పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : మంత్రి గంగుల
కరీంనగర్ : పేదల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివారం కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామంలోని టీవీ గార్డెన్స్ లో బొమ్మకల్, గోపాల్ పూర్, దుర్శేడ్ గ్రామాలకు చెందిన 596 మంది లబ్ధిదారులకు నూతన ఆసరా పింఛను కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. పేదల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 1,15,000 పెన్షనర్లు ఉండగా కొత్తగా 31,822 మందికి పెన్షన్లు మంజూరు చేశామన్నారు. తెలంగాణ రాకముందు పింఛను మంజూరు కోసం దరఖాస్తు ఇచ్చి దండంపెట్టినా గత పాలకులు పెన్షన్లు ఇచ్చిన పాపాన పోలేదన్నారు. కొత్తగా పెన్షన్ రావాలంటే మరొకరి చావు కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్వయం పాలనలో అర్హులైన అందరికీ ఆసరా పింఛన్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ చెప్పారన్నారు.అర్హులైన ప్రతి ఒక్కరికి ఆసరా పెన్షన్ అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారన్నారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీలత, కరీంనగర్ ఎంపీపీ లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.