పథకాలు, నిధులు అమలు చేయడంలో చిత్తశుద్ధి లేదు
* ఓట్ల కోసం ప్రజాధనం దుర్వినియోగం
* ఎమ్మెల్యే వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనం
* విలేకరుల సమావేశంలో జూలకంటి
మిర్యాలగూడ ప్రజాలహరి…
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్న సంక్షేమ పథకాలు నిధుల విషయంలో ఏమాత్రం చిత్తశుద్ధి లేదని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. బుధవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ప్రజలను మభ్య పెట్టేందుకు మోసం చేసేందుకు మోడీ, కెసిఆర్ లు కొత్త పథకాలు అభివృద్ధి నిధులు ప్రకటిస్తున్నారని, కానీ క్షేత్రస్థాయిలో వాటిని అమలు చేయడం లేదని ఆరోపించారు. అధికారంలో ఉన్న ఇన్నాళ్లు సంక్షేమ పథకాలు అభివృద్ధి నిధులు అమలు చేయలేదని ధ్వజమెత్తారు. ప్రజలను ఓట్లర్లను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓట్ల కోసం ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని తమ పార్టీ కార్యకర్తలకు సంక్షేమ పథకాలు అందిస్తూ నిజమైన అర్హులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. యూనిట్ల వారిగా పథకాలు మంజూరు చేసి ఆ సామాజిక వర్గం మొత్తం డబ్బులను పంచుకోవాలని సూచించడం సరైంది కాదన్నారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు, కాంగ్రెస్ను అడ్డుకున్నందుకు బిజెపి బీఆర్ఎస్ పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. గల్లీలో కుస్తీ చేసి ఢిల్లీలో దోస్తీ చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఆ రెండు పార్టీలు ఒకటేనని చెప్పారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు అధికార అహంకారంతో ప్రజలపై ఓటర్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. వారి అహంకారానికి వారి వ్యాఖ్యలే నిదర్శనం అన్నారు. ప్రజా సమస్యలపై సమాధానం చెప్పలేక విరుచుకుపడుతున్నారని ఆరోపించారు. దురుసు ప్రవర్తన ను మానుకోవాలని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, జిల్లా కమిటీ సభ్యులు డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి, రాగిరెడ్డి మంగారెడ్డి, తిరుపతి రామ్మూర్తి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.