ఉద్యమానికి ఊపిరి పోసింది కరీంనగరే.. ప్రజాలహరి హైదరాబాద్…….
‘2001లో ఉద్యమానికి ఊపిరిపోసినా.. 2006లో మళ్లీ పునర్జన్మనిచ్చినా ఇదే కరీంనగర్ గడ్డపై ఆనాడు 2లక్షల ఓట్ల మెజారిటీతో కేసీఆర్‌ను ఉప ఎన్నికల్లో గెలిపించింది. మళ్లీ దేశానికి బలంగా తెలంగాణ కావాలని చెప్పింది కరీంనగర్ గడ్డ గొప్పతనమే. 2009లో ఆశలు లేవు.. అయిపోయింది టీఆర్‌ఎస్ పరిస్థితి.. 45 సీట్లలో పోటీ చేస్తే పది సీట్లే గెలిచింది.. అయిపోయింది కేసీఆర్, టీఆర్‌ఎస్ పని.. తెలంగాణ రాష్ట్రం ఇక రాదు అనే పరిస్థితుల్లో మరోసారి అక్కున చేర్చుకొని గుండెల్లో పెట్టుకొని 2009 నవంబర్ 29న అల్గునూర్‌లో అగ్గి అంటించింది ఇదే కరీంనగర్ గడ్డ అనేమాట మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. కరీంనగర్ నిరాహార దీక్షలో అల్గునూర్‌లో ఆయన అరెస్టు కాగానే తెలంగాణ అంతా అగ్గి అంటుకున్న విషయం మీ అందరికీ తెలుసు. ఇవాళ చాలా మంది చాలా మాట్లాడుతున్నారు. చిత్రవిచిత్రమైన అనుభవాలు. మొన్న జరిగిన ఎన్నిక డిసెంబర్ 3న వచ్చిన ఫలితం.. హతాశయులయ్యే పరిస్థితి కాదు. ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకునేంత బాధాకరమైన ఫలితం కాదు’ అని కేటీఆర్ స్పష్టం చేశారు.
ప్రజలే మనకు అండగా నిలబడ్డరు..
‘సోషల్ మీడియా భావోద్వేగంతో ఉంటరు. ఉద్యమ పార్టీగా.. ఉద్యమంలో మొదటి నుంచి ఉన్న తమ్ముళ్లు.. తర్వాత వచ్చిన తమ్ముళ్లకు తెలంగాణతో, కేసీఆర్, పార్టీతో భావోద్వేగపూరిత అనుబంధం ఉంటుంది. కొందరిని చూసిన ప్రజలను మోసం చేసిన నాయకులను చూశాం కానీ.. నాయకులను మోసం చేసిన ప్రజలను చూడలేదు అని కొందరు పోస్టులు పెట్టారు. నేను మిమ్మల్ని చేతులెత్తి వేడుకుంటున్నా.. ఇలాంటి భావోద్వేగపూరిత మాటలు ప్రజలను కించపరిచేలా మాట్లాడడం సరికాదు. ఎందుకంటే అదే ప్రజలు మనకు అండగా నిలబడ్డరు. అదే ప్రజలు తెలంగాణ ఉద్యమంలో ఏం లేని నాడు.. 2001లో కేసీఆర్ బయలుదేరిన నాడు.. మజిల్ పవర్ లేదు.. మనీ పవర్ లేదు. మీడియా పవర్ లేదు. ప్రత్యర్థులకు కొదవ లేదు. ఏం లేనినాడు కూడా కేసీఆర్‌ను ఎత్తిన పెట్టుకున్నది.. గుండెల్లో పెట్టుకున్నది అదే ప్రజలు.. నడిపించింది అదే ప్రజలని మరిచిపోవద్దు. ఒక్కసారి 1.85శాతం తేడాతో మనపై చిన్నపాలి అలకచూపెడితే దానికి ప్రజలను నిందించడం సోషల్ మీడియాలో మంచిది కాదు. ఇలాంటి పనులు చేయొద్దు’ అంటూ సూచించారు.
ఓడిపోతే కుంగిపోవద్దు..
‘తెలంగాణ ప్రజల మనసు మళ్లీ తిరిగి ఎట్ల గెలుచుకుందాం.. లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ ఎట్లా జెండా పాతుదాం.. మళ్లీ ఎట్ల గులాబీ జెండా ఎగురవేద్దామనే దిశగా ఆలోచిద్దాం పొరపాటున కూడా ప్రజలను నిందించే విధంగా, ప్రజల తీర్పును అవమానించేలా మాట్లాడొద్దు. గెలుపుతోని పొంగిపోవద్దు.. ఓడిపోతే కుంగిపోవద్దని మన నాయకుడు కేసీఆర్ చెబుతారు. ఉద్యమం ప్రారంభమైన కొత్తలో రసమయి బాలకిషన్, గోరెటి వెంకన్న, వరంగల్ శీనులాంటి వారితో కూర్చొని పాటలు రాసేది. అందులో ఒక అద్భుతమైన పాట రాశారు. ‘సిపాయిల తిరుగుబాటు విఫలమైందని.. అనుకుంటే వచ్చేదా? దేశానికి స్వాత్రంత్య్రం’. 1857లో తొలిసారి బ్రిటిష్ వారిపై మర్లపడితే కర్కషంగా తొక్కిపడేశారు. దాన్నే సిపాయిల తిరుగుబాటు అంటారు. సిపాయిల తిరుగుబాటు విఫలమైందని భారతదేశంలోని స్వాతంత్య్ర ఉద్యమకారులు అయ్యో.. ఇక మాతోని కాదు అని ఎక్కడోల్లక్కడ దుప్పటి కప్పుకొని పడుకుంటే దేశానికి స్వాతంత్య్రం వస్తుండెనా?. అట్లగే రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది? అని కేసీఆర్ ఆ నాడే పిడికిలి బిగించి.. కవులు, కళాకారులతో పాటలు రాయించి.. స్వయంగా కూర్చోని ఈ పాటలకు మెరుగులుదిద్దిన పరిస్థితి’ అని కేటీఆర్ గుర్తు చేశారు.బాధపడేంత ఓటమి కాదు..!
* తెలంగాణ అసెంబ్లీ ఫలితాలపై కేటీఆర్ వ్యాఖ్యలు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం కరీంనగర్‌లో బీఆర్‌ఎస్ సోషల్ మీడియా వారియర్స్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ‘మొన్నటి ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు తగిలిన దెబ్బ చిన్నదే. 119 నియోజకవర్గాల్లో మనం పోటీ చేస్తే మనల్ని ప్రజలు చీకొట్టలేదు. తీసి అవతలపడేయలేదు. 39 సీట్లు ప్రజలు ఇచ్చారు. మూడోవంతు సీట్లు ఇచ్చారు. 14 నియోజకవర్గాల్లో స్వల్ప తేడాతో ఓడిపోయాం. జుక్కల్‌లో 1152 ఓట్లు, దేవరకద్రలో 1382 ఓట్లు, సిర్పూర్‌లో 3వేల ఓట్లు, బోధన్‌లో 3వేల ఓట్లు, ఖానాపూర్‌లో 4289 ఓట్లు తేడా. కొన్ని ఓట్ల తేడాతోనే కొన్ని సీట్లు కోల్పోయాం. ఈ 14 సీట్లలో ఆరేడు సీట్లు మనం గెలిచినా.. ఇవాళ ఏం ఉంటుండెనో పరిస్థితి మాకే నాకంటే బాగా తెలుసు’నని కేటీఆర్ అన్నారు.
#బాధపడేంత దరిద్రమైన ఓటమి కాదు..
‘మనకు జరిగింది ఊహించలేనటువంటి.. బాధపడేంత దరిద్రమైన ఓటమి కాదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎవరు ఎట్ల గెలిచారో ఆలోచన చేయాలి. పక్కనే ఉంటది ధర్మపురి నియోజకవర్గం. అక్కడ కొప్పుల ఈశ్వర్ ఓడిపోయారు. ఆయన ఎందుకు ఓడిపోయారు ? కరీంనగర్ పార్లమెంట్ సమీక్షా సమావేశంలో జమీల్ ఒక్క మాటన్నడు. అన్న భారతదేశం భావోద్వేగాల మీద ఓటు వేస్తది అన్నడు. మన దేశం కొద్దిగా ఎమోషనల్ దేశం. ఉద్వేగాన్ని, భావాన్ని, బాధను పంచుకుంటరు అన్నాడు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో గదే జరిగింది. ధర్మపురిలో ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే లక్ష్మణ్‌కుమార్ ఇంతకు ముందు నాలుగు సార్లు ఓడిపోయారు. ఇంటింటికి తిరుగుతూ రోడ్డున పడుతా అంటూ ఏడ్చారు. చొప్పదండిలో ఏం జరిగింది. ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే గతంలో రెండుసార్లు ఓడిపోయారు. ఆయన ఇంటింటికి తిరుగుతూ ఏడ్సుకుంట. ఆస్తులన్నీ అమ్ముకున్న. అవుట్‌పోయిన నాకు దయచేసి ఒక్కసారి ఓటు వేయాలని ఆయన తిరిగిండు. మానకొండూరులో కవ్వంపల్లి సత్యనారాయణ ఓడిపోయిండు. నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి దండం పెడుత అన్నడు. వేములవాడలో ఇప్పుడున్న ఎమ్మెల్యే నాలుగు సార్లు ఓడిపోయాడు. దయచేసి నాకు అవకాశం ఇవ్వాలి.. ఐదోసారి ఓడిపోతే అడ్రస్ లేకుండాపోతా అని తిరిగిండు. సిరిసిల్లలో నాపై పోటీ చేసిన ఆయనది అదే ప్రయత్నం. 65 ఏళ్లు వచ్చాయ్.. వచ్చేసారి ఉంటనో లేదో.. ఈసారి ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఆయన తిరిగిండు’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
#సెంటిమెంట్‌తోనే గెలిచారు..
‘ఎక్కడికక్కడ సెంటిమెంట్‌తోనే కాంగ్రెస్ అభ్యర్థులంతా బ్రహ్మాండంగా గెలిచారు తప్ప.. ఇంకోటి కానే కాదు. ఈ మాట ఎందుకు అంటున్నాంటనే.. మన ఎమ్మెల్యేలంతా పని మంతులు కాదని కాదు.. కేవలం సెంటిమెంట్ కారణం. కరీంనగర్ లోక్‌సభ ఒకసారి మొత్తం తీసుకుంటే.. మనం ముందున్నాం. లోక్‌సభ పరిధిలో మొత్తం ఐదారువేల ఓట్లతో మొత్తంగా ముందంజలో ఉన్నాం. ముగ్గురు ఎమ్మెల్యేలు, నలుగురు మాజీలు, ఐదుగురు జడ్పీ చైర్మన్లు ఉన్నారు. కానీ, మొన్న ఏడుపులు, బొబ్బలతో ఓట్లు దెబ్బినోళ్లు ఇవాళ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు అయ్యారు. వాళ్లకు ఈసారి సానుభూతి ఉండదు.. మన్ను ఉండదు.
#అక్కడ ఈ సారి ఏం జరుగుతుందంటే..
ప్రజలు ఏమాయే బిడ్డ మీ రేవంత్‌రెడ్డి పెద్ద పెద్ద మాటలు చెప్పిండు.. ఏమాయే అని అడుగుతరు. నేనేం విమర్శ చేస్తలేను.. నేను గుర్తు చేస్తున్నా. ఆ నాడు రేవంత్‌రెడ్డి రైతులు లోన్ తీసుకోనొళ్లు ఉంటే.. అర్జెంటుపోయి రూ.2లక్షల లోన్ తీసుకోండి డిసెంబర్ 9న వచ్చి నేను కడుతా అన్నడు’ కేటీఆర్ గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను వీడియో ప్లే చేయించి చూపించారు. రుణమాఫీ, పింఛన్లు, రైతుబంధు, కరెంటు బిల్లులపై చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియా వారియర్స్‌కు స్క్రీన్‌పై ప్రదర్శించారు.