
మొలక ఆత్మీయ సమ్మేళనం…
నేను గత మూడు రోజులుగా మహారాష్ట్రలోని సోలాపూర్ పండర్ పూర్, అక్లూజ్ టూర్లో ఉన్నాను.శుక్రవారం సాయంత్రం గురువు గారు వేదాంత సూరి గారి ఫోన్, ప్రమోద్,ఆదివారం ఉదయం మొలక బాలల పత్రిక శ్రేయోభిలాషుల సమావేశం ఉంది.నువ్వు తప్పకుండా రావాలి,అనీ.ఓకే గురువు గారు అలాగే వస్తాను,అని చెప్పి
ఫోన్ పెట్టేసాను.నేను శనివారం రాత్రి పన్నెండున్నర గంటలకు ఇంటికి వచ్చాను.తిని,చదువుకొని ,రాసుకుని పడుకునే సరికి అర్థరాత్రి రెండున్నర అయ్యింది.ఈ రోజు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు నిద్ర లేచాను.
ఫోన్ చూసుకుంటే గురువు గారి రెండు మిస్సుడ్ కాల్స్
ఉన్నాయి.తిరిగి ఫోన్ చేసాను,వస్తున్నారు కదా పన్నెండయినా పర్వాలేదు కానీ తప్పకుండా రండీ అంటూ
ఫోన్ పెట్టేసారు వేదాంత సూరి గారు.అన్ని కార్యక్రమాలు ముగించుకొని పన్నెండు గంటలకు సార్ చెప్పిన అడ్రస్ కి
వెళ్ళాను.అది ఒక అపార్ట్మెంట్.అందులో అయిదవ ఫ్లోరులోనీ టెర్రస్ మీద సమావేశం.మూడు టేబుల్స్ చుట్టూ పదిహేను కుర్చీలు,ఆ కుర్చీలలో నేను వెళ్ళేసరికే
పెద్దలు ఆసీనులై ఉన్నారు.ఆ పదిహేను మందిలో నాకు
తెలిసింది ఇద్దరే వ్యక్తులు ఒకరు వేదాంత సూరి గారు, ఇంకొకరు అక్కినేని శ్రీధర్,అంతే ఇంకెవరూ నాకు పరిచయం లేదు.సూరి గారి దగ్గరకు వెళ్ళి పలకరించాను.ఆయన లేచి వచ్చి ఇద్దరు వ్యక్తులను
పరిచయం చేసారు.వారు మర్రి శోభారెడ్డి గారు ఆమె కుమారుడు డాక్టర్ మర్రి రాజేందర్ రెడ్డి.. యూరాలజిస్ట్.
ఈయన నాన్న గారు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సూర్యాపేటలో ఒకప్పుడు ప్రముఖ డాక్టర్ మర్రి లక్ష్మారెడ్డి
జనరల్ సర్జన్.నేను ఆశ్చర్యపోయాను…ఆనంద పడ్డాను
కట్ చేస్తే….
అది పందొమ్మిది వందల తొంబై అయిదవ సంవత్సరం, నేను నల్గొండను బేస్ చేసుకుని సిస్టోపిక్ ఫార్మా కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్న
రోజులు సూర్యాపేట,నాకు ఎక్స్ స్టేషన్.సూర్యాపేట్ వెళ్ళగానే అప్పట్లో కొత్త బస్టాండ్ నిర్మాణం కానట్లుంది, నాకు జ్ఞాపకం రావడం లేదు.పాత బస్టాండులో బస్సు దిగి
ఎదురుగా సందులో ఉన్న డాక్టర్ లక్ష్మారెడ్డి హాస్పిటల్ కి
వెళ్ళేవాడిని,హాస్పిటల్ పక్కనే ఉన్న ఇంకో ఇంట్లోనే ఆయన నివాసం.పందొమ్మిది వందల డెబ్బై నాలుగవ సంవత్సరంలో ఆయన గవర్నమెంట్ డాక్టర్ గా సూర్యాపేటకు వచ్చారు.అప్పటికే డాక్టర్ పోటు పుల్లయ్య
డాక్టర్ రామయ్య మరియు ఆయన బ్రదర్ డాక్టర్ విఠల్, డాక్టర్ ఇందిరా గోఖలే..ఈమె డెబ్భై వ దశకంలోనో లేదా
అంతకు ముందే వచ్చి వుంటుందనీ నా అభిప్రాయం.
డాక్టర్ ఆచారి, డాక్టర్ భూమారెడ్డిలు పిల్లల స్పెషలిస్టులు, డాక్టర్ రాయన్న అనే డాక్టర్ ఒక వారం మిర్యాలగూడకు,మరొక వారం సూర్యాపేటకు వస్తుండేవారు.వీళ్ళే కాకుండా జనగామ-వర్ధమాన్ పేట్ కు
ఒక గైనకాలజిస్ట్ కూడా ఒక వారం మిర్యాలగూడకు,
మరొక వారం సూర్యాపేటకు వచ్చేవారు….కట్ చేస్తే…
డాక్టర్ మర్రి లక్ష్మారెడ్డి శస్త్ర చికిత్స వైద్య నిపుణులు( జనరల్ సర్జన్), ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నప్పటి నుంచి చాలా సౌమ్యుడు, చాలా ఓపికగా సమాధానాలు ఇస్తూ, అవసరం ఉంటేనే ఆపరేషన్స్ చేస్తూ, సూర్యాపేట ప్రజల మన్ననలను పొందారు.డాక్టర్ నుంచి పేషెంట్లు ఆశించేది భరోసా..ఒక
ధైర్యం,ఒక ఊరట,పేషేట్ల మనసుల్లో ఉన్న భయాన్ని
తొలగించడం,ఆపద సమయంలో పేషెంట్లు అడిగే అర్ధం
లేని ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇవ్వడం,ఆపద సమయంలో వాళ్ళు చాలా టెన్షన్ తో ఉంటారు, అలాంటి సమయంలోనే వాళ్ళను అర్ధం చేసుకోవడం డాక్టర్ ధర్మం.ఇలాంటి లక్షణాలను అనుభవంతో సంపాదించుకున్నారు డాక్టర్ మర్రి లక్ష్మారెడ్డి.పేషెంట్లకు
మరొక పెద్ద సమస్య ఆపరేషన్ అయ్యే డబ్బులు సమకూర్చుకోవడం…ఇది ప్రధానమైన సమస్య…. డాక్టర్
లక్ష్మారెడ్డి తాను ప్రభుత్వ సర్వీసు నుంచి విరమణ చేసిన
తర్వాత తన హాస్పిటల్ లో చాలా మంది పేదలకు ఉచితంగా ఆపరేషన్లు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి.ఆయన హాస్పిటల్ రోజూ వంద మంది
పేషెంట్లతో కిట కిట లాడుతూ ఉండేది.పందొమ్మిది వందల తొంబై అయిదు నుంచి తొంభై ఎనిమిది.. తొంబై తొమ్మిది వరకు నేను సిస్టోపిక్ ఫార్మా కంపెనీ మెడికల్ రిప్రజెంటేటివ్ గా ఆయనను రెగ్యులర్ గా కలిసే వాడిని.
చాలా సౌమ్యుడు, నేనంటే చాలా ఇష్టపడే వారు.అంతే
కాకుండా నా ప్రాడక్స్ చాలా రాసేవారు.కొన్ని సార్లు ఆయన ఇంటికి వెళ్ళి కలిసేవాడిని.ఆయన ప్రతి శనివారం
హైదరాబాద్ వచ్చేవారు, ఆయనతో కలిసి హైదరాబాద్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి….కట్ చేస్తే…..
శోభారెడ్డి గారు డాక్టర్ లక్ష్మారెడ్డి గారి అర్ధాంగి.
కామారెడ్డిలో ఒక రైతు కుటుంబంలో జన్మించి, హైదరాబాద్ లోని మాడపాటి హనుమంతరావు హైస్కూలులో, రెడ్డి కళాశాలలో విద్యనభ్యసించారు.ఆ తరువాత డాక్టర్ సినారే, యశోదా రెడ్డి గార్ల శిష్యరికంలో
ఎంఏ తెలుగు పూర్తి చేసారు.తెలుగు భాష పట్ల ఆమెకున్న మక్కువతో తెలుగు సాహిత్యంపై గహనతరమైన అధ్యాయనం చేసింది.ఆమె వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న కుమారుడు డాక్టర్ మర్రి రాజేందర్ రెడ్డి, ఉస్మానియాలో మెడిసిన్ పూర్తి చేసి,పై చదువులు
యూకేలో పూర్తి చేసాడు.ప్రస్తుతం యూరాలజిస్ట్ గా హైదరాబాద్ లో ప్రాక్టీస్ చేస్తున్నాడు.ఆయన వాళ్ళ అమ్మ భాటలో నడుస్తూ తెలుగు భాష, సాహిత్యంపై అభిమానం
పెంచుకొని,ఖాళీ సమయంలో చదువుతుంటారు.లండన్
లో ఉన్నా పిల్లలకు తెలుగు రాయడం,చదవడం నేర్పించాడు.తెలుగులో వచ్చే బాలల పత్రికలను వాళ్ళే
చదివిస్తున్నారు…కట్ చేస్తే…
ఆధునిక పోకడలు విపరీతమైపోయి, తెలుగు భాష,తెలుగు సాహిత్యం,ఆదరణ కోల్పోయింది.
ప్రస్తుతం తెలుగు చదివే వాళ్ళు లేకుండా పోయారు.ఈ
దుస్థితిని గమనించిన శోభారెడ్డి గారు బాల్యం నుంచే పిల్లలకు తెలుగు బాషపై అభిరుచి కల్పించడం,వాళ్ళచే
తెలుగు పుస్తకాలు చదివించడం వంటి అలవాట్లను
తల్లిదండ్రులు నేర్పించాలనే, అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.ఈ దిశలోనే ఒక బాలల పత్రికను స్థాపించాలన్న
నిర్ణయానికి వచ్చారు.ఆ పత్రికకు నెమలీక అని పేరును కూడా అనుకున్నారు.ఒకసారి ప్రారంభించాక అనేక సవాళ్ళను,అధిక శ్రమను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
తనకు వయసు సహకరించదు,కొడుకు తన డాక్టర్
వృత్తిలో బిజీగా ఉండడం, లాంటి సమస్యల మూలంగా
ఆ ఆలోచనను విరమించుకున్నారు.ఆ తరువాత శోభా రెడ్డి మిత్రురాలు హేమలతారెడ్డి గారి ద్వారా వేదాంత సూరి గారు పరిచయం అయ్యారు.ఆయన ఆర్థిక కారణాల వల్ల తను మొలక బాలల పత్రిక ఆగిపోయింది.
అయినా ఆయన ఆన్లైన్లో పత్రికను నడుపుతూనే ఉన్నారు.ఆ పత్రికలో మర్రి శోభారెడ్డి, మర్రి రాజేందర్ రెడ్డి
బాగస్వాములై మొలక బాలల పత్రికను తిరిగి ప్రచురించడం ప్రారంభించారు.తాము స్వంత పత్రిక పెడితే
ఏ విధంగా అయితే నడిపించాలనుకున్నారో ఆ విధంగా
వాళ్ళకు పూర్తి స్వేచ్ఛను సూరిగారు ఇచ్చారు.ప్రస్తుతం
మొలక బాలల పత్రిక నెలనెలా మార్కెట్ లోనికి విడుదలవుతుంది.వేదాంతసూరిగారితో పాటు అనుభవజ్ఞులైన పెద్దలు ఎడిటోరియల్ బోర్డులో ఉండి ప్రతి నెల పిల్లలు అభిరుచుల మేర పరిపూర్ణమైన విజ్ఞానాన్ని అందిస్తూ, తెలుగు భాష పట్ల పిల్లల్లో ఆసక్తి
పెంచే ప్రయత్నం చేస్తున్నారు.వాళ్ళఆ ప్రయత్నం సఫలీకృతం అవ్వాలని కోరుకుంటూ…..
ప్రమోద్ ఆవంచ
7013272452