ఉరకలెత్తిన నూతనోత్సాహం…ఉప్పొంగిన దేశభక్తి
* 2500 అడుగుల జాతీయ పతాకంతో భారీ ర్యాలీ
* మున్సిపల్ చైర్మన్ భార్గవ్ ఆధ్వర్యంలో నిర్వహణ
త్యాగధనులను స్మరిస్తూ పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు
* మిర్యాలగూడలో ఘనంగా స్వాతంత్ర్య భారత వజ్రోత్సవ సంబురాలు
ప్రజాలహరి.. మిర్యాలగూడ..
75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వతంత్ర్య భారత వజ్రోత్సవాలు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో ఉరకలెత్తిన నూతనోత్సాహంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఆరో రోజు శనివారం మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ ఆధ్వర్యంలో 2500 అడుగుల మువ్వన్నెల త్రివర్ణ పతాకంతో పురపాలిక కార్యాలయం నుంచి రాజీవ్ చౌక్ వరకు భారీ ర్యాలీ తీశారు. స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వర రావు, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ భారీ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
దేశ సమగ్రతను, దేశభక్తి భావాన్ని పెంపొందించేలా కార్యక్రమాన్ని రూపొందించిన భార్గవ్ ను వారు అభినందించారు. భారీ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు, పలు విద్యా సంస్థల యాజమాన్యులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలకు ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. స్వతంత్ర్య భారత వజ్రోత్సవాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందన్నారు. 15 రోజుల పాటు నిర్వహించాల్సిన కార్యక్రమాలను ముందస్తుగా ప్రకటించిందన్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ జాతీయ జెండాల పంపిణీ చేపడుతున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి జెండాలను పంపిణీ చేసిందన్నారు. అంతేకాకుండా, 10 లక్షల మంది కొత్త లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పంద్రాగస్టు నుంచి ప్రారంభించనుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు ఈనెల 16వ తేదీన ఉదయం గం.11-30 నిమిషాలకు నిర్వహించనున్న సామూహిక జాతీయ గీతాలాపనలో నియోజకవర్గ ప్రజలంతా స్వచ్చందంగా పాల్గొని విజయవంతం చేయాలని డీఎస్పీ వెంకటేశ్వర రావు, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవీంద్ర సాగర్, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, ఇన్స్ పెక్టర్లు, ఎస్సైలు, స్థానిక కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు