కాంగ్రెస్ పై భగ్గుమన్న రైతన్న
* రైతు బంధు యాసంగి నిధుల విడుదలను తక్షణమే ఆపాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ
* ఎన్నికల కోడ్ పేరుతో అమలులో ఉన్న పథకాలను నిలిపివేయాలని కుట్ర
* కాంగ్రెస్ దిష్టిబొమ్మను దహనం చేసిన భాస్కర్ రావు
మిర్యాలగూడ ప్రజాలహరి
#తెలంగాణ రైతాంగం కాంగ్రెస్ పార్టీపై కన్నెర్ర జేసింది. రైతు బంధు పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనున్న 12వ విడత నగదు బదిలీని అడ్డుకునేందుకు కుట్ర పన్నింది. రైతు బంధు పథకం ద్వారా 2018 నుంచి పంట పెట్టుబడులకు అన్నదాత ఆర్థిక సాయం పొందుతున్నారు. ఇప్పటికీ 11విడతల్లో 69 లక్షల రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.75,000 కోట్లు నగదు బదిలీ జరిగింది. ఈ ఏడాది జూన్ నెలలో 11వ విడత రైతు బంధు పథకం ద్వారా అన్నదాతల ఖాతాల్లో నగదు జమ అయింది. 12వ విడత ద్వారా రైతులకు యాసంగి పంట పెట్టుబడి సాయాన్ని తక్షణమే నిలిపివేయాలని కోరుతూ తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిన లేఖ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. తెలంగాణ కాంగ్రెస్ తీరు పట్ల నిరసన జ్వాలలు భగ్గుమంటున్నాయి. రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మిర్యాలగూడ నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు నేతృత్వంలో రైతులతో కలిసి బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ దిష్టి బొమ్మను దహనం చేశాయి. ఈ సందర్భంగా భాస్కర్ రావు మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కర్ణాటక రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అక్కడి అధికార కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదని విమర్శించారు. కర్ణాటక ఓటర్లు కాంగ్రెస్ పై నమ్మకంతో బీజేపీని ఓడించి అధికారం కట్టబెట్టారని అన్నారు. అధికారంలోకి వచ్చిన అనంతరం కాంగ్రెస్ పార్టీ మాట మార్చిందన్నారు. 5 గంటల విద్యుత్ మాత్రమే సాధ్యమని సాక్షాత్తూ కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి పేర్కొన్నారు. రైతుల పంట పొలాలకు కనీసం 5 గంటల విద్యుత్ కూడా సరఫరా చేయలేని దయనీయ స్థితిలో కర్ణాటక రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉన్నదని విమర్శించారు. రైతుల పంట పొలాలకు నీరందక పోవడంతో ట్యాంకర్ల సాయంతో రైతులు పంటలకు నీళ్ళు సరఫరా చేసుకుంటున్నారని అన్నారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంపై కన్నెర్ర చేసిన రైతాంగం మొసళ్లను సబ్ స్టేషన్లపై వదిలి నిరసన తెలుపుతున్నానని భాస్కర్ రావు తెలిపారు. కర్ణాటక రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ మరోసారి తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసేందుకు కుట్ర పన్నిందన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రైతులకు మూడు గంటల కరెంట్ చాలు. 24 గంటలు అనవసరమని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. వ్యవసాయ రంగంపై కనీస అవగాహన లేకుండా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని అన్నారు. కాంగ్రెస్ పాలన అంటే కాలిన మోటార్లు, నీటి తీరువా బిల్లులు, అప్పుల బాధతో రైతుల బలవన్మరణాలు, పన్ను వసూళ్లు అని ప్రజలు భీతిల్లుతున్నారని అన్నారు. కాంగ్రెస్ అధికార దాహంతో నోటికొచ్చిన తప్పుడు వాగ్దానాలను ఇస్తూ ప్రజలను పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. మేనిఫెస్టో లో సూచించిన ఏ ఒక్క హామీని కూడా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అమలు చేయడం లేదని విమర్శించారు. బీజేపీ పార్టీ రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని అన్నారు. బీజీపీ దారిలోనే కాంగ్రెస్ పార్టీ కూడా వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. కర్ణాటకలో కాంగ్రెస్ హామీలను నమ్మి మోసపోయిన రైతులంతా తెలంగాణ రాష్ట్రంలో వచ్చేనెల 30న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయొద్దని ప్రచారం చేస్తున్నారని చెప్పారు. కర్ణాటక నుంచి వచ్చిన రైతులు గద్వాల్, కొడంగల్ లో తీసిన ర్యాలీలే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగం పండుగలా మారిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత వ్యవసాయ రంగాన్ని సీఎం కేసీఆర్ గాడిలో పెట్టారని అన్నారు. 2018లో రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఎకరాకు ఏడాదికి రూ. 8వేలు పంటపెట్టుబడి సాయం అందించారని అన్నారు. దీన్నే క్రమంగా రూ.10వేలకు పెంచారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే ఎకరాకు రూ.16వేలకు పెంచనున్నట్లు మేనిఫెస్టో లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని అన్నారు. కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ రైతు బంధు పథకం ద్వారా అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించిన ఘనత సీఎం కేసీఆర్ దేనని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నదాతలకు నాణ్యమైన 24గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నారని అన్నారు. ప్రాజెక్టులు, చెరువులు, చెక్ డ్యామ్ ల నిర్మాణాల కారణంగా తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నంపెట్టే అన్నపూర్ణగా అవతరించిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కేంద్రం సహా ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయని అన్నారు. తెలంగాణలో అమలవుతున్న రైతు బంధు పథకాన్ని చూసి కేంద్రం పీఎం కిసాన్ సమ్మాన్ పథకాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో లో ప్రకటించని పథకాలను కూడా ప్రవేశపెట్టి అమలుచేస్తున్న మహానేత కేసీఆర్ అని భాస్కర్ రావు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రైతాంగ కక్షపూరిత విధానాలను బీఆర్ఎస్ శ్రేణులు తిప్పికొట్టాలని భాస్కర్ రావు పిలుపునిచ్చారు.