
నిర్బంధం.. నియంతృత్వం
సమైక్య పాలకులదే..కేటీఆర్
ప్రజాలహరి హైదరాబాద్.
నిర్బంధం, నియంతృత్వమని కొందరు మాట్లాడుతున్నారని.. నిర్బంధం.. నియంతృత్వం నాటి సమైక్య పాలకులదేనని కేటీఆర్ అన్నారు.
తెలంగాణ భవన్‌లో ‘స్వేదపత్రం’ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమం నాటి పరిస్థితులను పవర్ పాయింట్ ప్రజంటేషన్‌లో మరోసారి కళ్లకు కట్టినట్లుగా చూపించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘పిడికిలి బిగించి సమర శంఖం పూరించింది టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్. ఇవాళ మంది చాలా ఈజీగా మాట్లాడుతున్నరు. ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు, ఉద్యమంలో ఏ నాడు లేనివారంతా ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నరు. తెలంగాణ మేమే తెచ్చామని.. మావళ్లనే తెలంగాణ వచ్చిందని మాట్లాడుతున్నరు. ఒకసారి అందుకే ఒకసారి.. ఏం జరిగింది తెలంగాణ ఉద్యమంలో.. ఎన్ని రకాల రాజీనామాలు, ఉప ఎన్నికలు, దీక్షలు, అమరుల ప్రాణత్యాగాలు’ చేశారంటూ ఉద్యమానికి సంబంధించిన వీడియోను పవర్ పాయింట్ ప్రంటేషన్‌లో ప్రదర్శించారు. వీడియో ఒక్కసారి అందరికీ తెలంగాణ ఉద్యమం నాటి పరిస్థితులు కళ్లెదుట కదలాడాయి.
విరిగిన లాఠీలకు లెక్కలేదు.. నిండిన జైళ్లకు లెక్కలేదు..
‘ఉద్యమంలో ఆ నాడు విరిగిన లాఠీలకు లెక్క లేదు. నిండిన జైళ్లకు లెక్క లేదు. పేలిన తూటాలకు లెక్క లేదు. ఇవాళ కొందరు మాట్లాడుతున్నరు నిర్బంధమని, నియంతృత్వమని. కానీ, నిర్బంధం ఆ నాడు.. నియంత పాలన అంటే సమైక్య పాలకులది. తెలంగాణ ఇస్తే అంధకారమే అని కట్టెలు పట్టుకొని కట్టుకథలు చెప్పిన వారు.. పెద్దపెద్ద మాటలు మాట్లాడిన వారు.. వారికి తొత్తులుగా పని చేసినవారు ఇవాళ శ్వేతపత్రాల పేరుతో తెలంగాణను విఫల ప్రయోగంగా.. విఫల రాష్ట్రంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. పోరాడి తెచ్చిన తెలంగాణ ఎవరి చేతుల్లో న్యాయం జరుగుతుందని ప్రజలు భావించారో.. కేసీఆర్ చేతుల్లోనే పెట్టి ఆ నాడు కేసీఆర్‌ను 2014లో తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న తర్వాత.. ఉద్యమం ఫలితం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత.. 2014, జూన్ 2న కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు’ అన్నారు.
రాష్ట్రం వచ్చాక ఎన్నో కష్టాలుండేవి..
‘కేసీఆర్ సీఎంగా బాధ్యలు చేపట్టిన నాడు పరిస్థితి ఏంటంటే.. ఆర్థిక చిక్కులు ఒక వైపులుండేవి. తొమ్మిదిన్నరేళ్ల తర్వాత చాలా మంది కన్వినెంట్‌గా మాట్లాడుతున్నరు. 50 ఏళ్ల నుంచి రాష్ట్రం అన్నట్లుగా మాట్లాడుతున్నారు. కొత్త రాష్ట్రం.. ఎన్నో రకాల ఆర్థిక చిక్కులు. మరొకవైపు రాజకీయ కుట్రలు.. ఈ రాష్ట్రం ఒక విఫల ప్రయోగం.. ఇదో విఫల రాష్ట్రం అనేక కుట్ర ఒక వైపు.. ఒక విభజన చట్టం అమలు కాదు. ఒకటి కాదు రెండు ఎన్నో కష్టాలుండేవి. ఉద్యోగులు, ఆస్తుల పంపిణీ కష్టాలు పూర్తి కాలేదు. 207 మెగావాట్ల విద్యుత్ లోటు.. వారసత్వంగా సంక్రమించిన తాగు, సాగునీటి సమస్యలు కోకొల్లుగా ఉన్నయ్. ఇవి రాష్ట్రం ఏర్పడిన నాడు మా ముందున్న సవాళ్లు. ఆ రోజు మేం వెరవలేదు. కుట్రలు ఎలా ఉంటయంటే..? రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో మాట్లాడిన మాటలు.. బెర్లిన్ గోడను కూల్చి ఈస్ట్, వెస్ట్ జర్మనీ ఒక్కటయ్యాయి.. మళ్లీ తెలంగాణను తిరిగి ఆంధ్రలో కలుపలేమా? అంటూ ఆ రోజు మాటల దాడి. కొందరు ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కోసం ప్రయత్నం ఇలా ఎన్ని జరిగినా.. తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం జరిగింది’ అన్నారు.
పటిష్టమైన ఆర్థిక క్రమశిక్షణతో..
‘తెలంగాణ ఏర్పాటు తర్వాత కొత్త రాష్ట్రానికి ఉన్న సవాళ్లను అధిగమిస్తూ.. జీవన విధ్వంసం జరిగిన తెలంగాణను ఎలా పునర్నిర్మాణం చేయాలి? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయ వనరుల పరిస్థితిపై స్పష్టం లేని సమయంలో ఆ రోజు పటిష్టమైన ఆర్థిక క్రమశిక్షణతో ప్రణాళికలు రూపొందించుకొని.. బీహార్‌లో ఉండే తెలంగాణ బిడ్డ జీఆర్‌రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించుకొని. ఆ రోజు కోల్ ఇండియా సీఎండీగా ఉండే నర్సింగరావు అనే ఐఏఎస్ అధికారిని తెలంగాణకు రమ్మని ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రెటరీగా పెట్టుకొని.. వారికి ఉన్న దశాబ్దాల అనుభవాన్ని రంగరించి.. మాకే అన్ని తెలుసు.. మేమే గొప్పవాళ్లం అన్నట్లుగా కాకుండా.. నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది అని చెప్పి ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకున్నాం. క్రమశిక్షణతో ఒక వైపు పరిపాలన సంస్కరణలకు పెద్దపీట వేస్తూ.. ప్రజల వద్దకు పాలనను తీసుకెళ్లాం. ఆ రోజు ఎన్నో సవాళ్లు ముందుండేవి’ అన్నారు.
ఎన్నో సవాళ్లు ఉండేవి..
‘పోరాడి తెచ్చుకున్న రాష్ట్రం తొలి ఛాలెంజ్ ఏంటీ ? ఎలాంటి ప్రాధాన్యరంగాలను తీసుకోవాలి.. ఏ రకంగా స్పష్టమైన టార్గెట్స్‌ను నిర్ధేశించుకోవాలి ? దశాబ్దాలపాటు పోరాటం చేసింది ఎన్నో ఆకాంక్షలతో.. వాటిని ఎలా నెరవేర్చాలి ? ఇంకో వైపు నీళ్లు, నిధులు, నియామకాలు అన్నాం.. వాటిని ఎలా నెరవేర్చాలి? తెలంగాణ భౌగోళిక స్వరూపాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి?.. అందుకంటే ఆ రోజు కొందరు మేథావులు మాట్లాడేవారు. నదులు కిందున్నయ్.. నేలలు పైనున్నయ్ నీళ్లు ఎట్ల వస్తయ్ మీకు? ఎట్ల తీసుకుపోతరనే వాదన ఉండేది. మరొక వైపు అడుగంటి భూగర్భ జలాలను పైకి తీసుకురావడం ఒక సవాల్ ఉండేది. తీవ్రమైన కరెంటు సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని బయటపడేయడం మరో సవాల్. ఆకలి చావులు, ఆత్మహత్యలను ఆపడం.. ప్రజలను కాపాడుకోవడం మరొక సవాల్. బీడువారిన రైతుల బతుకులను బాగు చేయడం మరో సవాల్. క్షీణించిన శాంతిభద్రతలను కాపాడడం ఒక సవాల్. హైదరాబాద్‌లో ప్రతి సంవత్సరం కర్ఫ్యూలు.. రాష్ట్రవ్యాప్తంగా కల్లోల ప్రాంతాలను పటిష్టపరచడం మరొక సవాల్. తరతరాల సాగునీటి తండ్లాటను తీర్చడం ఒక సవాల్. పారిశ్రామిక వేత్తల్లో నెలకొన్న భయాందోళనలు తొలగించడం ఒక సవాల్. విఫల రాష్ట్రంగా చూపెట్టేందుకు కొన్ని దుష్ట శక్తులు ఏవైతే ప్రయత్నం చేస్తున్నయో తొప్పికొట్టడం మరొక సవాల్ ఉండేదన్నారు’ కేటీఆర్.