బీఆర్ఎస్ తోనే కార్మికుల సంక్షేమం
* పకడ్బందీగా సామాజిక భద్రతా చట్టాన్ని అమలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ * సబ్బండ వర్ణాల అభ్యున్నతికి కేసీఆర్ నిర్వర్తించిన కృషి అద్వితీయం, స్ఫూర్తిదాయకం
* ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించిన భాస్కర్ రావు
మిర్యాలగూడ ప్రజాలహరి
#కార్మికుల సంక్షేమం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు పునరుద్ఘాటించారు. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ సర్కార్ కార్మికుల సంక్షేమం, భద్రత కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసిందన్నారు. ఆయన కృషి ఫలితంగా సామాజిక భద్రతా చట్టాన్ని అమలు చేసిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ పేరొందిందన్నారు.
ప్రపంచ కార్మిక దినోత్సవం( మే డే) సందర్భంగా పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో భాస్కర్ రావు పాల్గొని జెండా ఆవిష్కరించారు. కార్మిక, కర్షక, కష్టజీవులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భాస్కర్ రావు మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన రాష్ట్రంలో పటిష్టంగా అమలయిందని అన్నారు. ఆర్టీసి, జీహెచ్ఎంసి, మత్స్య రంగం, చేనేత రంగం, భవన నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం బీఆర్ఎస్ సర్కార్ అనేక కార్యక్రమాలను అమలు చేసిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత
ప్రతీ ఏటా కార్మికులను ప్రోత్సహించేందుకు అవార్డులను, రివార్డులను అందజేశామని అన్నారు.
శ్రమజీవులు చెమట చుక్కలు రాలిస్తేనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాకారం అయిందన్నారు. వివిధ ఫాక్టరీల్లో పనిచేసే కార్మికులతోపాటు, వ్యవసాయాధారిత భారత దేశంలో అధిక జనాభా భూమిని నమ్ముకుని బతుకుతున్నారని అన్నారు. రైతులుగా, కూలీలుగా, వ్యవసాయ అనుబంధ వృత్తి కులాలుగా తమ శ్రమను ధారపోస్తూ దేశ, రాష్ట్ర అభివృద్ధిలో వారు భాగస్వాములయ్యారని అన్నారు. మేడే స్ఫూర్తితో సబ్బండ వృత్తి కులాల సంక్షేమం, అభివృద్ధి కోసం బీఆర్ఎస్ సర్కార్ ఆదర్శవంతమైన కార్మిక కర్షక విధానాలను అమలు చేసిందని చెప్పారు. వృత్తి కులాల కోసం, పేరు పేరునా అమలు చేస్తున్న పథకాలు వారి సామాజిక ఆర్ధిక అభివృద్ధికి దోహదం చేశాయని, గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను పటిష్టం చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచాయని అన్నారు. సబ్బండ వర్ణాల అభ్యున్నతి కోసం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అహర్నిశలు కృషి చేశారని అన్నారు. ఉత్పత్తి సేవా రంగాల అభివృద్ధి, కార్మికుల సంక్షేమం దిశగా కేసీఆర్ అమలు చేసిన పారిశ్రామిక విధానం తెలంగాణలో సంపద సృష్టితో పాటు లక్షలాది నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి కల్పనకు దోహదపడిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో అమలు చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాల్లో లబ్ధిదారుల గుర్తింపులో కార్మికులకు ప్రాధాన్యత కల్పించామని అన్నారు. బీఆర్ఎస్ సర్కార్ ఆర్టీసీ కార్మికులకు వేతనాలను, పదవీ విరమణ వయసు పెంపు చేసిందని, జీహెచ్ఎంసీ కార్మికులకు నిర్దిష్ట పనివేళలు, వారికి ఆరోగ్య రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నదన్నారు. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో ముందు వరుస యోధుల్లా ఉండి సేవలందిస్తున్న వైద్య,ఆరోగ్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, పోలీసులు, జర్నలిస్టుల పాత్ర కీలకమైందని అన్నారు. గొర్రెల పెంపు, చేనేత, మత్స్య రంగం, కల్లుగీత, దోబీ నాయిబ్రాహ్మణ తదితర కుల వృత్తి రంగాలలో కార్మికుల సంక్షేమం, ఉపాధి కల్పనకు ప్రత్యేక కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేసిందని అన్నారు. నిర్మాణరంగ కార్మికులకు తెలంగాణ బిల్డింగ్, అదర్ కన్ స్ట్రక్షన్ వర్కర్స్ బోర్డు ఆధ్వర్యంలో వారి సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను చేపట్టిందని అన్నారు. మహిళా కూలీలు కాన్పు అయితే కేసీఆర్ సర్కార్ రూ.20వేలు అందజేసిందన్నారు. లేబర్ కార్డు ఉన్న కుటుంబాల్లో ఇద్దరు ఆడపిల్లలు పుడితే కల్యాణ లక్ష్మికి అదనంగా కేసీఆర్ ప్రభుత్వం రూ.10వేలు అందజేసిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంలా మారిందన్నారు. నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులను బీఆర్ఎస్ సర్కార్ కడుపులో పెట్టుకొని చూసుకున్నదని అన్నారు. బీఆర్ఎస్ సర్కార్ కార్మిక పక్షపాతి అని భాస్కర్ రావు తెలిపారు. ‘పోగొట్టుకున్న హక్కులను విజ్ఞాపనల ద్వారా ఎట్టిపరిస్థితుల్లో తిరిగిపొందలేం..అందుకు అవిశ్రాంత పోరాటమే మార్గం’ అని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చెప్పిన హితోక్తిని కార్మికులంతా గమనంలో పెట్టుకోవాలని సూచించారు. అంతకుముందు మిర్యాలగూడ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి బీఆర్ఎస్ శ్రేణులు, పలు కార్మిక సంఘాల సభ్యులతో కలిసి భారీ ర్యాలీ తీశారు. కార్యక్రమంలో నల్లగొండ జిల్లా రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, టీఎస్ ఆగ్రోస్ మాజీ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, బీ ఆర్ ఎస్ యువనేత నల్లమోతు సిద్దార్థ, అబ్దుల్ కరీం, ఐల వెంకన్న, సాధినేని శ్రీనివాస్ రావు, దినేష్, షోయబ్, గయాజ్, తదితరులు పాల్గొన్నారు.