Ultimate magazine theme for WordPress.

మోసకారుల మాటలు నమ్మొద్దు కేసీఆర్

Post top

మోసకారుల మాటలు నమ్మితే గోసపడుతాం.. అప్రమత్తంగా ఉండాలి : సీఎం కేసీఆర్

 

ప్రజాలహరి జనరల్ డెస్క్…

 

మోసకారుల మాటలు నమ్మితే గోసపడుతాం కాబట్టి.. అప్రమత్తంగా ఉండాలి.. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని దీవించాలని కోరుతున్నాను అని ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిని రెట్టింపు మెజార్టీతో గెలిపించాలి. మెదక్‌ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం అని కేసీఆర్ ప్రకటించారు. మెదక్ జిల్లాలో ఏర్పాటు చేసిన పార్టీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణలో వీఆర్‌వో వ్యవస్థను తీసేసినట్టు.. మా దగ్గర కూడా ఆ వ్యవస్థను తీసేయాలని మహారాష్ట్ర రైతులు అడుగుతున్నారని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రైతులు ఎట్లయితే బీఆర్ఎస్ పార్టీని గెలిపించారో, మహారాష్ట్రలో కూడా బీఆర్ఎస్‌ను గెలిపిస్తాం అని అక్కడి రైతులు అంటున్నారు. తెలంగాణ రైతులకు అందే సదుపాయాలు మాకు అందాలని చెప్పి మహారాష్ట్ర రైతాంగం అడుగుతున్నది. నేను పోతే బ్రహ్మరథం పడుతున్నారు. కానీ ఇక్కడేమో కాంగ్రెస్ పార్టీ మూడు గంటల కరెంట్ చాలని అంటోంది.. బీజేపీనేమో మీటర్లు పెట్టాలని అంటోంది. మూడు గంటల కరెంట్ సరిపోతదా..? 24 గంటల కరెంట్ ఉండటంతో.. ఎవరికి ఇష్టమున్న సమయంలో వాళ్లు నీళ్లు పెట్టుకుంటున్నారు. మునుపు ఈ టైం నుంచి గీ టైం వరకు కరెంట్ వస్తదంటే.. ఒక్కటే సారి లోడ్ ఎక్కువై ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయేవి. ఇవాళ మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడం లేదు. ఒక వేళ ఎప్పుడైనా ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతే ఐదు నిమిషాల్లో రిపేర్ చేసి పంపిస్తున్నారని కేసీఆర్ తెలిపారు.

 

200 ఇచ్చినోడు.. 4 వేలు ఇస్తమంటే నమ్మొచ్చునా..?

 

ఇవాళ కాంగ్రెసోళ్లు ఆపద మొక్కులు మొక్కుతున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు 200 పెన్షన్ ఇచ్చినోడు.. ఇవాళ కొండ మీద కోతిని తెచ్చిస్తా.. ఏడు చందమామలు తెచ్చిస్తా.. ఆరు సూర్యులు తెచ్చిస్తా.. 4 వేల పెన్షన్ ఇస్తా అంటడు. 200 ఇచ్చినోడు.. 4 వేలు ఇస్తమంటే నమ్మొచ్చునా..? నమ్మే ముచ్చటేనా..? ఇదేమన్న ఆరాజ్ పాటనా? మోసం చేయాలంటే మాకు ప్రకటించరాదా..? అట్ల మేం మోసం చేయం. కానీ మనం కూడా పెన్షన్ పెంచుకుందాం. ఒక క్రమ పద్ధతిలో పెన్షన్లు పెంచుకుంటూ పోదాం. అక్టోబర్ 16న మహాసభ ఉంది. అక్కడ అన్ని కూడా మనం ప్రకటించుకుందాం అని కేసీఆర్ పేర్కొన్నారు.

 

సర్కార్‌ను నడిపించడమంటే.. సంసారం చేసినట్టే

 

సర్కార్‌ను నడిపించడమంటే.. సంసారం చేసినట్టే ఉంటది అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కల్యాణలక్ష్మి మొదట్లో 51 వేలు ఇచ్చుకున్నాం. ఆ తర్వాత లక్షా 16 వేలు పెంచుకున్నాం. పెన్షన్లు కూడా వెయ్యి నుంచి 2 వేలు పెంచుకున్నాం. ఇదే మాదిరిగా పెన్షన్లు కూడా పెంచుకుందాం. ఇవాళ రైతుల ఆత్మహత్యలు లేవు. రైతుల ముఖాలు ఇప్పుడిప్పుడే తెల్లపడుతున్నాయి. గ్రామాలు పచ్చబడుతున్నాయి. మంచి మంచి ఇండ్లు కడుతున్నారు. గ్రామంలో కార్లు పెరిగాయి. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాం. రాబోయే ఆరేండ్లలో రైతులు మరింత బ్రహ్మాండంగా తయారవుతారు. అద్భుతమైన ప్రగతి సాధిస్తున్నాం. వరి ధాన్యం పండించడంలో నంబర్ వన్ స్థాయికి ఎదిగాం. జపాన్ టెక్నాలజీతో అధునాతన రైస్‌మిల్స్ ఏర్పాటు చేస్తున్నాం. బ్రహ్మాండమైన పంటలు పండిస్తున్నారు. దయచేసి మీ అందర్నీ కోరేది ఒక్కటే.. దేశానికే తలమానికంగా ఉన్న ఈ రాష్ట్రం.. మనం ఎక్కడ పోయినా బ్రహ్మరథం పడుతున్నారు.. ఈ స్థితిని కాపాడుకోవాలి. ఇంకా ధనిక రాష్ట్రంగా ఎదగాలి. పేదలందరిని ఆదుకోవాలి అని కేసీఆర్ అన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.