హ్యాట్రిక్ కొడతా…
* అసెంబ్లీ ఎన్నికలపై ఎన్బీఆర్ ధీమా
* సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బీ-ఫామ్ అందుకున్న మిర్యాలగూడ శాసనసభ్యులు
* రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలి
* భారీ మెజారిటే లక్ష్యంగా బీఆర్ఎస్ శ్రేణులంతా సమిష్టి కృషి చేయాలి : నల్లమోతు భాస్కర్ రావు
ప్రజాలహరి మిర్యాలగూడ
వచ్చేనెల 30న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొడతానని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు ధీమా వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో బీఆర్ఎస్ చీఫ్, ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఆయన బీ-ఫామ్, రూ.40 లక్షల చెక్కు అందుకున్నారు. అనంతరం నల్లమోతు భాస్కర్ రావు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి బీఆర్ఎస్ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. గత తొమ్మిది సంవత్సరాల్లో మిర్యాలగూడ నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపిస్తున్నానని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిరాటంకంగా కొనసాగుతున్న సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ కు మరోసారి పట్టం కడతాయని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటే లక్ష్యంగా బీఆర్ఎస్ శ్రేణులంతా సమిష్టి కృషి చేయాలని కోరారు. కనీసం 50వేల మెజారిటీ తగ్గకుండా విజయం నమోదు చేస్తామని అన్నారు. ప్రచార యాత్రలో ఏ ఊరికి వెళ్ళినా ప్రజలు బీఆర్ఎస్ కు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. గులాబీ జెండా రాష్ట్ర ప్రజలకు శ్రీరామ రక్ష అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతి రథ చక్రాలు ఆగిపోవద్దంటే ప్రతి ఒక్కరూ బీఆర్ ఎస్ కు ఓటు నమోదు చేయాలని భాస్కర్ రావు కోరారు. ఢిల్లీ, గుజరాతీ గులాములు కావాలో లేక తెలంగాణ రాష్ట్ర గులాబీలు కావాలో ప్రజలే తేల్చుకోవాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్లైతే మళ్లీ చీకటి రోజులు అలుముకొని రాష్ట్రం అంధకారంలోకి కూరుకుపోతుందన్నారు. క్యాడర్ లేని బీజీపీ నేతలు రాష్ట్రంలో ద్వితీయ స్థానం కోసం కాంగ్రెస్ తో పోటీపడుతున్నదని విమర్శించారు. నాయకత్వ లోపంతో కాంగ్రెస్ కొట్టుమిట్టాడుతోందని విమర్శించారు. క్యాడర్ ఉన్న కాంగ్రెస్ పార్టీకి సైతం 119 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులపై అభ్యర్థులను నిలబెట్టాలంటే దొరకక నానా హైరనాపడి పోతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రాజకీయ వ్యూహాలను అర్థం చేసుకోలేక కాంగ్రెస్, బీజీపీ నేతలు మేకపోతు గంభిర్యాలను ప్రదర్శిస్తున్నారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోవడం ఖాయమని ఆరోపించారు. కర్ణాటక లో అధికారం ఉన్న కాంగ్రెస్ రైతులకు 5 గంటల కంటే ఎక్కువగా కరెంట్ సరఫరా చేయలేమని చేతులెత్తేసిందని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు దేశానికే బువ్వపెట్టే స్థాయికి ఎదిగిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. వ్యవసాయానికి 3 గంటలు చాలనే కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటెయ్యలా? 24 గంటలు ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను ప్రవేశపెట్టి వ్యవసాయ రంగాన్ని గాడిలో పెట్టిన కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ ఎస్ కు ఓటెయ్యాలనేది ఓటర్లు నిర్ణయించుకోవాలి. ఆసరా పెన్షన్లు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మీ, దళిత బంధు వంటి పథకాలు ఇతర రాష్ట్రాల నేతలను సైతం ప్రభావితం చేశాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారిందని భాస్కర్ రావు తెలిపారు.