మహనీయుల అడుగుజాడల్లో పయణించాలి
* తెలంగాణ సర్కార్ ఆధ్వర్యంలో ఘనంగా స్వతంత్ర్య భారత వజ్రోత్సవ వేడుకలు
* వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థినులకు బహుమతుల ప్రదానం :
ప్రజాలహరి.. మిర్యాలగూడ..
#యువత, విద్యార్థులు మహనీయుల అడుగుజాడల్లో పయణించాలని స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్, ప్రఖ్యాత సోషల్ సర్వీస్ ఆర్గనైజర్ హమీద్ షేక్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా స్వతంత్ర్య భారత వజ్రోత్సవ వేడుకలు కొనసాగుతున్నాయని అన్నారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా “భారత స్వాతంత్ర్య సముపార్జన సాధనలో మహాత్మాగాంధీ, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు పాత్ర – 75 ఏండ్లలో భారత్ సాధించిన అభివృద్ధి” ( ద రోల్ ఆఫ్ మహాత్మాగాంధీ, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు ఇన్ అటెయినింగ్ ఫ్రీడమ్ ఫర్ ఇండియా…అచీవ్మెంట్ అటైన్డ్ బై ఇండియా డ్యూరింగ్ 75 ఇయర్స్) ” అంశంపై డివిజన్ స్థాయిలో వ్యాసరచన పోటీలను నిర్వహించినట్టు తెలిపారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఆదివారం మిర్యాలగూడ పట్టణంలోని సుందరయ్య పార్కులో జ్ఞాపికలను ప్రదానం చేశారు. అనంతరం హమీద్ షేక్ మాట్లాడారు. భారత స్వాతంత్ర్య సముపార్జన కోసం ఎందరో మహానుభావులు తమ జీవితాలను తృణపాయంగా త్యజించారని అన్నారు. ఆంగ్లేయుల దాస్య శృంఖలాల నుంచి భారతావనికి విముక్తి కల్పించేందుకు ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు తమ రక్తాన్ని చిందించారని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల గురించి విద్యార్థుల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు.75 ఏండ్లలో భారత్ సాధించిన అభివృద్ధి, వెనకబాటుతనానికి గల కారణాల గురించి విద్యార్థుల్లో ఆలోచనా సరళిని పెంపొందించాలని అన్నారు. అనంతరం వ్యాసరచన పోటీలో డివిజన్ స్థాయిలో ప్రథమ బహుమతి సాధించిన ఆదిత్య హై స్కూల్ విద్యార్థిని సాయి శిరీషను, ద్వితీయ బహుమతి పొందిన కైరళి స్కూల్ విద్యార్థిని రిషితను హమీద్ షేక్ అభినందించారు. ఈ కార్యక్రమంలో కైరళి ప్రిన్సిపాల్ షేక్ అహ్మద్, గోపి రెడ్డి, జానకి రాములు, తదితరులు పాల్గొన్నారు.