Ultimate magazine theme for WordPress.

చిన్నారులకు బాలసాహిత్యం చెప్పండి

Post top

బాల సాహిత్యం….

 

అంటే… అక్బర్ బీర్బల్ కథలు, తెనాలి రామకృష్ణ కథలు

అనగనగా ఒక అడవిలో… కథలు, అనగనగా ఒక రాజు

ఆ రాజుకు ఏడుగురు కొడుకులు.. కథలు,ఒక రాజ్యంలో ఒకానొక రాజు..ఒక తెలివైన మంత్రి..ఆ మంత్రి ఏ సమస్యనైనా చిటికెలో పరిష్కారిస్తాడు… లాంటి కథలు ఇంకా అనేకమైన నీతి కథలేనా…ఇవి కాకుంటే సామాజిక సమస్యలకు సంబంధించిన బాల కథలను పరిశీలిస్తే అత్యాశ,పేరాశ కలిగిన సోమన్నకు కథ చివర్లో బుద్ధి చెప్పడం, గర్వంగా ఉండే లక్ష్మయ్య గర్వభంగం చేయడం, వంటి కథలు, నాన్న పులి వచ్చే లాంటి కథలు గత

యాబై సంవత్సరాలుగా వింటున్నాం….. ఇంకా ఎన్ని రోజులు ఆ పాతబడిన కథలనే పిల్లలకు చెపుతాం.ప్రతి ఆదివారం పుస్తకంలో వచ్చే ఆ కథలను నిజంగా పిల్లలు

చదువుతున్నారా?నీతి కథలు, జంతువుల కథలు, పజిల్స్ లతో ఎన్ని దశాబ్దాలు సండే స్పెషల్ బుక్స్ లో వెనక పేజీ నింపేస్తారు.ప్రస్తుతం సండే బుక్ లో లాస్ట్ పేజీ అంటే పిల్లల పేజీ అంటే ఏ ప్రత్యేకత లేని పేజీ అని అర్థం.ఒకప్పుడు ఆర్.కె.కరంజియా ఎడిటర్ గా బ్లిట్జ్ అనే పక్ష పత్రిక వచ్చేది.ఆ పత్రికలో లాస్ట్ పేజీకీ చాలా ప్రాముఖ్యత ఉండేది.ఆ లాస్ట్ పేజీ ఆర్టికల్ సీనియర్ జర్నలిస్టు సాయినాథ్ రాసేవాడు.

ఆ లాస్ట్ పేజీ ఆర్టికల్ చదవడానికి వేల మంది రీడర్స్

ఎదురుచూసే వాళ్ళు.ప్రస్తుతం వస్తున్న మాగజైన్ లలో

లాస్ట్ పేజీలను,వారఫలాలకు, పిల్లలకు కేటాయిస్తున్నారు.

పేజీ నింపాలన్న తాపత్రయం తప్ప పిల్లలు ఏది రాస్తే చదువుతారు,వాళ్ళల్లో క్రియేటివిటీని పెంపొందించే అంశాల రూపకల్పన మీద శ్రద్ధ మాత్రం కనిపించడం లేదు.

సండే మాగజైన్ లలో వచ్చే కథలను పరిశీలిస్తే ఇతివృత్తం

ఒకటే ఉంటుంది, కానీ పాత్రల పేర్లు మారుస్తున్నారు.

అంటే పాత కథలనే కొంచెం మార్చి రాయడం చేస్తున్నారని

నా అభిప్రాయం….

నా చిన్నప్పుడు చందమామ, బాలమిత్ర, బాలల పుస్తకాల పట్ల ఒక క్రేజ్ ఉండేది.వీటితో పాటు బాలజ్యోతి, బుజ్జాయి, లాంటి బాలలు పత్రికలు కూడా వచ్చేవి.ఆ పుస్తకాలలో మొత్తం నేను పైన చెప్పిన కథలే ఉన్నా చందమామలో వచ్చే విక్రమ్ – బేతాళుడి కథలు పిల్లలలో ఆలోచనా శక్తిని పెంచే విధంగా ఉండేవి.బేతాళుడు ఒక కథ చెప్పి చివరలో ఒక ప్రశ్న అడగడం, దానికి విక్రమార్కుడు తెలివిగా సమాధానం ఇవ్వడం ఆ కథల ఇతివృత్తం.ఇకపోతే ఇంగ్లీషులో ఫాంటమ్- అమెరికన్ అడ్వెంచర్ కామిక్ బుక్స్ ఉండేవి.ఇది చాలా సింపుల్ ఇంగ్లీషులో బొమ్మలతో కథ,పాత్రలతో డైలాగులు చెప్పించేవారు.మల్టీ కలర్ లో ప్రతి పేజీ అందంగా డిజైన్ చేసి చాలా అద్భుతంగా పుస్తకం ఉండేది.ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్క అడ్వెంచర్.ఫాంటమ్ వేషధారణ ఆయన గుర్రం మీద కూర్చునే కారికేచర్స్, వాటికి సంబంధించిన కథలు చాలా ఆసక్తికరంగాఉండేవి.

పందొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి ఎనబై నాలుగు సంవత్సరం వరకు మా నాన్న ఈ పుస్తకాలు తెచ్చేవారు.అప్పట్లో మా ఇంట్లో ప్రతి వారం

ఆంధ్ర భూమి వార పత్రిక,చందమామ,ఫాంటమ్ కామిక్ పుస్తకాలు, క్రమం తప్పకుండా నాన్న తెచ్చేవారు.ఇంతే

కాకుండా స్పుతినిక్ అనే రష్యన్ మాగజైన్ ప్రతి నెల పోస్ట్ లో వచ్చేది.దాదాపు అరవై పేజీల మల్టీ కలర్ పుస్తకం అది

అది ఇంగ్లీషులో ఉండటం వల్ల దాన్ని మా నాన్న మాత్రమే

చదివేవారు.ఇది బాలల పుస్తకం కాదు.ఇంకొక పత్రిక ఇలుస్ట్రేటేడ్ వీక్లీ ..ఈ మాగజైన్ సైజ్ చాలా పెద్దదిగా ఉండేది.మొదట అది ఇలుస్ట్రేటేడ్ వీక్లీ ఆఫ్ ఇండియా అనే పేరుతో పబ్లిష్ అయ్యేది.

ప్రారంభంలో ఈ వీక్లీ ఎడిటర్లుగా ఏ.ఎస్.రామన్,కుష్వంత్

సింగ్,ఏం.వి.కామత్,ప్రితీష్ నంది లు పనిచేసారు.నాకు

జ్ఞాపకం ఉన్నంత వరకు ఇలుస్ట్రేటేడ్ వీక్లీ మా నాన్న

ప్రతి వారం తెచ్చేవారు.అంటే పందొమ్మిది వందల ఎనభైవ

దశకంలో మా ఇంట్లో ప్రతి వారం ఆ వీక్లీ మా నాన్న నల్గొండ నుంచి కొనుక్కొచ్చేవారు.అప్పట్లో ఎడిటర్ గా

ప్రితీష్ నంది ఉండేవాడు.కార్టూనిస్టులుగాఆర్.కె.లక్ష్మన్,

మారియో మిరాండాలు ఉండేవారు.ఆ వీక్లీలో ఎక్కువగా ఫోటో కథనాలు ఉండేవి.మాకర్ధమయ్యేవి కావు, నాన్న

చెపుతుంటే ఆసక్తిగా వినేవాళ్ళం.ఆ తరువాత 1993 సంవత్సరంలో ఆ పత్రికను సీజ్ చేశారు.ఎందుకో తెలియదు, కానీ ఎడిటర్ ప్రితీష్ నంది గుండు చేసుకున్న ముఖం మాత్రం ఇంకా కళ్ళ ముందు కదలాడుతూనే వుంది.ఇదీ పిల్లల మాగజైన్ కాదు.కేవలం మా నాన్న మా ఇంటికి కొనుక్కుని వచ్చే పుస్తకాల గురించి ఒక ప్రస్తావన. ఆంధ్రభూమి వార పత్రికకు సి.కనకాంబరరాజు

ఎడిటర్ గా ఉండేవాడు.అప్పట్లో మా హీరో యండమూరి వీరేంద్రనాథ్ గారు ఆయన సీరియల్స్ క్రమం తప్పకుండా చదివేవాళ్ళం.ఆయనకు హీరో చిరంజీవి కన్నా ఎక్కువ ఫాలోయింగ్ ఉండేది.కార్టూనిస్ట్ మల్లిక్, కామిడీ సీరియల్స్ కూడా రాసేవాడు….కట్ చేస్తే…

చాలా ఏళ్ళ వరకు బాల సాహిత్యాన్ని ఎవరూ పట్టించుకోలేదనే చెప్పాలి.అప్పటి ఆంధ్ర పత్రిక, ఆంధ్ర భూమి,ఆంధ్రప్రభ,ఆ తరువాత రోజుల్లో వచ్చిన ఈనాడు దినపత్రికలు బాలల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు.ఎనబైవ దశకంలో దాసరి నారాయణరావు గారు ప్రారంభించిన ఉదయం దిన పత్రిక

మొట్టమొదట పిల్లల కోసం ఉదయ బాల అనే ఫీచర్ ని ప్రారంభించింది. ఉదయం టాబ్లాయిడ్ పేపర్ లోని సెంటర్ స్ప్రెడ్ లో వారానికి ఒక రోజు ఉదయ బాల అచ్చయ్యేది.అవును ఉదయం పేపర్లోనే ఫస్ట్ టైం పిల్లల

కోసం ప్రత్యేక పేజీ వచ్చేది.ఆ ఉదయ బాల పేజీ ఇంచార్జి గా మా గురువు గారు వేదాంత సూరి ఉండేవారు.ఆ తరువాత 1994 సంవత్సరంలో ఉదయం పత్రికను ఇతర కారణాల వల్ల మూసివేశారు.అదే సమయంలో వ్యాపార వేత్త గిరీష్ సంఘీ నేతృత్వంలో వార్త దినపత్రిక ప్రారంభం

అయ్యింది.అక్కడ కూడా పిల్లల కోసం మొగ్గ అనే ఒక పేజీనీ రోజూ మా గురువు గారు వేదాంత సూరి గారు నిర్వహించేవారు.

ఎడిటర్ తో ముఖాముఖి అనే శీర్షికతో వచ్చిన ఫీచర్ కు చాలా గుర్తింపు వచ్చింది.సూరి గారు గత నలబై ఏళ్ళ నుంచి బాల సాహిత్యం మీద పని చేస్తున్నారు.ఇప్పటి

వరకు బాల సాహిత్యంపై దాదాపుగా నలభై పుస్తకాలు

వెలువరించారు.ఉమ్మడి కరీం నగర్ జిల్లాకు చెందిన సూరి గారికి అప్పుడూ గుర్తింపు రాలేదు.తెలంగాణా రాష్ట్రం

వచ్చాక కూడా ఆయనకు ఏ అవార్డులు, రివార్డులు వచ్చిన దాఖలాలు లేవు.బాల సాహిత్యం మీద మక్కువ తో,వేదాంతసూరి గారు ఇప్పటికీ మొలక అనే బాలల పత్రికను నడిపిస్తున్నారు.ఆర్ధిక వనరులు లేక కొన్ని నెలలు పత్రికను ప్రచురించలేక పోయారు….కట్ చేస్తే…

మొన్న ఈ మధ్యన మొలక బాలల పత్రిక

ఆత్మీయ సమ్మేళనం జరిగింది.ఈ కార్యక్రమంలో సీనియర్

జర్నలిస్టులు,డాక్టర్లు, మేధావులతో కూడిన పదిహేను

మంది పాల్గొన్నారు.బాలల మాగజైన్ ద్వారా పిల్లలకు ఎలాంటి సందేశాలు ఇవ్వాలో,వాళ్ళలో సృజనాత్మకతను

పెంచేందుకు ఎలాంటి అంశాలు ఆ పుస్తకంలో పొందుపరచాలో అన్న విషయాలపై అందరూ తమ తమ

అభిప్రాయాలను వ్యక్తం చేశారు.అందులో ఉదయం,వార్త

పత్రికల్లో పనిచేసిన సీనియర్ సబ్ ఎడిటర్ శ్రీమతి జె.శ్యామల గారు చాలా అద్భుతమైన సూచనలు చేశారు.

నాకూ బాగా నచ్చాయి.ఆమె అంటారు….

నీతి కథలు, జంతువుల కథలు,రామాయణ భారత, భాగవత పురాణ కథలు,రాజుల కథలు ఎన్ని

సంవత్సరాలు మన పిల్లలకు నేర్పిస్తాం.ఈ ఆధునిక యుగంలో పిల్లల మనస్తత్వానికి తగ్గట్టుగా వాళ్ళల్లో క్రియేటివిటీని పెంపొందించే కొత్త అంశాలను పొందుపరుచాలి.సెల్ ఫోన్లు, సోషల్ మీడియాలు వాడుకలో ఉదృతంగా ఉన్న ఈ రోజుల్లో మనం మన

పత్రిక ద్వారా పిల్లలను ఏ విధంగా చేరుకోగలమో ఆలోచించాలి..వాళ్ళను చదివించేలా చేయడానికి వాళ్ళకు ఆసక్తి కలిగించే విషయాలను మనం అందించగలగాలి…ఆ దిశలో మనం ఆలోచించాలి…

పనిచేయాలి..అంతే కాకుండా చిన్నప్పటి నుంచి పిల్లలకు

చదవడం అలవాటు చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే….

ప్రమోద్ ఆవంచ

7013272452

post bottom

Leave A Reply

Your email address will not be published.