*ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న పద్య పౌరాణిక సాంఘిక నాటకాలు 2024*
మిర్యాలగూడ ప్రజాలహరి
మిర్యాలగూడ మినీ రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ మరియు మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రం సంయుక్తంగా నిర్వహించు పద్య పౌరాణిక సాంఘిక నందినీ నాటకోత్సవాల్లో భాగంగా నాల్గవ రోజు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మిర్యాలగూడ సీనియర్ రిటైర్డ్ ఉపాధ్యాయులు వారణాసి ఆంజనేయ శర్మ, ఖమ్మం జిల్లా సీనియర్ రంగస్థలం నటులు రంగాచార్యులు మరియు సీనియర్ మేకప్ ఆర్టిస్ట్ అడవి శంకర్ లు ముఖ్యఅతిథిగా విచ్చేసి జ్యోతిని వెలిగించి నాటకోత్సవాన్ని ప్రారంభించారు.
ఈ నాటకోత్సవాల ప్రారంభానికి ముందుగా కమిటీ సభ్యులు మరియు విచ్చేసిన ప్రేక్షకులు మిర్యాలగూడ వాసి ప్రముఖ ఆర్టిస్టు.. సాహితీవేత్త దాసి చిత్రానికి జాతీయస్థాయిలో అవార్డు పొందిన *పిట్టంపల్లి సుదర్శన్* గారి అకాల మరణానికి చింతిస్తూ..సంతాపాన్ని తెలియజేసి ఒక నిమిషం మౌనం పాటించడం జరిగింది.
ఉ.10 గం.లకు ఖమ్మం కల్చరల్ అసోసియేషన్ ఖమ్మం వారిచే ప్రదర్శింపబడిన *విశ్వామిత్ర విజయం* పద్య నాటకం
విశ్వామిత్ర విజయం కథా సారాంశం: అపరిమిత ఆహారాన్ని, సిరులను అందించగల నందిని అనే కామథేనువు తనకు కావాలని పట్టుబట్టి వశిష్ట మహర్షినుండి ఆశభంగం పొందిన గాధి మహారాజు అనేక అవాంతరాలను ఎదుర్కొని అరిషట్ వర్గాలను జయించి విశ్వామిత్రునిగా మారి చివరకు “బ్రహ్మర్షి విశ్వమిత్రునిగా” మారిన పౌరాణిక నాటకం “విశ్వమిత్ర విజయం”. ప్రేక్షకులను ఆకట్టుకుంది.
సా.6:00 గం.లకు లలిత కళా సమితి టీజీ కళాక్షేత్రం కర్నూలు వారిచే *శ్రీ కృష్ణ కర్ణార్జునీయం* పద్య నాటకం ప్రేక్షకుల హర్షద్వానాలతో మినీ రవీంద్రభారతి మారు మ్రోగింది.
నాటికల అనంతరం విచ్చేసిన అతిధుల చేతుల మీదుగా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కళాకారులకు ప్రశంసా పత్రాలతో పాటు నగదును అందజేసి అభినందించారు.
ఈ నందినీ నాటకోత్సవాలకు తిలకించటానికి పట్టణము మరియు పరిసర ప్రాంతాల నుండి రోజురోజుకు ప్రేక్షక మహాశయులు అధిక సంఖ్యలో విచ్చేయుచున్నందుకు కమిటీ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రం వ్యవస్థాపక అధ్యక్షులు తడకమళ్ళ రామచంద్రరావు, అధ్యక్ష కార్యదర్శులు భుజంగరావు పులి కృష్ణమూర్తి శర్మ, గ్యార సాయిలు, కోశాధికారి పుల్లాభట్ల లక్ష్మీనారాయణ శర్మ, చంద్రశేఖర రావు జానకిరామ శర్మ, MD. ఇనాయతుల్లా, దుర్గి శ్రీనివాస్ శర్మ, పరిమి రామావతారం మామిడాల ఉపేందర్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.