బీజేపీని తరిమి కొడితేనే తెలంగాణ అభివృద్ధి : కడియం శ్రీహరి
ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో మత కలహాలు రెచ్చగొడుతూ.. అశాంతి వాతావరణాన్ని సృష్టిస్తున్న బీజేపీని తరిమి కొడితేనే రాష్ట్రం బాగుపడుతుందని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన బీజేపీ రాజకీయాలపై మండిపడ్డారు. జిల్లాకు చెందిన 114 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంచిన ఆయన నియోజకవర్గంలో రూ.3 కోట్ల అభివృద్ధి పనులకు ప్రొసీడింగ్ అందించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2014కు ముందుకరెంటు కోతలు, కరువుకాటకాలతో తెలంగాణ ప్రజలు వలస వెళ్లేవారు. ఎండాకలం వచ్చిందంటే పట్టణాలతో పాటు గ్రామాలు సైతం తాగునీటి కోసం ఇక్కట్లు పడేవని, రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ పరిస్థితులు లేవని ఆయన అన్నారు. ఇంటింటికీ మిషన్ భగీరథ నల్లా, 24 గంటల పాటు నాణ్యమైన కరెంట్ ఇస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే అని ఆయన అన్నారు. ఈవిషయంలో కేంద్రమంత్రులే తెలంగాణను మెచ్చుకున్నారని గుర్తు చేశారు. తెలంగాణలో బీజేపీ కుల, మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ది పొందుతున్నదని.. దీన్ని ప్రజలు గుర్తించి అప్రమత్తంగా ఉండాలని అన్నారు. తెలంగాణ మీద బండి సంజయ్‌కి అంత ప్రేముంటే విభజన హామీలైన కాజీపేట రైల్వే కోచ్, ఉక్కు ఫ్యాక్టరీ, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, గిరిజన యునివర్సిటీ, తెలంగాణకు ప్రాజెక్టులు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం మీద యాత్ర చేయాలని సూచించారు.