- ఫిబ్రవరి 2న చలో సాగర్
- * ఎస్ఈ కార్యాలయం ముందు ధర్నా
- * ఎడమ కాలుకు నీటిని విడుదల చేయాలని డిమాండ్
- * విలేకరుల సమావేశంలో జూలకంటి మిర్యాలగూడ
నాగార్జునసాగర్ ఎడమ కాలవకు నీటిని విడుదల చేయాలని కోరుతూ ఫిబ్రవరి 2న చలో సాగర్ కార్యక్రమం చేపట్టినట్లు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలోని ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ నియోజవర్గాలలో బోర్లు బావుల కింద సుమారు 30% వరి పంట సాగు చేశారని తెలిపారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల వల్ల బోర్లు బావులు ఎండిపోతున్నాయని, దాని ఫలితంగా చేతికి వచ్చిన వరి పంట పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టులు నీటి నిల్వను బట్టి ఎడమ కాలుకు నీటిని విడుదల చేసి చెరువులు కుంటలు నింపాలని ఎస్ఎల్బీసీ వరద కాలువకు నీళ్లు ఇవ్వాలన్నారు. భవిష్యత్తు అవసరాల రిత్యా ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్ నింపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ముందుగా ఎడమ కాలువకు నీటిని విడుదల చేసి చెరువులు కుంటల నింపి భూగర్భ జలాలు పెంపొందించాలన్నారు. దాంతో పంట పొలాలు చేతికి వస్తాయని చెప్పారు. ప్రస్తుతం నీటి విడుదల కాకపోతే పంటలు ఎండిపోయి భవిష్యత్తులో కరువు ఏర్పడుతుందని దాని ఫలితంగా కార్మికులకు ఉపాధి కరువై రైస్ మిల్లులు మూతపడతాయని, బియ్యం ధరలు కూడా పెరుగుతాయని చెప్పారు. భవిష్యత్తులో సాగు తాగునీటి సమస్య ఏర్పడుతుందని అలా కాకుండా ఉండేందుకు ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరిపి ఆల్మట్టి ద్వారా నీటిని తెప్పించుకొని ఎడమ కాలువ నీటిని విడుదల చేసి పంట పొలాలను కాపాడాలని కోరారు. నీటి విడుదల కోసం రైతు సంఘం ఆధ్వర్యంలో అనేక ఆందోళన కార్యక్రమం నిర్వహించామని ముఖ్యమంత్రి, మంత్రుల దృష్టికి కూడా తీసుకెళ్లామని గుర్తు చేశారు. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు నీటి విడుదలపై ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. దీనికోసం ఫిబ్రవరి 2న చలో సాగర్ చేపట్టినామని ఉమ్మడి నల్గొండ జిల్లా లోని ఆయకట్టు రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఎస్ ఈ కార్యాలయం ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు నూకల జగదీష్ చంద్ర, రాగిరెడ్డి మంగారెడ్డి, భావండ్ల పాండు, తిరుపతి రామ్మూర్తి, వినోద్ నాయక్, సత్యనారాయణ రావు, పగిదోజు రామ్మూర్తి, పాపా నాయక్, సైదులు, గుణగంటి రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.