మెగాస్టార్ ప్రశంస.. వైద్యుల్లో ఉత్సాహాన్ని నింపుతుంది : మంత్రి హరీష్ రావు
గాంధీ హాస్పిటల్లో పేషంట్ కు సినిమా చూపిస్తూ వైద్యులు సర్జరీ చేశారు. ఆపరేషన్ చేసిన వైద్యులను మంత్రి హరీశ్ రావు మెచ్చుకున్నారు. సర్జరీ విషయం తెలుసుకున్న చిరంజీవి గాంధీ ఆస్పత్రి వైద్యులను మెచ్చుకున్నారు. దాంతో చిరంజీవి లాంటి వారి ప్రశంస.. ప్రభుత్వం వైద్యులకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని మంత్రి హరీశ్ రావు అన్నారు.
‘ఒక ప్రాణాన్ని కాపాడేందుకు తమ వృత్తి ధర్మంలో నైపుణ్యతను ప్రదర్శించి, పేషెంట్ స్పృహలో ఉండేలా ఇష్టమైన సినిమా చూపిస్తూ, గాంధీ ఆసుపత్రి వైద్యులు నిర్వహించిన అరుదైన సర్జరీ అందరినీ ఆకట్టుకుంది. చిరంజీవి ప్రశంస.. మా ప్రభుత్వ వైద్యులకు మరింత ఉత్సాహాన్ని అందిస్తుంది’ అని మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. పేషంట్ స్పృహలో ఉండగానే గాంధీ ఆస్పత్రి వైద్యులు ‘అవేక్ క్రేనియటోమి’ అనే అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. ఆమెకు ఇష్టమైన హీరో చిరంజీవి నటించిన అడవిదొంగ సినిమా చూపిస్తూ.. మెదడులోని ట్యూమర్‌ని తొలగించారు. మీడియాలో వచ్చిన వార్తను చూసి మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. వెంటనే తన పీఆర్వో ఆనంద్‌ను గాంధీ ఆస్పత్రికి పంపించి.. పూర్తి సమాచారం తెలుసుకున్నారు. చిరంజీవి గురించి రోగి తన మాటల్లో చెప్పిన విషయాలను రికార్డ్ చేసి చిరంజీవికి చూపించారు. దాంతో తనపై అభిమాని చూపించిన రోగిని చూడటానికి త్వరలోనే గాంధీ ఆస్పత్రికి చిరంజీవి వెళ్తారని ఆయన పీఆర్వో తెలిపారు.