మీ బిడ్డను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించండి
* పలు వార్డుల్లో జూలకంటి విస్తృత ప్రచారం
మిర్యాలగూడ ప్రజాలహరి
నిత్యం ప్రజల మధ్యనే ఉంటున్నా…. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నా మీ బిడ్డగా ఆశీర్వదించి అసెంబ్లీకి పంపాలని సిపిఎం అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి కోరారు. గురువారం పట్టణంలోని తాళ్లగడ్డ, రాంనగర్, షాబునగర్, గాంధీ నగర్, మెదర బజార్, విద్య నగర్, హౌసింగ్ బోర్డ్, ఈదులగూడెం ప్రాంతాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అన్ని ప్రాంతాలలో మహిళలు అన్ని వర్గాల ప్రజలు ఘన స్వాగతం పలికారు. పూల వర్షం కురిపించారు. హరతులు పట్టి ఆప్యాయంగా స్వాగతం పలుకుతున్నారు. అడుగడుగునా ప్రజలు ఎదురొచ్చి నిరాజనాలు పలుకుతున్నారు. అన్నా మేమంతా నీ వెంటే అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ప్రజలకు మాయమాటలు చెప్పి పదవులు పొందాలని బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ఆభ్యర్థులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశానని తన హయాంలో చేసిన అభివృద్ధిని ఇప్పుడు భాస్కర్ రావు తాను చేసినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. కోట్లు ఖర్చుపెట్టి రెట్టింపుగా సంపాదించాలని ఆలోచనతోనే డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కౌన్సిలర్ గా ఉండి వార్డు అభివృద్ధి చేయని కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గ అభివృద్ధి ఏం చేస్తారని విమర్శించారు. మిర్యాలగూడలో పల్నాడు రాజకీయం చేస్తున్నారని చెప్పారు.బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే అసెంబ్లీలో చివరి బెంచి లో కూర్చుంటారని, తనను గెలిపిస్తే ముందు సీట్లో కూర్చుంటానని ప్రతిరోజు ప్రజా సమస్యలను లేవనెత్తే అవకాశం ఉంటుందని చెప్పారు. అందరివాడేగా నన్ను ఆదరించి అసెంబ్లీకి పంపాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, జిల్లా కమిటీ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవి నాయక్, డా.మల్లు గౌతమ్ రెడ్డి, భవాండ్ల పాండు పరుశురాములు, రాగిరెడ్డి మంగా రెడ్డి, జగన్ నాయక్, వదూద్, కరీం, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.