Ultimate magazine theme for WordPress.

జాతీయ సమైక్యత దినోత్సవ పాల్గొన్న కెసిఆర్

Post top

ప్రజాలహరి హైదరాబాద్.

 

 

‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం’ సందర్భంగా పబ్లిక్ గార్డెన్స్ లో పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు.

 

అనంతరం ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు.

 

రైతాంగం కష్టాలు తీరిన పర్వదినంగా నిన్నటి రోజు చరిత్రలో నిలిచిపోతుంది. ఈ పండుగను గ్రామ గ్రామాన పెద్దఎత్తున సంబురాలతో జరుపుకుంటున్నాం. కృష్ణా జలాలలతో ఆయా గ్రామాలలోని దేవతల పాదాలను అభిషేకించి మొక్కులు చెల్లించుకుంటున్నాం.

 

పర్యావరణ అనుమతులతోపాటు అనేక అడ్డంకులను అధిగమించి చేపట్టిన పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కాల్వల పనుల కోసం ఇప్పటికే ఆదేశాలివ్వడం జరిగింది. మిగిలిన పనులను చకచకా పూర్తి చేసుకోబోతున్నాం. దీంతో నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ జిల్లా.. మొత్తం 6 జిల్లాల్లోని 12 లక్షల 30 వేల ఎకరాల భూములకు సాగునీరు, 1226 గ్రామాలకు తాగునీరు అందుతుంది. పాలమూరులో ఇప్పటికే పూర్తి చేసిన కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకాల ద్వారా 10 లక్షల ఎకరాలకు సాగునీరందుతున్నది.

 

మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల పునరుద్ధరణ చేసి నీటి నిల్వ సామర్థ్యాన్ని గణనీయంగా అభివృద్ధి చేసుకున్నాం. రాష్ట్రంలోని వాగులు వంకల మీద పెద్దసంఖ్యలో చెక్ డ్యాములు నిర్మించడంతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. రాష్ట్రంలో సుభిక్షమైన పరిస్థితులు నెలకొన్నాయి.

 

గోదావరి నదిపై నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మిగిలిన పనులు పూర్తిచేసి మొత్తం 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించుకుంటాం. ఖమ్మం జిల్లాలో 36 టీఎంసీల సామర్థ్యంతో నిర్మాణమవుతున్నసీతమ్మ సాగర్ బ్యారేజీ పనులు శరవేగంగా సాగుతున్నాయి.

 

దీని నుండి నీటిని ఎత్తిపోసే సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్త, పాత ఆయకట్టు కలిపి 6 లక్షల ఎకరాలకు సాగునీరందుతుంది. సమ్మక్క సాగర్ బ్యారేజీ నిర్మాణం పూర్తయింది కనుక దేవాదుల ఎత్తిపోతల ద్వారా త్వరలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 5 లక్షల ఎకరాలకు నికరంగా సాగునీరు అందించుకోబోతున్నాం. అంటే రాష్ట్రంలో ప్రధానమైన ఎత్తిపోతల పథకాల ద్వారా 75 లక్షల ఎకరాలకు సాగునీరు లభించనున్నది. ఇతర భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు, చెరువుల ద్వారా మరో 50 లక్షల ఎకరాలకు సమృద్ధిగా సాగునీరు లభిస్తున్నది. రాష్ట్రంలో ఇప్పటికే 85 లక్షల ఎకరాలకు సాగునీరందుతున్నది. రానున్న మూడు నాలుగేళ్లలో మొత్తం 1 కోటి 25 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించాలనే లక్ష్యం నెరవేరుతుంది. తెలంగాణ వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటాయి. తెలంగాణ రైతన్నల లోగిళ్ళుబంగరు పంటలతోతులతూగుతాయి. “ధ్యేయమును బట్టి ప్రతీ పనీ దివ్యమగును” అన్నదానికి బి ఆర్ ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో సాధిస్తున్న అద్భుత ఫలితాలే ఉదాహరణ.

 

వైద్యవిద్యలో నూతన విప్లవం – జిల్లాకో మెడికల్ కాలేజీ

దేశంలోకెల్లా అత్యుత్తమ వైద్యసేవలు అందిస్తున్న అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ గొప్ప ప్రగతిని సాధించింది. పేద ప్రజలకు ఉత్తమమైన వైద్యసేవలు అందించడంలో తెలంగాణ దేశంలోనే మూడోస్థానంలో ఉన్నదని నీతి ఆయోగ్ ప్రశంసించింది. తెలంగాణలో మారుమూల ప్రాంతాలకు సైతం వైద్యవిద్యను చేరువచేస్తూ, వైద్యసేవలను మరింత విస్తృతం చేయాలన్న సదాశయంతో రాష్ట్రంలోని ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీని ఏర్పాటు చేసుకుంటున్నాం.

 

దశాబ్ద కాలంలోనే కొత్తగా 21 వైద్యకళాశాలలను ప్రారంభించి ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో మరో 8 మెడికల్ కాలేజీలను వచ్చే ఏడాది ఏర్పాటు చేసేందుకు ఆమోదముద్ర వేసుకున్నం. దీంతో జిల్లాకో మెడికల్ కాలేజీ అనే లక్ష్యాన్ని ప్రభుత్వం చేరుకోబోతున్నది.

 

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తొలినాళ్లలోనే 2017లో ప్రభుత్వం 4 కాలేజీలు ఏర్పాటు చేసింది. అదే క్రమంలో 2020లో ఒకేసారి 8 మెడికల్ కాలేజీలను మంజూరు చేసుకోగా గతేడాదేవాటిని ప్రారంభించుకున్నం. మొన్న ఒకేరోజున 9 వైద్య కళాశాలలను ప్రారంభించుకున్నాం. దీంతో 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మన రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చాయి. 2014 నాటికున్న ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో కేవలం 850 ఎం.బీ.బీ.ఎస్ సీట్లు మాత్రమే అందుబాటులో ఉండగా, నేడు సీట్ల సంఖ్య 3,915 వరకు పెరిగింది.

 

2014లో ప్రభుత్వ ప్రైవేటు రంగంలో కలిపి మొత్తం 2,850 మెడికల్ సీట్లు మాత్రమే ఉండగా, ఇవాళ మూడింతలు పెరిగిపోయాయి. ప్రతి ఏటా పదివేలమంది డాక్టర్లను తయారు చేసే స్థాయికి తెలంగాణ చేరుకుంటున్నదని తెలియజేయడానికి నేను గర్విస్తున్నాను.

 

రాష్ట్రంలో వైద్యసేవలు మరింత విస్తరించాలని, నిరుపేదలకు కూడా సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పెద్దసంఖ్యలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మిస్తున్నది.

 

వరంగల్ నగరంలో 1,116 కోట్ల రూపాయల వ్యయంతో 2,458 పడకల సామర్థ్యంతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం వేగంగా సాగుతున్నది. హైదరాబాద్ నగరానికి నలువైపులా నాలుగు టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మించుకుంటున్నాం. మరో రెండు వేల పడకలతో నిమ్స్ ఆస్పత్రిని విస్తరించుకుంటున్నాం. నూతన భవనాల పనులకు ఈ మధ్య నేనే స్వయంగా శంకుస్థాపన కూడా చేశాను.

 

వీటికి తోడు బస్తీ దవాఖానాలు, పల్లె దవాఖానాలు, ఉచిత డయాలసిస్ సేవా కేంద్రాలు, ఉచిత డయాగ్నస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేయడంతో రోగులకు మరింతగా వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. రెండు దఫాలుగా నిర్వహించిన కంటివెలుగు కార్యక్రమంలో కోట్లాది మందికి దృష్టి లోపాలను సరిదిద్దగలిగాం. వీటికి తోడు కేసీఆర్ కిట్, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ గర్భిణీలు, బాలింతలకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయి. ప్రభుత్వాసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెరగడంతోపాటు తల్లీ, పిల్లల మరణాల సంఖ్య గణనీయంగా తగ్గించగలిగాం.

 

క్యాన్సర్, ఎయిడ్స్ వంటి ప్రాణాంతక వ్యాధులతో అవసానదశకు చేరిన రోగులకోసం ప్రభుత్వం పాలియేటివ్ కేర్ యూనిట్లను కూడా నిర్వహిస్తున్నది. వారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, చివరిరోజుల్లో రోగులు ప్రశాంత జీవనం గడిపేందుకు ఈ కేంద్రాలు ఎంతగానో దోహదపడుతున్నాయి.

 

108, 104 వాహన సేవలకోసం ఇటీవలే అదనంగా 466 వాహనాలను ప్రారంభించాం. దీంతో ఇప్పుడు ఫోన్ చేసిన 15 నిమిషాలలోపు ఈ వాహనాలు వస్తున్నాయి. సకాలంలో వైద్యసేవలు అందుతుండటంతో ఎన్నో ప్రాణాలను కాపాడుకోగలుగుతున్నాం.

 

డబుల్ బెడ్రూంఇండ్ల పంపిణీ

గత ప్రభుత్వాలు ఇచ్చిన అగ్గిపెట్టెల లాంటి ఇండ్ల స్థానంలో అర్హులైన నిరుపేదలందరికీ దశలవారీగా డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఉచితంగా అందించాలన్నది బిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం. పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా ఈ గృహాల నిర్మాణం కొనసాగిస్తున్నాం. ఇది నిరంతర కొనసాగే ప్రక్రియ.

 

హైదరాబాద్ మహానగరంలో నిర్మాణం పూర్తిచేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న దాదాపు లక్ష గృహాలను పేదలకు పంపిణీ చేస్తున్నాం. పారదర్శకంగా, లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపికచేసి, మహిళల పేరిట ఆ గృహాలను అందచేస్తున్నాం. ఎవరైనా అర్హులకు ఇప్పుడు ఇల్లు రాకపోయినా ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే, ఈ పథకం ఇంతటితో ఆగిపోయేది కాదు. ఇది నిరంతరం కొనసాగుతుంది.

 

సొంతంగా స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే పేదల కోసం ‘‘గృహలక్ష్మి” పథకాన్ని కూడా ప్రారంభించుకున్నాం. ఈ పథకం కింద లబ్ధిదారులకు గృహ నిర్మాణం కోసం మూడు దశల్లో మూడు లక్షల రూపాయల ఆర్థికసాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది. తొలి దఫాలో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో మూడు వేల మందికి ఈ ప్రయోజనం చేకూరుస్తున్నాం.

 

పెరిగిన ఆసరా

ఆసరా పెన్షన్లు మొక్కుబడిగా కాకుండా, కనీస అవసరాలకు సరిపోయేలా ఉండాలన్నదే ప్రభుత్వ అభిప్రాయం. అందుకే, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాశిలోనూ, వాసిలోనూ పెన్షన్లు పెంచింది. గతంలో కేవలం 200 రూపాయలుగా ఉన్న పెన్షన్ మొత్తాన్ని 2,016 రూపాయలకు పెంచుకున్నం. దివ్యాంగులుకు ఇచ్చే పెన్షన్ మొత్తాన్ని ఇటీవలే 3016 నుంచి 4016 రూపాయలకు పెంచుకున్నాం. 2014 నాటికి పెన్షన్ తీసుకునేవారి సంఖ్య 29 లక్షలు మాత్రమే ఉండగా, ఇవాళ 44 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చుకుంటున్నం.

 

వృద్ధులు, వింతంతువులు, దివ్యాంగులతోపాటు, ఒంటరి మహిళలు, పైలేరియా బాధితులు, డయాలసిస్ రోగులు, బీడీ కార్మికులు తదితర అన్నివర్గాలవారికి కూడా ప్రభుత్వం పెన్షన్ సౌకర్యం కల్పించింది. లబ్ధిదారుల వయో పరిమితిని 60 నుంచి 57 ఏండ్లకు తగ్గించింది.

 

బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి

ఆర్థికంగా వెనుకబాటుతనంతో పాటు, సాంఘిక వివక్షకు గురైన బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక పథకాలు రూపొందించింది. దళితుల నుంచి బ్రాహ్మణుల వరకు సమాజంలోని అన్నివర్గాల పేదలకూ సంక్షేమ ఫలాలు అందజేస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ. స్వతంత్ర భారతదేశంలో దళిత జాతి నేటికీ అంతులేని వివక్షకు గురవుతూనే ఉంది. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ కృషి ఫలితంగా దళితుల జీవితాలలో కొంతమేరకు మేలు జరిగినా, ఆ తర్వాత ప్రయత్నాలు ఆశించినంతగా ముందుకు సాగలేదు. దాంతో దళితుల బతుకులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మిగిలిపోయాయి.

 

అణగారిన దళితజాతి సమగ్ర అభ్యుదయం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన విప్లవాత్మక పథకం “తెలంగాణ దళితబంధు”. దళిత కుటుంబం తమకు వచ్చిన, తమకు నచ్చిన వృత్తి కానీ, వ్యాపారం కానీ చేపట్టడానికి వీలుగా ఈపథకం కింద ఒక్కో దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల భారీ ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తున్నది.

 

ఇది ఒక నూతన చరిత్ర. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇటువంటి పథకం కాగడా వేసి వెదికినా కనపడదు. దళితులు వ్యాపార రంగంలో కూడా ఎదగాలన్న సంకల్పంతో ప్రభుత్వ లైసెన్సుల ద్వారా చేసుకొనే లాభదాయక వ్యాపారాలలో వారికి పదిహేను శాతం రిజర్వేషన్లు కూడా కల్పించుకున్నం.

 

షెడ్యూల్డ్ కులాలు, షెల్యూల్డ్ తెగల అభివృద్ధే లక్ష్యంగా ప్రత్యేక ప్రగతి నిధి చట్టాన్ని అమలు పరుచుకుంటున్నాం. ఎస్సీ, ఎస్టీల జనాభా దామాషాను అనుసరించి వారి అభివృద్ధికి నిధులు కేటాయించుకుంటున్నాం. బలహీన వర్గాలలోని వృత్తిపనుల వారికి, మైనారిటీ వర్గాలకు కుటుంబానికి ఒక లక్ష రూపాయల వంతున ప్రభుత్వం గ్రాంటు రూపంలో ఆర్థిక సహాయం అందిస్తున్నది.

 

వృత్తి పనులపై ఆధారపడి జీవిస్తున్న బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి, గ్రామీణ ఆర్థికవ్యవస్థ బలోపేతానికి అనేక ప్రోత్సాహకాలు కల్పిస్తున్నది. గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నవారికి గొర్రెల పంపిణీ,మత్స్యకారుల కోసం చేపల పెంపకం, నేత కార్మికులకు సబ్సిడీపై నూలు, రంగుల సరఫరా, వారికి పైసా భారం లేకుండా 5 లక్షల రూపాయల బీమా, మద్యం దుకాణాలలో గౌడ సోదరులకు 15 శాతం రిజర్వేషన్, ఈత, తాటి చెట్లపై పన్నురద్దు, 5 లక్షల వరకూ బీమా సౌకర్యం వంటి ఎన్నోకార్యక్రమాలు ప్రభుత్వం అమలు చేస్తున్నది. రజకులకు, నాయీ బ్రాహ్మణులకు కూడా విద్యుత్ రాయితీ, ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహిస్తున్నది.

 

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలవేళ రాష్ట్ర ప్రభుత్వం అడవిబిడ్డలకు తీపికబురు అందించింది. ఆదివాసీలు, గిరిజనుల దశాబ్దాల కలను నెరవేరుస్తూ, పోడు భూములకు పట్టాలందించింది. గిరిజన ఆరాధ్య నాయకుడు, జల్ జంగల్ జమీన్ నినాదమిచ్చిన కొమ్రం భీమ్ పేరుతో ఏర్పాటయిన అసిఫాబాద్ జిల్లా నుంచే ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారంచుట్టింది. ఆదివాసీ, గిరిజనులకిచ్చిన పోడుభూములకు రైతుబంధు కూడా అందజేస్తున్నది. పోడు భూముల కోసం జరిపిన పోరాటంలో అమాయక గిరిజనులపై ఉన్న కేసులను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది.

 

ఐటి రంగం ప్రగతి

తెలంగాణలో ఐ.టి రంగం దినదినాభివృద్ధి సాధిస్తున్నది. రోజుకో కొత్త సంస్థ మనరాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నది.

 

ఇవాళ ఐ.టి. రంగంలో తెలంగాణ దేశంలోనే మేటిగా ఎదిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్రంలో 3 లక్షల 23 వేల 39 మంది ఐటీ ఉద్యోగులు మాత్రమే ఉండగా, నేడు వారి సంఖ్య 9 లక్షల 5 వేల 715 మందికి పెరిగింది. 2014లో ఐ.టి ఎగుమతులు 57 వేల 258 కోట్ల రూపాయలు కాగా, నేడది 2లక్షల 41 వేల 275 కోట్లకు పెరిగింది. ద్వితీయ శ్రేణి నగరాలైన ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్, సిద్ధిపేట వంటి ప్రాంతాలకు కూడా ఐటీని విస్తరించుకొని, ఐ.టి టవర్లు నిర్మించుకున్నాం.

 

మన పల్లెలకు అత్యధిక జాతీయ అవార్డులు

పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో మన పల్లెలు, పట్టణాల రూపురేఖలే మారిపోయాయి. చక్కటి వసతులు సమకూరి, పచ్చదనంతో పరిఢవిల్లుతున్నాయి. ఇటీవల రాష్ట్రపతి చేతులు మీదుగా మన స్థానిక సంస్థల ప్రతినిధులు 13 జాతీయ అవార్డులు అందుకోవడం మనందరికీ గర్వకారణం.

 

పాలనా సౌకర్యం కోసం కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, కొత్త పంచాయతీలు, అవసరాన్నిబట్టి కొత్త మండలాలు కూడా ఏర్పాటు చేసుకున్నాం. ప్రతిజిల్లా ప్రధాన కేంద్రంలో జిల్లా సమీకృత కార్యాలయాలు, జిల్లా పోలీసు కార్యాలయ భవనాలు నిర్మించుకుంటున్నాం. దీంతో ప్రభుత్వ పాలన ప్రజలకు దగ్గరైంది.

 

విశ్వనగరంగా హైదరాబాద్

హైదరాబాద్ నగరం ఓ మినీ ఇండియా. ఇక్కడ అన్ని రాష్ట్రాలు, అన్ని మతాలకు చెందిన ప్రజలు సోదర భావంతో కలసిమెలసి బతుకుతున్నారు. హైదరాబాద్ విశ్వనగరంగా ఎదగాలన్న లక్ష్యానికి అనుగుణంగా గట్టి పునాదులు వేశాం. గతంలోలాగా మత కల్లోలాలు, గొడవలు లేకుండా ఇవాళ హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉంది.

 

పారదర్శక పరిపాలన నిరంతర విద్యుత్తూ వంటి కారణాలతోఅనేక అంతర్జాతీయ కంపెనీలుమనరాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి క్యూ కడుతున్నాయి.

 

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని నివారించి, సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చేందుకు 67 వేల కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పనులను చేపట్టి, పూర్తిచేస్తున్నాం. ఈ ఎస్సార్డీపీ పనులతో నగరంలో అద్భుతమైన రోడ్డు రవాణా సౌకర్యాలు అభివృద్ధి చేసుకుంటున్నాం. ఇప్పటికే 20 ఫ్లైఓవర్లు పూర్తిచేసి ప్రారంభించుకున్నాం. అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటిదాకా 36 పనులు పూర్తి చేశాం. హైదరాబాద్ నడిబొడ్డున, హుస్సేన్ సాగర్ నదీ తీరంలో నూతనంగా నిర్మించిన సచివాలయ సౌధం, అమరవీరుల స్థూపం, 125 అడుగుల ఎత్తులో నిర్మించిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం నగరానికి మరింత శోభను చేకూర్చాయి. హైదరాబాద్ నగరం నలువైపులా 69వేల కోట్ల రూపాయల వ్యయంతో మెట్రో రైలును విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో హైదరాబాద్ లో మొత్తం 415 కిలోమీటర్ల మెట్రో సౌకర్యం విస్తరించనున్నది. విశ్వనగరంగా మరింత అభివృద్ధి చెందనున్నది.

 

సంతోషాల సాగుబడి

కాళేశ్వరం వంటి భారీ ఎత్తిపోతల ప్రాజెక్టుతో పాటు, మిషన్ కాకతీయ, పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణం, ఇతర మధ్యతరహా, చిన్న ప్రాజెక్టుల పూర్తి తదితర పనులతో తెలంగాణ సాగునీటిరంగం స్వర్ణయుగాన్ని తలపిస్తున్నది. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, సకాలంలో విత్తనాలు, ఎరువుల సరఫరా, పెట్టుబడి కోసం రైతుబంధు, రైతుబీమా, 37వేల కోట్ల రూపాయల వరకూ పంటరుణాల మాఫీ తదితర సంక్షేమ చర్యలు రైతన్నకు ఊరటనిచ్చాయి.

 

వ్యవసాయం పండుగగా మారింది. సాగుబడిలో, దిగుబడిలో తెలంగాణ రైతన్నలు చరిత్ర తిరగరాస్తున్నారు. ధాన్యం దిగుబడి 3 కోట్ల టన్నులకు చేరుకున్నది. వరి ఉత్పత్తిలో పంజాబు రాష్ట్రాన్ని తలదన్ని దేశంలోనే ప్రథమ స్థానంవైపు తెలంగాణ పరుగులు పెడుతున్నది.

 

తెలంగాణ రాష్ట్రం శాశ్వతంగా సంపూర్ణంగా సుజల సుఫల సుసంపన్న వ్యవసాయ రాష్ట్రంగా విలసిల్లేందుకు గానూ కాళేశ్వరం, సీతారామ, పాలమూరు ఎత్తిపోతల పథకాల్లోని మిగిలిన పనులను వెనువెంటనే పూర్తిచేసే కృషిలో పూర్తిగా నిమగ్నమై ఉంది బి ఆర్ ఎస్ ప్రభుత్వం.

 

అన్నింటా నంబర్ వన్ తెలంగాణ

నేడు తెలంగాణ అనేక రంగాలలో నంబర్ వన్ స్థానంలో నిలవడం మనందరికీ గర్వకారణం. అనతి కాలంలోనే విద్యుత్ రంగ సంక్షోభాన్ని అధిగమించి, అన్ని రంగాలకూ 24 గంటల పాటు, వ్యవసాయానికి పూర్తి ఉచితంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమే. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్ వన్. 3 లక్షల 12 వేల 398 రూపాయల తలసరి ఆదాయంతో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్. ఇవాళ మిషన్ భగీరథతో నూటికి నూరుశాతం ఇండ్లకూ ఉచితంగా నల్లాలు బిగించి, స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీరుని సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమే.

 

దేశంలో ఏనాడో స్థిరపడిన పెద్దపెద్ద రాష్ట్రాలను తలదన్నేలా అతి పిన్నవయసు ఉన్న తెలంగాణ ప్రగతి రథచక్రాలు మునుముందుకు దూసుకుపోతున్నాయి. ఇప్పుడు దేశంలో ఏ ప్రాంతంలోనైనా, ఎవరి నోట విన్నా తెలంగాణ మోడల్ మార్మోగుతున్నది. తెలంగాణ ప్రజలందరి చల్లని దీవెనలతో ఈ ప్రగతి రథచక్రాలు మరింత జోరుగా ముందుకు సాగుతూనే ఉంటాయి. దీనికి అడ్డుపడాలని ప్రయత్నించే ప్రగతి నిరోధక శక్తులు పరాజయం పాలుకాక తప్పదు. మన సమైక్యతే మనకు బలం. ఈ జాతీయ సమైక్యతా దినోత్సవ వేళ బంగారు తెలంగాణ సాధనకు ఒక్కటిగా కృషి చేద్దాం. తెలంగాణ ప్రగతిని ఇదేవిధంగా కొనసాగిద్దాం..

 

post bottom

Leave A Reply

Your email address will not be published.