సీఎం అలా చేస్తే ప్రజలు ఊరుకుంటారా? : కేటీఆర్
హైదరాబాద్ : విధ్వంసమైన తెలంగాణను బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పదేండ్ల పాలనలో వికాసం వైపు నడిపించారు. రాష్ట్రాభివృద్ధిపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్లే పార్టీ శ్రేణులకు తక్కువ సమయం కేటాయించాల్సి వచ్చిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం వరంగల్ లోక్‌సభ నియోజకవర్గంపై తెలంగాణ భవన్‌లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల ఏర్పాటును రద్దు చేస్తామని అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. అలా చేస్తే ప్రజలు ఊరుకుంటారా అని ప్రశ్నించారు. కొన్నితప్పిదాల వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం. ఇప్పుడు తెలంగాణ ఢిల్లీ చేతుల్లోకి వెళ్లింది. తెలంగాణను మన చేతుల్లోకి తెచ్చుకునే అవకాశం వచ్చిందని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీవి ఆరు గ్యారంటీలు కాదు, 420 అబద్ధాలన్నారు. కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని వారి 420 మ్యానిఫెస్టోతోనే ఎండగట్టాలన్నారు. ఆ పార్టీకి అసలైన సినిమా ముందుందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ హామీలను ప్రజలు నేడు నమ్మే పరిస్థితులో లేరని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని బీఆర్‌ఎస్ శ్రేణులు సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలువాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో వరంగల్ లోక్‌సభ పరిధిలోని నియోజకవర్గాలకు చెందిన నేతలంతా హాజరయ్యారు. పార్టీ బలోపేతానికి బీఆర్‌ఎస్ శ్రేణులు చేసిన పలు సూచనలను నమోదు చేసుకున్నారు.