రైతు వ్యతిరేకులతో ‘జై కిసాన్’ నినాదం పలికించాలి : సీఎం కేసీఆర్
జాతీయ స్థాయి రైతు నేతలతో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా సందర్భంగా కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు తీర్మానం చేశాయి. గ్రామస్థాయి నుంచే రైతులు కావాలని, గ్రామస్థాయి నుంచే దేశ రైతాంగాన్ని ఐక్యం చేసేందుకు సీఎం కేసీఆర్‌ను నాయకత్వం వహించాలని కోరుతూ సంఘాలు తీర్మానం చేపట్టాయి. జాతీయ స్థాయిలో రైతుల ఐక్యవేదిక ఏర్పాటు తీర్మానాన్ని అనుసరించి.. మరో సమావేశం ఏర్పాటు చేసి.. విధి విధానాల రూపకల్పనకు సమావేశంలో తీర్మానం చేశారు. అలాగే వ్యవసాయరంగంలో సమస్యలు, పరిష్కారాలపై రైతు సంఘాల నేతలు చర్చించారు. భవిష్యత్ దేశీయ వ్యవసాయ రంగం కునారిల్లిపోనుందని హెచ్చరించారు. ఈ ప్రమాదకర పరిస్థితుల్లో ఈ సమస్యలకు కారణాలు, పరిష్కార మార్గాలపై భేటీలో చర్చించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఉద్యమ పంథాలోనే పార్లమెంటరీ సమన్వయంతో జమిలి పోరాటాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. తద్వారా వ్యవసాయ, దేశ రైతాంగ సమస్యలకు పరిష్కారం సాధ్యమవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనుసరించిన జమిలి పంథాను దేశ రైతాంగ సమస్యల పరిష్కారానికి అనుసరించడం ద్వారా గమ్యం చేరుకోగలమని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ వ్యతిరేకులతో నాడు ‘జై తెలంగాణ’ నినాదాన్ని అనిపించినట్టే.. నేడు రైతు వ్యతిరేకులతో ‘జై కిసాన్’ నినాదాన్ని పలికించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఆ దిశగా రైతు నేతలంతా ఐక్య సంఘటన కట్టి ప్రతినబూనాల్సిన అవసరం ఉందన్నారు. దేశ రైతుకు వ్యవసాయం ఒక జీవన విధానమని, రైతు బాగుంటేనే వ్యవసాయం బాగుంటుందని, వ్యవసాయం బాగుంటేనే సమాజం బాగుపడుతుందన్నారు. దేశంలో రైతు మర్యాదను నిలబెట్టి.. ఆత్మగౌరవం కాపాడేందుకు కలిసి పని చేద్దామని జాతీయ రైతు నేలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. వజ్రోత్సవ భారతంలోనూ అపరిష్కృత రైతాంగ సమస్యలు అనేకం ఉన్నాయని, వ్యవసాయ సమస్యలకు ఇంకా పరిష్కారాలు దొరకకపోవడం దురదృష్టకరమన్నారు.