ఆబిడ్స్‌లో జాతీయగీతాలాపనలో పాల్గొననున్న సీఎం కేసీఆర్
ప్రజాలహరి…
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నది. ఈ నెల 8న వేడుకలు ప్రారంభం కాగా.. 22 వరకు కొనసాగనున్నాయి. వజ్రోత్సవాల్లో రోజుకో కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా.. ఈ నెల 16న సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం జరుగనున్నది. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం 11.30గంటలకు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
హైదరాబాద్ ఆబిడ్స్ జీపీవో సర్కిల్‌లో జరిగే జాతీయ గీతాలాపనలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పాల్గొనున్నారు. ఈ మేరకు ఆబిడ్స్, నెక్లెస్ రోడ్డు వద్ద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సామూహిక జాతీయ గీతాలాపనలో ప్రతిఒక్కరూ పాల్గొనాలని కోరారు. ప్రభుత్వ ఆఫీసులు, ప్రైవేట్ ఆఫీసులు, సంస్థలు, బ్యాంకులు, విద్యా సంస్థలు, మాల్స్, సినిమా థియేటర్లు ఇలా ప్రతిచోటా ఎక్కడివారక్కడ సామూహిక జాతీయ గీతాన్ని ఆలపించాలని కోరారు.