Ultimate magazine theme for WordPress.

మేడిగడ్డపై నేషనల్ డ్యామ్ అథారిటీ తప్పుడు నివేదిక

Post top

★ మేడిగడ్డపై … ఆరోపణలు

 

★ నిరాధారం.. అవాస్తవం

 

★ ఎన్‌డీఎస్ఏ చైర్మన్ కు తెలంగాణ

ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ

రజత్ కుమార్ ఘాటు లేఖ

 

★ డ్యామ్ సేఫ్టీ నివేదిక తప్పులతడక

 

★ వాస్తవాలు గ్రహించకుండానే రిపోర్టు

 

★ 17 అంశాలపై సమాచారం ఇస్తే

11 మాత్రమే ఇచ్చామంటారా?

 

★ వాటిని పరిశీలించకుండా

హడావుడిగా నివేదిక

 

★ పరీక్షించకుండానే కారణాలు

ఎలా నిర్ధారిస్తారు?

 

★ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ

నివేదికపై తెలంగాణ మండిపాటు

 

★ రిపోర్టులోని అంశాలపై అభ్యంతరాలు

 

★ పునరుద్ధరణకు సహకరించాలని విజ్ఞప్తి

హైదరాబాద్ ప్రజాలహరి…..

మేడిగడ్డ లక్ష్మీబరాజ్‌ కుంగిన ఘటనపై పరిశీలనకు నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) నియమించిన కమిటీ పూర్తిగా నిరాధారమైన అంశాలతో, హడావుడిగా నివేదిక ఇచ్చిందని రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షలు పూర్తిగా చేయకుండా, వాస్తవాలు గ్రహించకుండానే బరాజ్‌ కుంగుబాటుకు కారణాలపై కమిటీ నిర్ధారణకు వచ్చిందని పేర్కొంటూ ఎన్‌డీఎస్‌ఏ చైర్మన్‌ సంజయ్‌కుమార్‌ సిబల్‌కు శనివారం లేఖ రాశారు. నివేదికలోని అంశాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రిపోర్టులోని అంశాలు చాలా వరకు నిరాధారమైనవని, వాస్తవాలను పూర్తిగా అర్థం చేసుకోకుండానే నివేదిక ఇచ్చారని తెలిపారు. ప్రాజెక్టు పునరుద్ధరణకు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

 

లేఖలోని అంశాలు ఇలా…

 

★ 20 అంశాలపై సమాచారం అడిగితే 11 మాత్రమే ఇచ్చామనడం పూర్తిగా అబద్ధం. ఇంటరాక్టివ్‌ సమావేశాల్లో కమిటీ కోరిన అన్ని పత్రాలు చూపించాం. 29లోగా అన్ని పత్రాలను ఇవ్వాలని చెప్పి 27నే లేఖ రాశారు. సమయం లేకున్నా సరే 20 పత్రాల్లో 17 పంపించాం.మిగిలిన మూడింటిని నవంబర్‌ 1న మెయిల్‌ చేశాం.వాటిని పరిశీలించకుండానే హడావుడిగా నివేదిక ఇచ్చారు.

 

★ ఎన్‌డీఎస్‌ కమిటీ ఎలాంటి అధ్యయనం, భూగర్భ పరీక్షలు లేకుండానే పిల్లర్‌ కుంగుబాటును ఎలా నిర్ధారిస్తారు. బరాజ్‌ పునాది పూర్తిగా నీటితో నిండి ఉంది. నీటిని మళ్లించి బరాజ్‌ నిర్మాణాలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు వీలుగా కాఫర్‌ డ్యాం నిర్మాణం చేపట్టాం. ఆ పరిశోధనాత్మక పని పూర్తయిన తర్వాత మాత్రమే పియర్ల మునకకు కారణాలు అంచనా వేయగలుగుతాం. అప్పటి వరకు కమిటీ నివేదికను అంగీకరించబోం.

 

★ అప్‌స్ట్రీమ్‌ సెకాంట్‌ పైల్స్‌ వైఫల్యం సహా రాఫ్ట్‌ తదితర కారణాలు బరాజ్‌ వైఫల్యానికి ప్రాథమిక కారణమని రిపోర్టులో పేర్కొన్నారు. ఇది పూర్తిగా విరుద్ధం.మేడిగడ్డ బరాజ్‌లోని అప్‌స్ట్రీమ్‌, డౌన్‌స్ట్రీమ్‌ సెకాంట్‌ పైల్స్‌కు మెయిన్‌ రాఫ్ట్‌తో ఫ్లెక్సిబుల్‌ జాయింట్‌ ఏర్పాటు చేశాం. ఆ ఫ్లెక్సిబుల్‌ జాయింట్‌ కోసం ప్రోటోటైప్‌ను సీడబ్ల్యూసీనే అభివృద్ధి చేసింది. దీనిని ఉత్తరాఖండ్‌లోని తపోవన్‌ ప్రాజెక్ట్‌లోనూ ఉపయోగించారు.

 

★ బీఐఎస్‌ సూచించిన ప్రమాణాలు, సంబంధిత మార్గదర్శకాలకు అనుగుణంగా సెకాంట్‌ పైలింగ్‌ కార్యకలాపాలు నిర్వహించాం. బ్లాక్‌ల అప్‌స్ట్రీమ్‌, డౌన్‌స్ట్రీమ్‌లో సెకెంట్‌ పైలింగ్‌, డబుల్‌ పియర్లలో క్రాస్‌ కటాఫ్‌ల అమరిక, గైడ్‌వాల్‌ ఆర్‌సీసీతో నిర్మించాం. సెకాంట్‌ పైల్స్‌ పొడవునా ఆర్‌సీసీ గైడ్‌వాల్‌ను కూడా నిర్మించాం. సెకాంట్‌ పైలింగ్‌లో వినియోగించిన సిమెంట్‌, రా కంకర, ఫైన్‌ కంకర, స్టీల్‌ను ఐఎస్‌ కోడ్‌ల ప్రకారం ఫీల్డ్‌ ల్యాబ్‌లలో క్రమం తప్పకుండా పరీక్షించాం. రాఫ్ట్‌, కటాఫ్‌ మధ్య సెకాంట్‌ పైల్స్‌, ప్లింత్‌ కనెక్షన్‌ని అమలు చేస్తున్నప్పుడు పకడ్బందీగా నాణ్యత నియంత్రణ తనిఖీలు నిర్వహించాం. కాబట్టి ప్రాజెక్ట్‌ అమలు సమయంలో నాణ్యత నియంత్రణకు సంబంధించిన ఎన్‌డీఎస్‌ఏ కమిటీ తన రిపోర్ట్‌లో చేసిన వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవి.

 

★ ఆప్‌ లిఫ్ట్‌ను ఒత్తిడిని పరిగణనలోకి తీసుకుని ఐఎస్‌ కోడ్‌ 6966 – పార్ట్‌ 1(1989), సీబీఐపీ మాన్యువల్‌ నంబర్‌ 179-వాల్యూమ్‌ 1, 2ని అనుసరించి బరాజ్‌ స్టిల్లింగ్‌ బేసిన్‌ ఫ్లోర్‌ను ఆర్‌సీసీ రాఫ్ట్‌గా రూపొందించాం. స్టిల్లింగ్‌ బేసిన్‌ రాఫ్ట్‌పై ఉన్న ఒత్తిడిని తగ్గించడానికి ప్రెజర్‌ రిలీఫ్‌ వాల్వ్‌లు, డ్రైనేజీ అమరిక ఏర్పాటు చేశాం.

 

★ రివిజన్‌ ఆప్రాన్‌ డిజైన్‌ ఏర్పాటు అంశం ఇప్పటికే ఎస్‌డీఎస్‌వో, ఫీల్డ్‌ స్టాఫ్‌ నోటీసులో ఉంది. అందుకు సంబంధించిన మోడల్‌ స్టడీస్‌ను ఐఐటీ హైదరాబాద్‌తో కలిసి సంయుక్తంగా నిర్వహించాం. దీనికి సంబంధించిన తుది సిఫార్సులను ఎన్‌డీఎస్‌ఏకు అందిస్తున్నాం. వాటిపై నిర్దిష్ట వ్యాఖ్యలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాం. గత మూడేండ్లుగా బేసిన్‌లో నిరంతర వర్షాలు, బరాజ్‌లో ప్రవాహాలతో రివిజన్‌ ఆప్రాన్‌ను అమలు చేయడానికి అవకాశం లేకుండా పోయింది.

 

★ 13.12.2021 నుంచి డ్యామ్‌ భద్రతా చట్టం అమలులోకి వచ్చింది. నిర్మాణాల ఎత్తు, ఇతర వివరాలకు సంబంధించిన నిబంధనలు పేరొన్నా ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. తెలంగాణ ఎస్‌డీఎస్‌వో ఈ విషయంలో ఎన్‌డీఎస్‌ఏ నుంచి అనేక వివరణలను కోరింది. వాస్తవానికి సవరించిన మార్గదర్శకాల అభివృద్ధిలో తెలంగాణ ఎస్‌డీఎస్‌వో పాత్రను ఎన్‌డీఎస్‌ఏనే ప్రశంసించింది. ఆ వివరణల ప్రకారం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు 12-07-2023న మాత్రమే నిర్దేశిత ఆనకట్టల జాబితాలో చేర్చారు. మేడిగడ్డ బరాజ్‌ను నవీకరించిన జాబితాలో జూలై, 2023 నెలలో ఉంది. రుతుపవనాల ముందస్తు తనిఖీని నిర్వహించడం సాధ్యం కాలేదు.. చట్టం కింద అవసరమైన ఇతర తనిఖీ చేశాం, ఆ నివేదికలు ఇప్పటికే అందజేశాం.

 

★ అన్నారం, సుందిళ్ల బరాజ్‌లకు సంబంధించిన వ్యాఖ్యలు నిరాధారమైనవి, నిపుణుల కమిటీ రెండు బరాజ్‌లనూ సందర్శించలేదు. ఆ రెండూ ఎన్‌డీఎస్‌ చట్టం కింద పేరొన్న ఆనకట్టల జాబితాలో చేర్చారు. చట్టంలోని నిబంధనలను పూర్తిగా పాటించేందుకు ఎస్‌డీఎస్‌వో అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటుంది.

 

★ బరాజ్‌ల వంటి నీటి మళ్లింపు నిర్మాణాలు ఉపరితల ప్రవాహాలు, ఉప-ఉపరితల ప్రవాహాలు, ఒత్తిడి, సోర్స్‌, నిష్రమణ ప్రవణతలు, టెయిల్‌ఎండ్‌ నీటి మట్టం వంటి అనేక రకాల లోడింగ్‌ పరిస్థితులకు లోబడి ఉంటాయి. ఈ సవాళ్లను వ్యక్తిగతంగా, సమిష్టిగా పరిగణిస్తారు. బీఐఎస్‌, సీబీఐపీ బ్యారేజీల మాన్యువల్స్‌ను దేశంలోని ఒక ప్రముఖ సంస్థగా పరిగణిస్తున్న తెలంగాణ రాష్ట్ర సీడీవో మార్గదర్శకాలను పక్కాగా అనుసరించాం. హైడ్రాలజీ, కాస్టింగ్‌, ఇరిగేషన్‌ ప్లానింగ్‌, పర్యావరణ అనుమతులు తదితర అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత 06.06.2018న జలశక్తి మంత్రిత్వ శాఖకు చెందిన సాంకేతిక సలహా కమిటీ కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది.

 

తెలంగాణ అగ్రగామి…

 

2018 ఏప్రిల్‌ 9న అప్పటి కేంద్ర జల సంఘం చైర్మన్‌ మసూద్‌ హుస్సేన్‌ సీడబ్ల్యూసీ చీఫ్‌ ఇంజినీర్లతో కలిసి కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను సందర్శించారు. తెలంగాణ ప్రభుత్వం పనులను వేగవంతంగా పూర్తి చేసినందుకు అభినందించారు. ప్రాజెక్ట్‌ ను ‘ఇంజనీరింగ్‌ మార్వెల్‌’గా అభివర్ణించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, జీవావరణంపై అద్భుతమైన సానుకూల ఫలితాలు వస్తున్నాయి. రాష్ట్రంలో వ్యవసాయోత్పత్తి 300 శాతం పెరిగింది. ఉపరితల నీటి సరఫరా, భూగర్భ జలాశయాల రీచార్జ్‌ కారణంగా సగటు భూగర్భజల మట్టం 7 మీటర్లకు పైగా పెరిగింది. మత్స్య, పర్యాటక రంగాల్లో విపరీతమైన వృద్ధి నమోదవుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ మొత్తం సానుకూల ప్రభావం ఫలితంగా రాష్ట్రం ఏర్పడే సమయానికి 1.28 లక్షల నుంచి అత్యధిక తలసరి ఆదాయం రూ. 3.17 లక్షలతో దేశంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా సమర్థ సిఫారసులు చేసేందుకు, ప్రాజెక్టు పునరుద్ధరణకు రాష్ట్ర ఏజెన్సీలతో సహకరించాలి.

 

త్వరలో బరాజ్‌ పునరుద్ధరణ….

 

★ నిపుణుల అధ్యయనం అనంతరం చర్యలు.. నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ ప్రకటన

 

మేడిగడ్డ లక్ష్మీబరాజ్‌లోని 7వ బ్లాక్‌లో కుంగిన పిల్లర్ల పునరుద్ధరణ పనులు త్వరలో చేపడతామని నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ తెలిపింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా, నిర్దేశిత డిజైన్‌ ప్రకారం బరాజ్‌ను నిర్మించి 2019లో ప్రభుత్వానికి అప్పగించినట్టు పేర్కొంది. బరాజ్‌ వరుసగా ఐదు వరద సీజన్లను తట్టుకుని నిలబడిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది. పిల్లర కుంగుబాటు అంశంపై అధికారులు అధ్యయనం చేస్తున్నారని తెలిపింది. అధికారుల సిఫారసులకు అనుగుణంగా దెబ్బతిన్న బరాజ్‌ భాగాన్ని పునరుద్ధరిస్తామని వివరించింది.

post bottom

Leave A Reply

Your email address will not be published.