బీజేపీకి ఓటేస్తే మళ్లీ తండ్లాట తప్పదు
నమ్మిన పార్టీనీ, నమ్ముకున్న ప్రజలను అమ్ముకున్న వంచకుడు రాజగోపాల్ రెడ్డి అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. అమ్ముకోవడంలో కోమటిరెడ్డి బ్రదర్స్‌కు పెట్టింది పేరు అని చలోక్తులు వేశారు. తెలంగాణా ఉద్యమ సమయంలోనూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పక్కన చేరి తెలంగాణకు ద్రోహం చేసిన చరిత్ర వీరిద్దరిదన్నారు. శుక్రవారం ఉదయం మునుగోడు నియోజకవర్గ పరిధిలోని నాంపల్లి మండలం ముష్టిపల్లి గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు దాసరి లక్ష్మయ్యతో సహా ఆయన అనుచరులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు టీఆర్ఎస్లో చేరారు. ఇప్పటికే గ్రామ సర్పంచ్, ఎంపిటీసీలు గులాబీ గూటికి చేరిన విషయం విదితమే. ఆ క్రమంలోనే యావత్ ముష్టిపల్లి గ్రామం ఏకమై జై తెలంగాణ అంటూ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడారు. ‘తెలంగాణకు రావాల్సిన కృష్ణా జలాలను వైఎస్ సొంత జిల్లా కడపకు అక్రమంగా తరలిస్తుంటే పెదవులకు పదవులు అడ్డుపడి నోరుమెదపని నేతలు వీళ్లని మంత్రి విమర్శించారు. రాజీనామా చేస్తే ఉప ఎన్నికలే వస్తాయని, రాజగోపాల్ రెడ్డి చెబుతున్నట్లు అభివృద్ధి కోసమే రాజీనామా అయితే ఆయనతో పాటు అదే పార్టీ నుండి గెలిచిన మిగిలిన నలుగురు ఎందుకు రాజీనామాలు చేయలేదని మంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్ రెడ్డి రాజీనామా అన్నది ప్రజలకు తెలిసిపోయిందన్నారు. నియోజకవర్గ ప్రజలు వేసిన ఓట్లతో శాసనసభ్యుడిగా గెలిచి ప్రజలను అమ్ముకున్న ప్రబుద్ధుడు రాజగోపాల్ రెడ్డి అని ఆయన దుయ్యబట్టారు. ఏమరుపాటుగానైనా బీజేపీకి ఓటేస్తే మోటర్లకు మీటర్లు రావడం ఖాయమన్నారు. అంతే గాకుండా సాగునీరు, తాగునీరు కోసం మళ్ళీ తండ్లాటలు మొదలవుతాయని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేండ్లు గడుస్తున్న కృష్ణా జలాల్లో మన వాటా తేల్చనీయకుండా అడ్డుపడుతున్నందుకే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారా అంటూ మంత్రి జగదీష్ రెడ్డి ఎద్దేవాచేశారు.