Ultimate magazine theme for WordPress.

నాగార్జునసాగర్ డ్యాం వద్ద పూర్వస్థితి కి అమలుకు రెండు రాష్ట్రాల అంగీకారం

Post top

పత్రికా ప్రకటన

ప్రజాలహరి జనరల్ డెస్క్ …

 

హైదరాబాద్, డిసెంబర్ 1 :: నాగార్జున సాగర్ జలాల విడుదల విషయంలో నవంబర్ 28 వ తేదీకి ముందు ఉన్న పరిస్థితిని కొనసాగిస్తూ, ఈ డ్యామ్ నిర్వహణను కృష్ణ వాటర్ మేనేజ్మెంట్ కు అప్పగించడంతోపాటు సి.ఆర్.పీ.ఎఫ్ దళాల పర్యవేక్షణకు అప్పగించాలన్న కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి ప్రతిపాదనలకు తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు అంగీకరించాయి.

నాగార్జున సాగర్ డ్యామ్ నుండి నవంబర్ 29 న ఆంధ్ర ప్రదేశ్ ఏకపక్షంగా సాయుధ దళాలను మోహరించి కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేసిన సందర్బంగా తలెత్తిన వివాదంపై నేడు కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా తెలంగాణ, ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, కేంద్ర జల సంఘం, కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు అధికారులు కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.

ఈ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ, నవంబర్ 29 న రాత్రి ఆంద్రప్రదేశ్ కు చెందిన దాదాపు 500 మంది సాయుధ పోలీసులు నాగార్జున సాగర్ డ్యామ్ పైకి వచ్చి సీసీ కెమెరాలను ద్వంసం చేయడంతోపాటు 5 , 7 గేట్ల వద్ద వున్నా హెడ్ రెగ్యులేటర్లను తెరిచి దాదాపు ఐదు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారని పేర్కొన్నారు. తెలంగాణా శాసన సభ ఎన్నికల నిర్వహణలో ఉండగా ఏపీ ప్రభుత్వం చేసిన చర్య తమ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యను సృష్టించిందని తెలిపారు. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విధమైన అతిక్రమణలు పాల్పడడం ఇది రెండవసారి అని అన్నారు.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేసిన ఈ చర్య వల్ల హైదరాబాద్ నగరంతోపాటు పరిసర ప్రాంతాల రెండు కోట్ల ప్రజల తాగునీటి అవసరాలకు తీవ్ర ఆటంకం కలుగుతుందని శాంతి కుమారి ఆందోళన వ్యక్తం చేశారు. 2014 నుండి కొనసాగుతున్న మాదిరిగానే స్టేటస్-కో ని కొనసాగించాలని కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శికి విజ్ఞప్తి చేశారు.

కాగా, నాగార్జున సాగర్ డ్యాం పై గతంలో ఉన్న మాదిరిగానే స్టేటస్-కో కొనసాగించాలని, ఈ డ్యామ్ ను తాత్కాలికంగా కేంద్ర రిజర్వ్ పోలీస్ దళాల పర్యవేక్షణలో ఉంటుందని కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి పేర్కొన్నారు. ఈ అంశంపై కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించబోతున్నట్లు భల్లా పేర్కొన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో పాటు డీజీపీ అంజనీ కుమార్, నీటి పారుదల శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, అడిషనల్ డీజీ ఎస్.కె.జైన్, ఐజి షా నవాజ్ కాశీం, నీటిపారుదల శాఖ సలహాదారు మురళీధర్, ఓ.ఎస్.డి శ్రీధర్ దేశ్ పాండే లు పాల్గొన్నారు.

———————————————————————————————————————

స్పెషల్ కమీషనర్, సమాచార, పౌర సంబంధాల శాఖ చే జారీచేయనైనది.

post bottom

Leave A Reply

Your email address will not be published.