మీ గొంతుకనౌతా…గెలిపించండి….రంగన్న
దామరచర్ల ప్రజాలహరి……
నిస్వార్థ ప్రజా సేవకుడినైనా తనకు ఓటువేసి గెలిపిస్తే అసెంబ్లీ లో ప్రజా సమస్యలను లెవనెత్తే గొంతుకను అవుతానని మిర్యాలగూడ సీపీఐ (ఎం ) ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి అన్నారు. దామరచర్ల మండలం లోని కొత్త పేట తండా , గోన్యా తండా ,దూద్యా తండా ,పెద్ద తండా ,కె జె ఆర్ కాలనీ ,కేతవత్ తండా ,దిలావర్ పూర్ , తూర్పు తండా ,కల్లేపల్లి ,గాంధీ నగర్ ,నర్సా పురం , రాజగట్టు గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చి ఘన స్వాగతం పలికారు.కార్యకర్తలు, అభిమానులు పూలదండలతో సన్మానించి అభినందనలు తెలిపారు. మహిళలు మంగళ హారతులు పడుతూ విజయ తిలకందిద్దారు.ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ
పూజారి ,దేవుడు లేని గుడి కమ్యూ నిస్ట్ ఎమ్మెల్యే లేని అసెంబ్లీ ఒకటేనని చెప్పారు. ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే అసెంబ్లీలో
కమ్యూ నిస్ట్ ఎమ్మెల్యే ఉండాల్సిందే నని చెప్పారు.
పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. నయా నవాబు మాదిరిగా దొరల గడీల పాలన సాగిస్తున్న కెసిఆర్ ప్రభుత్వం పట్ల అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ప్రజలకు అందుబాటులో లేని అధికార పార్టీ ఎమ్మెల్యే వల్ల నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. తాను మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసిన
సమయంలో ఎంతో అభివృద్ధి చేసినట్లు చెప్పారు. దాన ధర్మాల ముసుగులో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిజ స్వరూపం ఈ ఎన్నికల్లో బట్టబయలైందన్నారు. సొంత పార్టీ టికెట్ కేటాయించక ముందే నామినేషన్ వేసి తన అధికార దాహాన్ని ప్రదర్శించాడని విమర్శించారు. తాను కౌన్సిలర్ గా గెలిచిన వార్డునే చక్కదిద్దుకోలేని ఆయన నియోజకవర్గ మొత్తాన్ని ఏ మేరకు ఉద్దరిస్తాడో ప్రజలు ఆలోచన చేయాలన్నారు. మున్సిపాలిటీలో ప్రజా సమస్యల కోసం పోరాటం చేయలేకపోయినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అసెంబ్లీలో ప్రజల కోసం ఏం మాట్లాడుతాడని అన్నారు.మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు కు తాను కూడా పోరాటం చేయనున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులు దందాలు చేసి మిర్యాలగూడను దోచుకోవడానికే ఓట్ల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న విషయాన్ని ప్రజలందరూ గుర్తించాలని కోరారు. నీతి నిజాయితీగా పార్టీలకు అతీతంగా చట్టసభల్లో ప్రజా సమస్యలను ప్రస్తావించే తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీరామ్ నాయక్ ,సిపిఎం సియర్ నాయకులు పాపా నాయక్ , ఎర్రా నాయక్ ,మండల కార్యదర్శి వినోద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.