పొక్కిలి….
మిర్యాలగూడ ప్రజాలహరి
గలమ చూరుకి చూపులు ఎగరేసిన
కలల చప్పుడు గుండె వాకిలిని పొక్కిలి
చేసింది.
వాకిలి వైశాల్యం ముక్కచెక్కలైంది
కంటికి కునుకు లేదు తల బద్దలై ముఖం
కళ తప్పింది
నూతిలోనుంచి కప్పల గోల మొదలైంది
నీళ్ళ నుంచి బయట పడ్డ చేపలా
గిలగిలా కొట్టుకుంది జ్ఞాపకం
దేహమంతా పొక్కిలై నెర్రలు బారింది
దాహమైన గొంతును ఎడారి పలకరించింది
ప్రేమను వెతుక్కుంటూ గుండె గదంతా తిరిగాను
చీకట్లో శూన్యాన్ని తన్నుకుంటూ కొలిచాను
కళ్ళల్లో మెరిసిన జ్ఞాపకాలు మనసుకు అయిన
గాయంగా ఎరుపెక్కాయి
వియోగ గాయాలతో కన్నీళ్లు చిక్కబడ్డాయి
ఆలోచనలు కలహించుకుంటున్నాయి
రైళ్లు అతి వేగంగా పట్టాలు తప్పుతున్నాయి
లోతుల్లో ఉన్న ప్రేమ ప్రవాహం పరుగులు
పెడుతుంది
గుండెల్లో ప్రేమ కన్నీటి చెలమతో నిండింది
తడి లేని కళ్ళు నిప్పు కొలిమిలా మండుతున్నాయి
యవ్వనపు పరిమళం క్షణాల్లో ఆహుతై కాల గర్భంలో
కలిసిపోయింది……
ప్రమోద్ ఆవంచ
7013272452