మిర్యాలగూడ ప్రజాలహరి హైదరాబాద్ .. స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ స్పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గురువారం డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ దేశంలో ఎన్నో సంస్కరణలకు కృషి చేశారు. రాజకీయాల్లో ఉన్నంత కాలం ఆయన గాంధీ కుటుంబంతో, కాంగ్రెస్ పార్టీతో కొనసాగారు. జగ్జీవన్ రామ్ స్పూర్తితో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి మా ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు.
గతంలో రెసిడెన్షియల్ స్కూల్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు విడివిడిగా ఉండేవి. దళితులు, గిరిజనులు, బీసీ మైనార్టీలందరికీ ఒకేచోట ఇందిరమ్మ ఇండ్లు కేటాయించేలా అధికారులను ఆదేశించాం.
ప్రతీ నియోజకవర్గంలో ఒకే క్యాంపస్‌లో గురుకులాలన్నీ ఉండేలా ఏర్పాటు చేసి కులాల మధ్య అంతరాలు చేరిపేయాలనుకుంటున్నాం. పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్‌లో శంకుస్థాపన చేసామని వివరించారు.
చదువు మీద పెట్టేది ఖర్చు కాదు.పెట్టుబడి. చదువుకుంటేనే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని ఈ సందర్భంగా పలు ఉదాహరణలను వివరించారు.
లోక్‌సభ స్పీకర్‌గా తెలంగాణ బిల్లుకు ఆమోదించింది జగ్జీవన్ రామ్ కూతురు మీరాకుమారి అని, తెలంగాణ రాష్ట్రమంతా ఆమెను ఎప్పుడూ గుర్తు చేసుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ ప్రసాదకుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు.