ప్రజాలహరి..
తెలంగాణ రాష్ట్రం శుక్రవారం మరో చారిత్రక ఘట్టానికి వేదికగా నిలిచింది. దేశ పరిపాలనా చరిత్రలోనే మున్నెన్నడూ లేనివిధంగా మత సామరస్య లౌకికవాద స్ఫూర్తి ఫరిఢవిల్లింది.
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దార్శనిక పాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచే విధంగా నిజ సెక్యులరిజమ్ అంటే ఏమిటో రుజువు చేసింది.
డా.బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం వేదికగా రాష్ట్ర గవర్నర్ డాక్టర్ సౌందర్య తమిళసై ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా హిందూ, క్రైస్తవ, ముస్లిం మతాలకు చెందిన మూడు ప్రార్థనా మందిరాలు ఒకే రోజు వరుసగా ఆవిష్కృతమయ్యాయి.
ఇప్పటికే ప్రారంభమైన సచివాలయంలో ఉద్యోగుల ఆధ్యాత్మిక అవసరాల కోసం వారి వారి మత సాంప్రదాయల ప్రకారం పున:ప్రతిష్ట చేసుకున్న హిందూ నల్ల పోచమ్మ దేవాలయం, క్రైస్తవ చర్చి, ఇస్లాం మతస్థులకు మసీదు లను శుక్రవారం సీఎం కేసీఆర్ ఘనంగా ప్రారంభించారు.
నల్ల పోచమ్మ గుడి ప్రారంభం:
తొలుత, నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధమైన సెక్రటేరియట్ శ్రీ నల్లపోచమ్మ దేవాలయానికి ముఖ్యమంత్రి చేరుకున్నారు. గవర్నర్ రాక కోసం వేచి చూసి వారు రాగానే సాంప్రదాయ పద్ధతిలో మేళ తాళాలతో ఆహ్వానం పలికారు. గవర్నర్ ను ఆహ్వానించిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, సీఎస్, ఉన్నతాధికారులు, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.
అప్పటికే కొనసాగుతున్న పూజా కార్యక్రమాల్లో సీఎం, గవర్నర్ గారు లు పాల్గొన్నారు. చండీయాగం, పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం శ్రీ నల్లపోచమ్మ ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో వారు పాల్గొన్నారు. అదే సందర్భంలో ఆలయ ప్రాంగణంలలోని అనుబంధంగా ఉన్న శివాలయం, ఆంజనేయ స్వామి మందిరాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నూతన చర్చి ప్రారభోత్సవం
దేవాలయంలో శాస్త్రోక్తంగా జరిగిన విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న అనంతరం సీఎం కేసీఆర్ , గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తో కలిసి నూతనంగా నిర్మించిన చర్చి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైనార్టీ వ్యవహారాల శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్, ఇతర ప్రజాప్రతినిధులు సీఎం, గవర్నర్ లకు స్వాగతం పలికారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రిబ్బన్ కట్ చేసి సీఎం కేసీఆర్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి చర్చిలోకి అడుగుపెట్టారు. బిషప్ ఎమ్ఎ డానియేల్ బైబిల్ పఠనం అనంతరం సీఎం కేసీఆర్ సమక్షంలో గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ కేట్ కట్ చేసి ఎమ్ఎ డానియేల్ కు, సీఎం కు అందించారు. ఈ సందర్భంగా తెలంగాణ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పోరేషన్ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు, తెలంగాణ స్టేట్ క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్ ఎండి ఎ. కాంతి వెస్లీ గవర్నర్, సీఎం కేసీఆర్ కు మెమెంటోను అందించారు. తెలంగాణ మైనార్టీ కమిషన్ వైస్ ఛైర్మన్ శంకర్ లూక్ బైబిల్ ను అందించారు. అనంతరం సీఎస్ఐ బిషప్ కె.పద్మారావు, బిషప్ జాన్ గొల్లపల్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సెక్రటేరియట్ క్రిస్టియన్ అసోసియేషన్ ఎంప్లాయిస్ సభ్యులు రవి, లాల్ బహదూర్ శాస్త్రి, చిట్టిబాబు, స్వర్ణరాజు, మనోహరమ్మ, ప్రేమలీల, జేకబ్ రాస్ భూంపాగ్ తదితరులు గవర్నర్, సీఎం కేసీఆర్ లకు పుష్పగుచ్చాలను అందించి, శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పరిధిలోని పలు చర్చిలకు చెందిన బిషప్ లు, పాస్టర్ లు, ఎవాంజలిస్టులు తదితరులు హాజరయ్యారు. పిజెడి కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక గీతాలు ఆలపించారు.
సర్వమత సౌభ్రాతృత్వం పరిఢవిల్లే విధంగా దేశంలోని ఏ రాష్ట్ర సెక్రటేరియట్ లో లేని విధంగా తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్ లో చర్చి నిర్మించడం పట్ల బిషప్ లు, పాస్టర్ లు, సెక్రటేరియట్ క్రిస్టియన్ అసోసియేషన్ ఎంప్లాయిస్ సభ్యులు ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపారు.
మసీదు ప్రారంభం:
అనంతరం పక్కనే నిర్మించిన మసీదుకు సీఎం కేసీఆర్ చేరుకున్నారు. గవర్నర్ తో పాటుగా వచ్చిన సీఎం గారికి ఇస్లాం సాంప్రదాయ పద్ధతిలో ఇమామ్, తదితర మత పెద్దలు స్వాగతం పలికారు. అనంతరం ఇస్లాం మత సాంప్రదాయం ప్రకారం ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనల్లో సిఎం పాల్గొన్నారు. మంత్రి మహమూద్ అలీ, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సహా పలువురు ఇస్లాం మత పెద్దలు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ మాట్లాడుతూ…
“ఇది చాలా సంతోషకరమైన సమయం. మన పై అల్లా దయ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఇలాగే సౌభ్రాతృత్వం వెల్లివిరియాలి. ఇందుకోసం ప్రభుత్వం తన కృషిని కొనసాగిస్తుంది. ఈ దిశగా ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటుంది. పాత సెక్రటేరియలోని మసీదును మించి కొత్త సెక్రటేరియల్ లో మసీదును సుందరంగా నిర్మించుకోవడం నాకు చాలా సంతోషాన్నిస్తున్నది. ఈ సందర్భంగా తెలంగాణతో పాటు యావత్ భారతదేశంలోని ముస్లింలకు నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. లౌకికత్వాన్ని చాటేలా ఆలయాలు, మసీదులు, చర్చిలు వెలయాలి. ఈ మూడు ఒక్కచోట ఉన్న ప్రదేశానికి ఉత్తమ నిదర్శనంగా మన తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్ నిలుస్తుంది. హిందూ,ముస్లిం, క్రిస్టియన్ సోదరులు కలిసిమెలిసి ముందుకు సాగుతూ, ప్రార్థనలు చేసుకొంటూ ఐకమత్యాన్ని చాటుతున్నారు. యావత్ భారతదేశం తెలంగాణను చూసి నేర్చుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఇదే విధమైన సహృద్భావ పరిస్థితులు సదా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను. ఎల్లవేళలా శాంతి నెలకొని ఉండాలని అల్లాను ప్రార్థిస్తున్నాను.” అని తెలిపారు.
అనంతరం సెక్రటేరియట్ సందర్శన కోసం గవర్నర్ డాక్టర్ సౌందర్య రాజన్ తమిళసై తోడ్కొని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి సీఎం కేసీఆర్ చేరుకున్నారు. వారికి సచివాలయ ప్రాంగణాన్ని కలియదిరిగి చూయించారు. ఒక్కో ఫ్లోర్ గురించి వివరించారు. అనంతరం గవర్నర్ కు సాంప్రదాయ పద్ధతిలో ఆహ్వానం పలుకుతూ.. సీఎం కేసీఆర్ తన ఛాంబర్ కి తోడ్కొని వెళ్లి, శాలువాతో సత్కరించి పూల బోకెను అందించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బొట్టు కుంకుమలతో గవర్నర్ ని సాంప్రదాయ పద్ధతిలో సన్మానించారు. అనంతరం హై‘టీ’ తో గవర్నర్ కు సిఎం కేసీఆర్ ఆతిథ్య మిచ్చారు.
ఈ సందర్భంగా…సచివాలయ నిర్మాణ కౌశలాన్ని, ఏర్పాటు చేసిన అధునాతన మౌలిక వసతుల వివరాలను గవర్నర్ సీఎం కేసీఆర్ ను అడిగి తెలుసుకున్నారు. డా.బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయ నిర్మాణం చాలా గొప్పగా ఉందని గవర్నర్ తమిళి సై కొనియాడారు. సిఎం గారి ఆతిథ్యం స్వీకరించి కాసేపు ఆహ్లాదకరమైన వాతావరణం లో ఇష్టా గోష్టి జరిపారు. అనంతరం సచివాలయ సందర్శనను పూర్తిచేసుకుని తిరుగు ప్రయాణమైన గవర్నర్ గారికి ప్రధాన ద్వారం దాకా వెళ్ళి ముఖ్యమంత్రి వీడ్కోలు పలికారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు…హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, మహమూద్ అలీ, పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ ఎమ్మెల్సీ పల్ల రాజేశ్వర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, కోర్కంటి చందర్, ఎమ్మెల్సీ మధుసూదనా చారి, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జల నగేష్,ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీనివాసరాజు, గణపతి రెడ్డి, దేవదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మాధవరం నరేందర్ రావు, మంగ… సీఎం అధికారులు స్మితా సబర్వాల్ భూపాల్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్,ట్రైబర్ వెల్ఫేర్ సెక్రటరీ క్రిస్టినా చోంగ్తూ, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, రిటైర్డ్ ఐఎఎస్ జిడి అరుణ,రిటైర్డ్ ఐఎఎస్ జిడి అరుణ తదితరులు పాల్గొన్నారు.