దోపిడీ దొరల గడిని కూల్చిన ధీశాలి ఐలమ్మ : నల్లమోతు భాస్కర్ రావు మిర్యాలగూడ ప్రజాలహరి,…
#బానిస బతుకుల విముక్తి కోసం పోరాడి దోపిడీ దొరల గడిని కూల్చిన ధీశాలి చాకలి ఐలమ్మ అని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు అన్నారు. చాకలి ఐలమ్మ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలని ప్రశంసించారు. హైదరాబాద్ నగరంలో నాంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో ఐలమ్మ 128వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు.
అనంతరం ఎమ్మెల్యే భాస్కర్ రావు మాట్లాడారు. తెలంగాణ తల్లి చాకలి ఐలమ్మ సేవలు రాష్ట్ర ప్రజలకు స్ఫూర్తిదాయకం, చిరస్మరణీయమని అన్నారు. తెలంగాణ ప్రజల విముక్తి కోసం భూస్వాములకు, పెత్తందారులకు,రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి నిరంతరం ప్రజాసేవకు అంకితమైన వీరనారి ఐలమ్మ సేవలు మరువలేనివని అన్నారు. ఐలమ్మ స్ఫూర్తితో ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ అని చెప్పారు.సామాజిక ఆధునిక పరిణామానికి ఆమె నాంది పలికారని అన్నారు. చాకలి కులవృత్తినే నమ్ముకొని జీవనం కొనసాగించారని అన్నారు.విస్నూర్ లో దేశ్ముఖ్, రజాకార్ల అరాచకాలపై ఎదురుతిరిగిన వీరనారి చాకలి ఐలమ్మ అని అన్నారు. ‘ఈ భూమి నాది..పండించిన పంట నాది…తీసుకెళ్లడానికి దొరెవ్వడు…నా ప్రాణం పోయాకే ఈ పంట, భూమిని మీరు దక్కించుకోగలరు’ అని మాటల్ని తూటాలుగా మల్చుకొని దొరల గుండెల్లో బడబాగ్నిలా రగిలిన తెలంగాణ రైతాంగ విప్లవాగ్ని చాకలి ఐలమ్మ అని అన్నారు. మొక్కవోని సంకల్పంతో రోకలి బండ చేతబూని తనపై దాడికి ప్రయత్నించిన దుండగులను తరిమికొట్టిన ధైర్యశాలి ఐలమ్మ అన్నారు. ఆమె ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ కృషిచేయాలని భాస్కర్ రావు పిలుపునిచ్చారు. తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో స్ఫూర్తినిచ్చి చిరకాలం ప్రజల గుండెల్లో చాకలి ఐలమ్మ నిలిచిపోయారని అన్నారు. ఆమె జీవితం తెలంగాణ సమాజానికి ఆదర్శమని అన్నారు. అణచివేత అధికమైనప్పుడు పోరాటం పురుడుపోసుకుంటుందని నిరూపించిన ఐలమ్మ జీవిత చరిత్ర యువతలో స్ఫూర్తి నింపుతున్నదని భాస్కర్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్ ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహా రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిట్టిబాబు నాయక్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అన్నభీమోజు నాగార్జున చారి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేశ్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బోగవెల్లి వెంకట రమణ చౌదరి(బాబి), తదితరులు పాల్గొన్నారు.