గణేశ్ నవరాత్రులపై సీపీ సమీక్ష.. సెప్టెంబర్ 9న నిమజ్జనం
ప్రజాలహరి..
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిర్వహించే గణేశ్ నవరాత్రులపై నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ సమీక్ష నిర్వహించారు. మండపాల నిర్వాహకులు, కమ్యూనిటీ సభ్యులతో సమన్వయం చేస్తూ కోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకొని గణేష్ నవరాత్రులు, నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు తమ వంతు సహకారాన్ని అందించాలని సీవీ ఆనంద్ కోరారు. గురువారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(ఐసీసీసీ)లో జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంధ్ర, ఆర్ అండ్ బీ, విద్యుత్, అగ్నిమాపక శాఖ, రవాణా తదితర శాఖల ఉన్నతాధికారులతో పాటు గణేష్ ఉత్సవ సమిమి సభ్యులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ ఆనంద్ మాట్లాడుతూ గణేష్ నవరాత్రి వేడుకలు ఆగస్టు 31న ప్రారంభమవుతాయని తెలిపారు. సెప్టెంబర్ 9వ తేదీన సామూహిక గణేష్ నిమజ్జన కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు జరిగిన అన్ని పండుగలను, వేడుకలను ప్రజల సహకారంతో ప్రశాంతంగా నిర్వహించామని తెలిపారు. అదే స్ఫూర్తితో గణేష్ వేడుకలు కూడా పూర్తి చేస్తామన్నారు. నిమజ్జన ఏర్పాట్లు, మండల ఏర్పాట్లపై పోలీసులకు పూర్తి సమాచారం ఇవ్వాలని, అలాగే గణేష్ మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన పరిసరాలు మొత్తం కవర్ అయ్యేలా చూడాలని సూచించారు. ఉత్సవ కమిటీ సభ్యులు వివిధ సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చారని వాటిని పరిష్కారించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తామన్నారు. నిమజ్జన ఊరేగింపు జరిగే మార్గంలో రోడ్లు మరమ్మతులు, ఇతర పనులు జరుగుతున్నాయని, నిమజ్జనానికి తగిన క్రేన్లను అందుబాటులో ఉంచుతామన్నారు.