ఎవరి కోసం మౌనం వహిస్తున్నారని బీజేపీ నేతలను నిలదీయాలి..? : సీఎం కేసీఆర్ …పాలమూరు ప్రజాలహరి….
ఎవరి కోసం పాలమూరు బీజేపీ నేతలు మౌనం వహిస్తున్నారో నిలదీయాలని ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. సింగోటం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ బీజేపీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నీళ్లు వచ్చేది పాలమూరు, రంగారెడ్డి జిల్లాకు. ఒక పక్కన బీఆర్‌ఎస్ గవర్నమెంట్ పోరాటం చేస్తే.. మీరు ఎవరి కోసం మౌనం పాటిస్తున్నారని బీజేపీ నేతలను నిలదీయాలి. ప్రజాస్వామ్యంలో నిలదీసే హక్కు ఉంటుంది. 70 ఏళ్ల గోస కద. కండ్లల్లో రక్తం వచ్చేది. పాలమూరులో గంజి కేంద్రాలు పెడుతారా? ముఖ్యమంత్రి దత్తత తీసుకున్నా విముక్తి రాదా? ఎన్నడూ ఆలోచన రాలేదు. తెలంగాణలో వచ్చాక రిజర్వాయర్లు ఎక్కడ కట్టాలని ఆలోచన చేశాం. గుట్టల మధ్య కట్టాలని నిర్ణయించాం. ఇవాళ పంపులు, రిజర్వాయర్లు పూర్తయ్యాయి. కాలువలు తవ్వాలి ఉంది. ఇంత దెబ్బ పాలమూరు అడ్డం తగిలితే.. ఈ జిల్లాలో ఉన్న నాయకులే కేసులు వేస్తే.. పెండింగ్ పెట్టి.. దక్షిణ భాగంలో ఉన్న నెట్టంపాడు, జూరాల, బీయా, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసుకున్నాం. పాలమూరు రంగారెడ్డి ఎట్టకేలకు పూర్తి చేసుకున్నాం. భగవంతుడి దయతో విజయం సాధించాం. ఆంధ్రా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీ నీళ్లు మాకు అవసరం లేదు. మా వాటా మాకు చెబితే.. దాని ప్రకారం తీసుకొని బతుకుతం తప్పా.. మరొకటి లేదు. బీజేపీ నాయకులు సిగ్గుంటే.. ప్రధానమంత్రి వద్దకు పోయి కృష్ణా వాటా తేల్చాలని పోరాటం చేయాల్సింది పోయి.. కేసీఆర్‌కు అడ్డం వచ్చి జెండాలు పట్టుకొని వస్తారా? నా వెంట లక్షల మంది ఉన్నరు. మీరు ఊదేస్తే నశం లెక్కపోతరు. మనకు సంస్కరం, పద్ధతి, ఓపిక ఉంది. పనులు చేసుకుంటున్నాం. ఆకలితో ఉన్నం. వలసలు పోయినోళ్లం. ఆగమైనోళ్లం కాబట్టి.. ఇప్పుడిప్పుడే మొఖాలు తెల్లబడుతున్నయ్. రైతుబంధు, బీమా పెట్టుకున్నాం. 24 గంటల ఉచిత కరెంటు పెట్టుకున్నాం. సామాన్యులకు పెన్షన్లు పెంచుకుంటున్నాం. మొదట యుద్ధం చేసింది కరెంటు, నీళ్ల మీద. విజయం సాధించాం. అద్భుతంగా నల్లగొండ జిల్లాలో వచ్చే 4మెగావాట్ల పవర్ వస్తే సర్‌ప్లస్ స్టేట్ అవుతుంది. మనకు కరెంటు కొరత ఉండదు. దాని తర్వాత మంచినీళ్లపై యుద్ధం చేశాం. మిషన్ భగీరథ ద్వారా శ్రీశైలం నుంచి నీటిని తీసుకొని బ్రహ్మాండంగా హైదరాబాద్ నగరంతో పాటు యావత్ రాష్ట్రంలో గిరిజనులు, ఆదివాసులు ఉండే గూడెలు, తండాల్లో కూడా ప్రతి ఇంటికి నల్లాలు పెట్టి నీరు ఇస్తున్నాం. ఇది భారత్‌లో ఎక్కడా లేదు. ఇవాళ తలమాసినోడు, తలకాయ లేనోడు పైత్యపు మాటలు మాట్లడుతరు వారిని పట్టించుకోనవసరం లేదు. ఒక్కటే మనవి చేస్తున్నా. నా మాటలను విశ్వసించారు. నన్ను ఆశీర్వదించారు. ఎంపీగా నిలబడితే గెలిపించారు. ప్రాణాలను అడ్డం పెట్టి.. చావునోట్లో తలబెట్టి నిరాహార దీక్ష చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తర్వాత కరెంటు, మంచినీళ్లు సమస్యలు పరిష్కరించుకుంటూ పేదలు, వృద్ధులను కాపాడుకుంటున్నాం’ అని సీఎం కేసీఆర్ అన్నారు.