మన్యంకొండలో రూ.15 కోట్లతో బడ్జెట్ హోటల్
మహబూబ్‌నగర్ : మన్యంకొండ క్షేత్రం దిగువ పర్యాటకుల సౌకార్యర్థం రూ.15 కోట్లతో బడ్జెట్ హోటల్ నిర్మిస్తున్నట్లు ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మన్యంకొండ స్టేజీ సమీపంలోని అలివేలు మంగతాయారు ఆలయానికి సమీపంలో హోటల్ కోసం ప్రతిపాదించిన స్థలాన్ని అధికారులతో కలిసి మంత్రి గురువారం పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. హోటల్ నిర్మాణం పూర్తయితే దూర ప్రాంతాల పర్యాటకులు, భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. మన్యంకొండ ఆలయాభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. మన్యంకొండపై భక్తుల కోసం నిర్మిస్తున్న 18 గదుల పనులు చివరి దశకు చేరాయన్నారు. అలాగే అలివేలు మంగ ఆలయం వద్ద ఏసీ ఫంక్షన్‌హాల్ నిర్మిస్తున్నామని తెలిపారు. అలాగే రాష్ట్రంలోనే తొలి గణేశ్ భవన్‌ను మహబూబ్‌నగర్‌లో రూ.30 లక్షలతో నిర్మించినట్లు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా గణపయ్యకు మంత్రి పూజలు చేశారు. ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.