చెడుపై ఎల్లప్పుడూ మంచిదే విజయం
* రావణ దహనం, శమీ పూజ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు మిర్యాలగూడ ప్రజాలహరి
చెడుపై ఎల్లప్పుడూ మంచిదే విజయమని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. మిర్యాలగూడ పట్టణంలో రాజీవ్ గాంధీ స్టేడియం లో హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా ఉత్సవాలు, రావణాసురుడి దిష్టిబొమ్మ దహనం కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నల్లమోతు భాస్కర్ రావు మాట్లాడారు. చెడుపై మంచి సాధించిన విజయానికి తార్కారణంగా,జయకేతనంగా దసరా పండుగను నిర్వహించుకునే ముఖ్య ఉద్దేశమని అన్నారు. శరన్నవరాత్రుల్లో చివరి రోజైన విజయదశమి రోజున రావణ దహనం నిర్వహిస్తారని అన్నారు. హిందూ పురాణాల ప్రకారం.. ఇదే రోజున శ్రీరాముడి చేతిలో రావణుడి ఓటమి దసరా దశమి నాడే జరిగిందని చెప్పారు. విష్ణుమూర్తి దశావతారాల్లో ఏడో అవతారమైన శ్రీరామావతారంలో రాక్షసరాజు రావణుణ్ణి యుద్ధంలో ఓడించి చెరలో ఉన్న తన భార్య సీతను విడిపించారని అన్నారు. అంతకుముందు బంగారుగడ్డలోని కన్యకాపరమేశ్వరీ ఆలయంలో మిర్యాలగూడ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శమీ పూజలో పాల్గొన్నారు. జమ్మిచెట్టును పూజించి పాలపిట్టను వీక్షించారు. దసరా పండుగ సందర్భంగా ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, కర్నాటి రమేష్, ఎడవల్లి శ్రీనివాస్ రెడ్డి, ఉదయ్ భాస్కర్, బీఆర్ఎస్ యువనేత నల్లమోతు సిద్దార్థ, తదితరులు పాల్గొన్నారు.