ఆధార్ అప్‌డేట్ గడువు పొడిగించిన UIDAI.. అప్పటి వరకు ఉచితమే..!
ప్రజాలహరి , జనరల్ డెస్క్……
Aadhar Update | యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఆధార్‌ను ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు గడువును మరో మూడు నెలలు పాటు పొడిగించింది. ప్రస్తుతం గడువు సెప్టెంబర్ 14తో ముగియనున్న నేపథ్యంలో డిసెంబర్ 14 వరకు ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఆధార్ యూజర్ల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు డిసెంబర్ 14 వరకు పొడిగించాలని నిర్ణయించినట్లు పేర్కొంది. సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది ఆధార్‌కార్డును అప్‌డేట్ చేసుకునేలా ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.
మై ఆధార్ పోర్టల్ ద్వారా ఉచితంగా ఆధార్ డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పింది. ఇదిలా ఉండగా.. ఆధార్ జారీ పదేళ్లు దాటిన వారి వివరాలను మళ్లీ అప్‌డేట్ ప్రక్రియను యూఐడీఏఐ ప్రారంభించింది. అడ్రస్, వ్యక్తిగత వివరాలు మార్చుకోవాలనునేవారు అందుకు సంబంధించిన ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. సాధారణంగా ఈ వివరాలను అప్డేట్ చేసుకోవాలంటే ఆధార్ కేంద్రాలకు వెళ్లి రూ.50 వరకు చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబర్ 14 వరకు డబ్బులు చెల్లించాల్సిన పని లేదు. myaadhaar.uidai.gov.in వెబ్‌సైట్‌లోనూ ఉచితంగానే ఆధార్ వివరాలు అప్‌డేట్ చేసుకోవచ్చు