
బాధ్యతా యుత బోధన చెయ్యాలి.. ఎంఈవో బాలాజీ నాయక్
ప్రజాలహరి:
తరగతి వారిగా విద్యార్థులందరూ విషయ సామర్ధ్యాలు కలిగి ఉండేలా బాధ్యతాయుతంగా బోధన చేయాలని మండల విద్యాధికారి బాలాజీ నాయక్ తెలిపారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకు మూడు రోజులపాటు ఏర్పాటుచేసిన తొలిమెట్టు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన ప్రసంగించారు. తరగతి గదిలో అభ్యసన ప్రక్రియలు అమలుపరిచే క్రమంలో విద్యార్థుల అభ్యసన స్థాయిని అంచనా వేసి వెనుకబడిన విద్యార్థుల అభ్యసన స్థాయిని పెంచే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. విద్యా సంవత్సరం చివరి నాటికి విద్యార్థులు అందరూ పైతరగతుల సామర్థ్యాలు కలిగి ఉండే విధంగా నిరంతర పర్యవేక్షణతో తొలిమెట్టు కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిందన్నారు. ఉపాధ్యాయులు వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకొని లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని తెలిపారు. ఆగస్టు 15 నుండి ఈ విద్యా సంవత్సరం పూర్తి అయ్యేవరకు తొలిమెట్టి కార్యక్రమం అమలు పరచాలని, ప్రాథమిక స్థాయి విద్యార్థులకు బేస్ లైన్ టెస్ట్ నిర్వహించి ప్రతివారం స్లిప్ టెస్టులు, గ్రాండ్ టెస్టుల ద్వారా గ్రేడింగ్ నమోదు చేయాలని మానిటరింగ్ అధికారులు వాటిని యాప్ లో పొందుపరిచి రికార్డు చేస్తారని, నిరంతర పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అమలవుతుందన్నారు. అలసత్వం వహించే ఉపాధ్యాయులపై కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా ఎంఈవో బాలాజీ నాయక్ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కోర్సు డైరెక్టర్ సాంబశివరావు, ప్రధానోపాధ్యాయులు నర్సిరెడ్డి, తిరుపతి, రిసోర్స్ పర్సన్ లు బాలు, శ్రీనివాస్ రెడ్డి, అహ్మద్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.