Ultimate magazine theme for WordPress.

సప్త ద్వారాలు .,మోక్షమార్గం

Post top
home side top

ప్రజాలహరి మిర్యాలగూడ ..సప్త ద్వారాలు అంతా చీకటి మొదటి ద్వారం ఆవల ఒక సుందర రూపం.నీలి మేఘ వర్ణం కలిగిన వాడు,కలువ పూల నయనాలు కలిగిన వాడు,విశ్వం, అంతా తానైనవాడు,అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు,వెలుగంతా తనదిగా చేసుకొని కొలువైన ఒక సాక్షాత్కారం.దర్శనం కోసం ఎదురు చూసే భక్తుల కళ్ళల్లోకి ప్రసరించే భానుడి కిరణాలు,ఆయన దీవెనలు. క్షణం సేపే వీక్షణ..ఆ క్షణం కోసం గంటల కొద్దీ వ్యయ ప్రయాసలు.వందల కిలోమీటర్ల ప్రయాణాలు,కాలి నడక మొక్కులు, కొందరికి ఆరోగ్య సమస్యలు మరి కొందరికి ఆర్థిక సమస్యలు, ఇంకొందరికి సామాజిక సమస్యలు అన్ని సమస్యలకు,అందరి మస్తిష్కాలను తొలిచే ఆలోచనలకు, మరెన్నో మానసిక సంఘర్షణకు

రుగ్మతలకు అన్నింటికీ సమాధానం ఆయన దర్శనం.

ఆయననే తిరుమల వేంకటేశ్వర స్వామి.ఆయన కరుణ కటాక్షాల కోసం అన్ని గంటలూ క్యూలో నడుచుకుంటూ, తోసుకుంటూ వెళుతుంటే భక్తుడు,అలసిపోనూ వచ్చు,కాళ్ళు భారమై

నడక మోరాయించనూ వచ్చూ, అయినా పట్టువదలక తన ఇష్ట దేవుడిని, తమ ఇలవేల్పునీ తనివితీరా

కళ్ళతో వీక్షించి,మనసు హాయితో,శరీరం తేలికై

అప్పటి దాకా మస్తిష్కాన్ని తొలిచే ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి.జై శ్రీమన్నారాయణ అంటూ కొందరు,గోవింద గోవిందా

అంటూ హరి నామస్మరణ చేస్తూ,విసుకొచ్చినా విసుక్కోకుండా,దర్శనానికి ఆలస్యం అయి కోపతాపాలు వచ్చినా ఆ ప్రాంగణంలో ఉన్న దైవిక శక్తులు, అక్కడి గాలి నీ ఊపిరిని,నీ ఓపికను పరిక్షీస్తున్నా,గంట, రెండు, మూడు గంటలు, ఆరు గంటలు, చివరికి ధర్మ దర్శనం పదిహేను గంటలు అయినా నీలో ఉత్సాహం తగ్గదు.శరీరం ఈ పరీక్షలకు తట్టుకోక పోయినా, పాదాలు,అడుగు తీసి అడుగు పెట్టలేకపోయినా.. అయినా నీ ప్రయాణం ఆగదు.నీ భక్తి పారవశ్యం నిలువనీయదు.స్వామి వారిని దర్శనం

చేసుకున్న ఆ ఒక్క క్షణంలో ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఏ సమస్య కైనా పరిష్కారం తడుతుంది.ఆ దివ్య మూర్తిలో ఏదో తెలియని శక్తి ఉంది, తేజస్సు ఉంది.ఆ వర్చస్సులో ఏదో మహిమ ఉంది.నాకైతే ఆ ఒక్క క్షణం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.నన్ను దహించి వేసే అన్ని ప్రశ్నలకు

ఒక దారి ఏర్పడింది.చిక్కుముడులు వీడి పరిష్కారాలు

కళ్ళ ముందే తచ్చాడుతున్నట్లు అనిపించింది..అది యాదృచ్ఛికమో లేక ఆ శ్రీహరిని చూసిన ఆనందంలో

కలిగిన మానసిక పరిస్థితిలో మార్పో నాకర్ధం కాలేదు.

కానీ ఒకటి మాత్రం చెప్పాలి, ఆజానుబాహుడైన ఆ నిలువెత్తు స్వ‌‌‌రూపానికి రెండు చేతులు అప్రయత్నంగా జోడించి, సంభ్రమాశ్చర్యాలతో నమస్కరిస్తాం.ఏదో తెలియని తృప్తితో బయటకు వస్తాం,ఇదీ వాస్తవం.

ముందు రోజు మొత్తం ప్రయాణపు బడలిక ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచి శ్రీకాళహస్తిలో రాహువు కేతువుల పూజలు,దర్శనం అన్నీ పూర్తయ్యాక తిరుపతి చేరుకునేసరికి మధ్యాహ్నం మూడు గంటలు అయ్యింది.అక్కడి నుంచి కొండ మీదకు అంటే తిరుమలకు బస్సులో ప్రయాణం అయ్యాం.బస్సు తిరుపతి బస్టాండ్ నుంచి అలిపిరి చెకింగ్ ప్లేస్ దగ్గర ఆగింది.అందరూ దిగండి,మీమీ లగేజీలతో,అంటూ అక్కడ మీ లగేజీలను చెక్ చేస్తారు, చెకింగ్ అయిపోయాకా అలాగే కాస్తా ముందుకు వస్తే

బస్సు ఆగి ఉంటుందని కేకేసాడు.అక్కడో కిలోమీటర్

లైను.అక్కడ మనుషులతో పాటు మా లగేజీనీ కూడా

చెక్ చేసి పంపించారు.మా బస్సు ఎక్కడో ఆగింది.దాన్ని

వెతుక్కుంటూ వెళ్లి అందులో కూర్చున్నాం.కానీ కింద తిరుపతి నుంచి కొండ మీద తిరుమల వెళ్లే దారంతా

అద్బుతం.ఆ ఇరవై అయిదు కిలోమీటర్ల ఘాట్ రోడ్డు

వంకలు తిరిగి,ఉండడమే కాకుండా, పైనుంచి కిందకు చూస్తే అందమైన తిరుపతి టౌను.చుట్టూ కొండల మధ్యలో పొగ మంచు.చూస్తూ అలాగే ఉండి పోవాలనిపించే దృశ్యాలు.ఆ ప్రదేశం అంతా ఏదో మహత్తు కలిగి మన ఆలోచనలను ప్రభావితం చేస్తుంది.ఈ మధ్యలో బస్ డ్రైవర్ తో సంభాషణలు అనేకం జరిగాయి,ఆయన తన సాదక బాధలు అన్నీ ఏకరువు పెట్టాడు.అది రాస్తే, మీకు బోర్ కొడుతుంది.

కొండ మీదకు సాయంత్రం అయిదింటికి చేరాం.అక్కడ మా కోసం హంపి మఠంలో,ఆల్రెడీ బుక్ చేసిన రూంలో దిగాం.ఇక్కడ ఒక వ్యక్తి గురించి చెప్పకపోతే నా ప్రయాణానికి అర్థమే లేదు.ఆయనే ప్రొద్దుటూరుకు చెందిన ప్రముఖ కవి, రచయిత, అనువాదకులు సీవీ సురేష్ గారు.మా ప్రయాణం గురించి ముందే చెప్పడం వల్ల ఆయన అన్ని ఏర్పాట్లు చేసారు.ఈ ప్రయాణం అంతా ఆయన చేసిన సహాయం నభూతో నభవిష్యతి అన్నట్లుగా ఉంది.ఆయనకు ఎన్ని సార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అవుతుంది.మనం ఎక్కే రైలు ఒక జీవితకాలం లేటు అన్న నానుడి ప్రకారం మేము ఎక్కిన రైలు మూడు గంటలు ఆలస్యం.

ఇక చేసేది లేక రెండు గంటల ముందు వచ్చిన

శ్రీకాళహస్తిలో దిగాం.అందులో కూడా మా స్వార్థం ఉంది,మరుసటి రోజు సోమవారం,నాగుల పంచమి అనీ.సరే మా ప్రోగ్రాంలో మార్పుల విషయం సురేష్ గారి

బావగారు బాబు గారికి తెలియజేశాం.మరేం పర్వాలేదండీ, మీరు శ్రీకాళహస్తిలో దిగాక మీకో నెంబర్ పంపిస్తున్నాను, ఆయనకు ఫోన్ చేయండి అని ధైర్యం

ఇచ్చారు.ఆ నెంబర్ దేవాదాయ శాఖకు చెందిన అసిస్టెంట్ కమిషనర్ ది.ఆయనకు ఫోన్ చేసాను. ఆయన వెంటనే స్పందించి, మీరు రిసెప్షన్ దగ్గరకు వెళ్ళి నాకు ఫోన్ చేయండి అంటూ చెప్పారు.ఆయన చెప్పినట్లే చేసాం.ఏసీ రూం ఇచ్చాడు,కానీ గర్బ గుడి నుంచి చాలా దూరంగా ఉన్న కాటేజీలో.తెల్లవారితే సోమవారం వేల మంది భక్తులు రాహు కేతువుల పూజల నిమిత్తం వస్తుంటారు.అలాంటి టైం లో కొంచెం దూరమైనా,ఇప్పిచ్చిన బాబు గారికి మనసులోనే నమస్కారాలు తెలుపుకున్నాను.తెల్లారి ఉదయం ఆరు గంటలకు గుడికి వెళ్ళేందుకు తలస్థానం చేసి సిద్దమయ్యాం.సరిగ్గా ఏడు గంటలకు బాబుగారి ఫోన్

మీరు రడీ అయ్యారా అని, నిజంగా ఆయన కన్సర్న్

చూస్తుంటే ఆశ్చర్యం వేసింది.రడీ అయ్యాం సార్ అని చెప్పా,ఓకే అంటూ ఫోన్ పెట్టేసాడు.ఆ వెంటనే కమీషనర్ గారి ఫోన్, మీరు పీఆర్ఓ ఆఫీసుకు వెళ్ళి ఫోన్ కలిపి ఇవ్వండి అన్నారు, పీఆర్ఓ ఆఫీసులో వాసు అనే అతడితో ఫోన్ మాట్లాడించాను.ఇక అంతే

ఆ వాసు అనే అతను మాకు రాహు కేతువుల పూజ టికెట్లు తీసుకొని వచ్చి మమ్మల్ని ఆ పూజా మందిరంలో దింపి,పూజ అయ్యాక మీకు దర్శనానికి

ఏర్పాట్లు చేస్తాననీ చేప్పి తన ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళాడు…..

కొంచెం లెంత్ ఎక్కువైనట్లుంది… మిగతాది రేపు రాస్తాను… ఏమంటారు.

ప్రమోద్ ఆవంచ

7013272452

post bottom

Leave A Reply

Your email address will not be published.