Ultimate magazine theme for WordPress.

బిఆర్ఎస్ పై బురద చల్లడం ఆపి అభివృద్ధిపై దృష్టి పెట్టాలి హరీష్ రావు

Post top
home side top

మాపై బురద జల్లడం మాని.. రాష్ట్ర ప్రయోజనాలపై దృష్టి పెట్టాలి

* కాంగ్రెస్‌ నాయకులకు హరీశ్‌రావు హితవు

ప్రజాలహరి హైదరాబాద్

కృష్ణా రివర్‌ బోర్డుకు మన ప్రాజెక్టులు అప్పగించడం సరికాదని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు అన్నారు. దీనివల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్‌ నివాసంలో జరిగిన బీఆర్‌ఎస్‌ పార్టీ పార్లమెంటరీ సమావేశంలో పాల్గొన్న అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్టులను కృష్ణా రివర్‌ బోర్డుకు అప్పగిస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం సంతకాలు పెట్టిందని తెలిపారు. దీనికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం మినట్స్‌ కూడా బయటపెట్టిందని అన్నారు. అయితే కృష్ణా జలాల్లో మన వాటా తేలకుండా బోర్డుకు ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. ఇప్పుడు ప్రాజెక్టుపైకి తెలంగాణ అధికారులు అడుగుపెట్టే అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని హరీశ్‌రావు అన్నారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని బీఆర్ఎస్ పార్లమెంటరీ బృందం కలిస్తుందని తెలిపారు. గతంలోనూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణకు అన్యాయం చేశాయని ఆయన అన్నారు. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను పునరుద్ధరిస్తామని గతంలో అమిత్ షా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. బీసీ జన గణన వెంటనే చేపట్టాలని హరీశ్‌ రావు డిమాండ్‌ చేశారు. పార్లమెంటు గట్టిగా గొంతు వినిపిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో పూటకో మాట మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రచారంలో అబద్ధాలు, పాలనలో అసహనం కనిపిస్తుందని విమర్శించారు. హామీలు అమలు చేయమంటే సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని అన్నారు. ఉచ్చ ఆగడం లేదని ఒకరు, చెప్పుతో కొడతామని ఒకరు అంటున్నారు.. వారికి ప్రజలే గుణపాఠం చెబుతారని అన్నారు. కాంగ్రెస్ నాయకులకు తొందరపాటు ఎక్కువ ఉందని.. ఎంతసేపు మా మీద బురద జల్లడం మానేసి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో దృష్టి సారించాలని హితవు పలికారు. జర్నలిస్టులపైనా, ప్రతిపక్షాలపైనా కాంగ్రెస్‌ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చెప్పిన ఆరు గ్యారంటీల్లో 13 హామీలు ఉన్నాయని.. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే హామీలు అమలు చేయాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. తమకు ఓపిక ఉందని, ప్రజల కోసం ప్రశ్నిస్తామని తెలిపారు. ప్రతిపక్షాలపై బురద జల్లడంపైనా, కుట్రలు చేయడంపై దృష్టి పెట్టారని ఆయన అన్నారు. గెలిచిన వాళ్లకు ఓపిక, ప్రతిపక్షాలను కలుపుకునిపోయేలా ఉండాలని సూచించారు. ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లే దుందుడుకు స్వభావంతో మాట్లాడుతున్నారని.. అహంకారపూరిత వైఖరితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ పట్ల భాష అలాగే ఉంటుందా అని తప్పుబట్టారు. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని.. తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. హామీలు అమలు చేయాలని కోరుతున్నామని హరీశ్‌రావు అన్నారు. ప్రజలు మీకిచ్చిన బాధ్యత మీరు నిర్వర్తించండి.. మాకిచ్చిన బాధ్యత మేం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి మార్చి 17వ తేదీకి వంద రోజులు నిండుతుందని.. అంతలోపు ఎన్నికల కోడ్ వస్తుందని అన్నారు. మహిళల విషయంలో ఒకే హామీ అమలు చేసి అన్నీ అమలు చేశామంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. ఒక్క గ్యాంరటీలో మూడు హామీలు ఉన్నాయని తెలిపారు. నిరుద్యోగ భృతిపై అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. నిరుద్యోగ భృతిని ఎప్పటి నుంచి అమలు చేస్తారో ఇప్పటికైనా వివరణ ఇవ్వాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను డిమాండ్‌ చేశారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.