ఈ నెల 16వ తేదీన నిర్వహించే పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సచివాలయంలో మంత్రులు కేటీఆర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వివిధ శాఖల అధిపతులు, కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఒకనాడు వలసలతో పడావుపడ్డ పాలమూరు జిల్లాను పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పచ్చగా చేస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఏటా లక్షల మంది పాలమూరు ప్రజలు వలస పోయే పరిస్థితి ఉండేది. కానీ నేడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే స్థాయి ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేసుకోబోతున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా పాలమూరుతో పాటు రంగారెడ్డి జిల్లా భూములకు సైతం నీళ్లు అందిస్తామన్నారు.
పాలమూరు ఎత్తిపోతల పథకం అనేక అడ్డంకులను దాటుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలతో పూర్తయిన ప్రాజెక్టు అని మంత్రి తెలిపారు. రైతుల పొలాలకు సాగునీటితో పాటు, రాజధాని ప్రజల తాగునీటి అవసరాలు, పరిశ్రమలకు అవసరమైన నీటి సరఫరాను కూడా ఈ ప్రాజెక్టు అందిస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం తెలంగాణ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. ఇంత గొప్ప సందర్భాన్ని గొప్పగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రాజెక్టు యొక్క విశిష్టతను ప్రజలకు తెలియజేసేలా గొప్పగా సంబరాలు చేసుకోవాలని సూచించారు.