*కలెక్టరేట్ ఎదుట వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం*
*- కోడలి నుంచి జీవనభృతి ఇప్పించాలంటూ కలెక్టర్ కు వేడుకోలు*
*- మరణించిన కొడుకు ఉద్యోగం చేస్తున్న కోడలు అత్తమామలను పట్టించుకోని వైనం*
ప్రజాలహరి మిర్యాలగూడ
*పోలీస్ ఉద్యోగం చేస్తున్న ఒక్కగానొక్క కొడుకు తమను ఎంతో సంతోషంగా చూసుకుంటాడని ఆనందపడ్డారు ఆ తల్లిదండ్రులు… కొడుకు కులాంతర వివాహం చేసుకున్నప్పటికీ ఆమోదించి అక్కున చేర్చుకున్నారు… నిండు నూరేళ్లు ఉండాల్సిన కొడుకు చిన్న వయసులోనే రోడ్డు ప్రమాదంలో కానరాని లోకాలకు వెళ్లడంతో కన్నీరు మున్నీరయ్యారు.. కొడుకు ఉద్యోగం కోడలికి రావడంతో సంతోషపడ్డారు… ఉద్యోగం చేస్తున్న కోడలు పట్టించుకోకపోవడంతో ఆవేదన చెంది సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఆత్మహత్య ప్రయత్నంకు ఒడిగట్టిన వృద్ధ దంపతుల సంఘటన అందరిని కలచివేసింది*. తెలిసిన వివరాల ప్రకారం మునగాల గ్రామానికి చెందిన పిడమర్తి ఎలిశమ్మ వెంకన్న దంపతులకు చిరంజీవి అనే కుమారుడు ఉన్నాడు. ఆయన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద ఇంటలిజెన్స్ విభాగంలో కానిస్టేబుల్ గా పని చేస్తూ కులాంతర వివాహం చేసుకొని 6-6-2002లో రోడ్డు ప్రమాదంలో మరణించాడు. భర్త చిరంజీవి మరణించడంతో కోడలు బొమ్మన బోయిన రజినీకి డిజిపి కార్యాలయం హైదరాబాదులో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం ఇచ్చారు. 28-8-2023న వయోవృద్ధులైన చిరంజీవి తల్లిదండ్రుల పోషణ కోసం కోదాడ ఆర్డిఓ రజిని జీతం నుంచి ప్రతినెల 5000 ఇచ్చేలా నిర్ణయించారు. అలాగే చిరంజీవికి ఉన్న ఆస్తిలో ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ ను మూడు వాటాలుగా తీర్మానించి ఒక వాటా చిరంజీవి తల్లిదండ్రులకు, మరో వాట ఒక్క అమ్మాయికి, ఇంకో వాట మరో అమ్మాయికి, ప్రభుత్వం నుంచి వచ్చే ఉద్యోగం రజినీకి ఇచ్చేలా ఒప్పందాలు చేశారు. ఈ ఓప్పందానికి అంగీకరిస్తూ రజిని సంతకాలు చేసినప్పటికీ అమలు చేయకుండా తాను డిజిపి కార్యాలయంలో ఉద్యోగస్తురాలినని తనను ఎవరు ఏమీ చేయలేరని ఎలాంటి బెనిఫిట్స్ మీకు ఇవ్వలేనని దిక్కున చోట చెప్పుకోవాలంటూ మానసికంగా ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తుంది. మనమరాళ్లను కూడా చూడకుండా కులం పేరుతో దూషించి మమ్మల్ని ఎన్నోసార్లు ఇంటి నుంచి బయటకు గెంటి వేసిందని రిక్షా తొక్కి కాయ కష్టం చేసి చదివించి ప్రయోజకుడ్ని చేసిన కొడుకు ఉద్యోగం సాధించి కానరాన్ని లోకాలకు వెళ్లాడని ఇప్పుడు మాకు దిక్కు ఎవరని ప్రశ్నించారు. తిండి కూడా లేని నిరుపేదలమని మా యందు దయవుంచి జీవన భృతి కల్పించాలని వారు జిల్లా కలెక్టర్, ఉన్నత అధికారులను వేడుకున్నారు.