అంగన్వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి
* ప్రారంభమైన అంగన్వాడీల సమ్మె
* మద్దతు తెలిపిన సిఐటియు, ఏఐటియుసి, కాంగ్రెస్
. ప్రజాలహరి మిర్యాలగూడ
అంగన్వాడీ ఉద్యోగులను పర్మినట్టు చేయాలని వారి సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం నిరవధిక సమ్మె ప్రారంభించారు. స్థానిక ఆర్డిఓ కార్యాలయం ఎదుట వందలాది మంది అంగన్వాడీ సిబ్బంది ధర్నా చేశారు. వీరి సమ్మెకు సిఐటియు, ఏఐటీయూసీ జేఏసీ కాంగ్రెస్ నాయకులు సంఘీభావంగా మద్దతు తెలిపారు. ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని, సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డబ్బికార్ మల్లేష్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి లు మాట్లాడుతూ అంగన్వాడి సిబ్బందితో ప్రభుత్వం వెట్టి చాకిరి చేయించుకుంటుందని ఆరోపించారు. వీరిచే ఇతర పనులు కూడా చేయించుకుంటూ శ్రమను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. రికార్డుల నిర్వహణ పేరిట అధికారులు వేధింపులు గురి చేస్తున్నారని, కొత్త యాప్ లు తీసుకొచ్చి మానసికంగా ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీలకు కనీస వసతులు కరువయ్యాయని పేర్కొన్నారు. పనికి తగ్గ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పిఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని, గతంలో మంత్రి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని కోరారు. అదనపు పనులను రద్దు చేయాలని, అంగన్వాడీల పై ప్రజాప్రతినిధుల పెత్తనాన్ని నివారించాలని కోరారు. పెండింగ్ లో ఉన్న టిఎ, డిఎ ఇతర అలవెన్స్ ను వెంటనే విడుదల చేయాలన్నారు. సకాలంలో జీతాలు, అద్దె, కూరగాయలు, గ్యాస్ బిల్లులు ఇవ్వాలన్నారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారం అయ్యేంతవరకు అంగన్వాడీ సిబ్బంది చేసే సమ్మెకు పూర్తిగా మద్దతుగా ఉంటామని చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి, జిల్లా నాయకులు తిరుపతి రామ్మూర్తి, దయానంద్, ఏఐటియూసి ప్రాంతీయ కార్యదర్శి ఎండి సయీద్, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు బొందు పార్వతి, నిర్మల, అరుణ, మల్లీశ్వరి, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.