Ultimate magazine theme for WordPress.

నాణ్యత లో రాజీ లేకుండా సచివాలయం నిర్మించాలి కేసీఆర్

Post top

ప్రజాలహరి ….

నాణ్యతలో ఏమాత్రం రాజీపడకుండా నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనులను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆర్ అండ్ బి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని, అధికారులను ఆదేశించారు. సెక్రటేరియట్ లోని అన్ని విభాగాల పనులను అద్భుతంగా, సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. నూతనంగా నిర్మిస్తున్న సచివాలయం నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం సాయంత్రం పరిశీలించారు. సెక్రటేరియట్ లో జరుగుతున్న నిర్మాణాలన్నింటినీ ముఖ్యమంత్రి కలియతిరుగుతూ నిశితంగా పరిశీలించారు. తొలుత నిర్దేశించుకున్న డిజైన్ల ప్రకారం పనులు జరుగుతున్నాయా? అని మంత్రిని, అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఏకకాలంలో అన్ని పనులు వేగంగా పూర్తి చేయడానికి అవసరమైన అన్ని చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు ఆలస్యం కావద్దని పేర్కొన్నారు. స్లాబుల నిర్మాణం, భవనం పైన డూమ్స్ ఏర్పాటు, ఇంటీరియర్ పనులతోపాటు ఫర్నీచర్ విషయంలో నూతన మోడల్స్ ఎంపిక చేసుకోవాలని సీఎం సూచించారు. మంత్రుల ఛాంబర్లు, మీటింగ్ హాల్స్, యాంటీ రూమ్స్ నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భవనం మధ్య భాగంలో సుమారు 2 ఎకరాల ఖాళీ స్థలంతోపాటు, సెక్రటేరియట్ ప్రాంగణంలో గ్రీనరీ, ల్యాండ్ స్కేపింగ్ పనులు అద్భుతంగా ఉండేలా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్రిల్స్ నిర్మాణ పనుల నాణ్యత గురించి సీఎం ఆరా తీశారు. రెడ్ స్టోన్, డ్రైనేజీ నిర్మాణ పనులను పరిశీలించారు. విజిటర్స్ లాంజ్ నిర్మాణ పనులను, సెక్రటేరియట్ వాల్ వెంబడి మట్టి ఫిల్లింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. సెక్రటేరియట్ కు వచ్చే విదేశీ ప్రతినిధులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సందర్శకులకు సౌకర్యవంతంగా ఉండేలా పార్కింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. వివిధ జిల్లాల నుండి సెక్రటేరియట్ కు వచ్చే ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలకు సౌకర్యంగా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. మంత్రులు, సెక్రటరీలు, ఆయా శాఖల సిబ్బంది సౌకర్యవంతంగా పనులు చేసుకునేందుకు వీలుగా ఛాంబర్ల నిర్మాణం చేపట్టాలన్నారు. నిర్మాణంలో ఉన్న సెక్రటేరియట్ లోనే… పనులు జరుగుతున్న తీరు గురించి సీఎం కేసీఆర్ సమీక్ష జరిపారు. పనులకు సంబంధించిన ఆల్బమ్ ను పరిశీలిస్తూ, ఒక్కో పని గురించి సమగ్రంగా అడిగి తెలుసుకున్నారు.

సెక్రటేరియట్ పనుల పరిశీలనలో సీఎం కేసీఆర్ తోపాటు మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యులు దీవకొండ దామోదర్ రావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, కె.పి.వివేకానంద, బేతి సుభాష్ రెడ్డి, ఎ.జీవన్ రెడ్డి, సీఎం సెక్రటరీ స్మితా సభర్వాల్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ వేద సాయిచంద్, ఆర్.అండ్.బి ఈఎన్సీ గణపతిరెడ్డి, ప్రభుత్వ నిర్మాణ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రాంమ్మోహన్, హైదరాబాద్ సీపీ సీ.వీ.ఆనంద్, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.